Sunday, April 13, 2014

అశాంత్

"చలో మానస.. ఉంటాను .. బై... ఈ వీకెండ్ నువ్వు ఫ్రీనా....ఓ సారి కుదిరితే కలుద్దాం"
"హ్మ్మ్ ...వెరీ  సారీ ... నాకు ఈ వీకెండ్ అసలు టైం లేదు..రేపు మార్నింగ్ డాన్సు క్లాసు ఉంది. 
మధ్యానం ఫ్రెండ్స్ అందరితో మూవీకి వెళ్ళాలి, ఈవెనింగ్ ఆంటీ వాళ్ళింట్లో డిన్నర్ కి పేరెంట్స్ తో కలిసి అటెండ్ అవ్వాలి. సండే మా కజిన్  క్లోజ్ ఫ్రెండ్ మ్యారేజ్ కి హైదరాబాద్ వెళ్ళాలి. నువ్వు నీ ప్లాన్ ని చేంజ్ చేసుకోకు. తర్వాత కలుద్దాం, బై ది వే, నీ వీకెండ్ ప్లాన్ ఏంటి?"
" నాకు పెద్దగా ప్లాన్ ఏమి లేదు, ఖాలినే, అప్పట్టికి అప్పుడూ ఆ టైంకి ఏది తోచితే అది చే ... "
"అదేంటి, ఖాలిగా ఎలా ఉండగలరసలు? నాకైతే పిచ్చి ఎక్కుతుంది. అయినా ఏ  ప్లాన్ లేకుండా అలా ఉంటె లైఫ్ బోర్ కొట్టదూ?"
"ఇలా ఫ్రెండ్స్ అందరూ బిజీ అయిపోతే ఖాళి సమయంతో కాలక్షేపం కాకుండా ఎం చేయగలను చెప్పు"
"ఓవర్ చేయకు, మనం నెక్స్ట్ వీకెండ్ తప్పకుండ కలుద్దాం" అని తను ఫోన్ పెట్టేసింది. 

ప్లానా పాలకూర పప్పా...ఖాళిగా ఉండడం చేతకాకే ఈ డాన్సులు, డిన్నర్లు, ప్లానింగులు, కాకరకాయలు. దీని పిచ్చితనం కాకపోతే అన్నీ ప్లాన్ చేసుకుంటూ, Q కట్టి వెళ్ళడానికి ఈ బ్రతుకేమైన రజినీకాంత్ "రోబో" సినిమానా? అనుకుని ఆవేశాన్ని అణచుకొని ఆఫీసులో ఏమీ తోచక  ఏమి చేయాలో పాలుపోక చివరికి "అత్తారింటికి దారేది" సినిమాని ప్లే చేసి చూస్తున్నాను. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ ని చూసినప్పుడల్లా - పాపం తనకు ఏ అత్తారింటికీ దారి తెలియక లోక కళ్యాణం కోసం చివరికి తన కల్యాణాన్ని సహితం కాదు అనుకోని ఆవేశంగా రాజకీయం అనే సూర్య కాంతాన్ని కట్టుకోవడం - అనే చేదు నిజం గుర్తొచ్చి ఆ దుస్సాహాసాన్ని జీర్ణించుకోలేక సినిమాని చూడలేక ఇబ్బంది పడుతుండగా

"హే నిశాంత్, మీట్ మిస్టర్ అశాంత్, నిన్నే మన టీంలో కొత్తగా జాయిన్ అయ్యాడు"  అంటూ ఆ అశాంత్ గాడిని నాకు పరిచెయం చేసాడు మా మేనేజర్.  
"హలో .. దిస్ ఇస్ అశాంత్"
"హలో ... దిస్ ఇస్ నిశాంత్"
"ఐఐటి బెంగుళూరులో చదివాడు..ఇంతకు ముందు మిరకిల్లో, ఒజోమెన్లో  పని చేసాడు. చాలా టాలెంటెడ్ ఫెల్లో, జెమ్ అఫ్ ఎ మ్యాన్!!". 
అదేంటో! ఈ మేనేజర్ గాడికి నేను తప్పితే ఈ ప్రపంచంలో అందరూ ఇంటెలిజెంట్ గానే కనిపిస్తారు. వీడు వీడి ఆత్రం తగలెయ్యా అని నా మనసులో మా మేనేజర్ని తిట్టుకోని బయటకి నవ్వుతూ 
"అవునా!  గ్రేట్ " అన్నాను.
ఒక సారి  ఆ అశాంత్ గాడిని పై నుండి కింది వరకు పరీక్షగా చూసాను. వాడిని చూస్తుంటే ఉత్త పోరంబోకులా ఉన్నాడే కాని ఏ కోణానా  ప్రోగ్రామర్ లా కనిపించట్లేదు. అయినా వాడిని అని ఎం లాబం? ఐఐటి అంటే చాలు ...అంట్లుతోమే వాడిని కూడా ఆర్కిటెక్టు చేస్తారు ఈ తిక్క సన్నాసులు. 

"తనకు పాత కంపెనీలో క్రియేటివ్  వర్క్ దొరకట్లేదు అని, మన కంపెనీ లో ఏదైనా మంచి ప్రోడక్ట్ బిల్డ్ చేయాలని మన టీంలో జాయిన్ అయ్యాడు. నువ్వు తనని గైడ్ చెయ్యి. కావలసినవి ఏవైనా ఉంటె తనకి హెల్ప్ చెయ్యి" 
"ఓ .. ఈస్ ఇట్ ... థెన్ మన టీం బెస్ట్ ప్లేస్.. ఐ విల్  గైడ్ హిం"
"యాయా..గుడ్" అని ఆ సన్నాసిని నాకు అప్పచెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మా మేనేజర్ సన్నాసి. 

క్రియేటివ్ వర్కా తోట కూర కట్టా! అక్కడినుండి తరిమేస్తే ఇక్కడికి వచ్చివుంటాడు వెదవ. అయినా బిల్డ్ చేసే వాడెవడూ ఇలా గంటకో బిల్డింగు మారడు అనుకుంటూ మరొకసారి వాడిని కింది నుండి పై వరకు పరీక్షగా మళ్లి  చూసాను.  ఎంత కన్విన్సు అవ్వాలని ట్రై చేసిన నా మనసు వాడు వెదవే అన్ని ఫిక్స్ అయ్యి కూర్చుంది తప్పితే  అస్సలు కన్విన్సు అవ్వనంటుంది. ఎలా అని నేను ఆలోచిస్తుండగా -

"హ . నిశాంత్ మీదే స్టేట్? ఎక్కడునుండి?" అని అడిగాడు వాడు. 
"అంధ్ర ..ఆగాగు... తెలంగాణా, కాదు కాదు ఆంధ్రే, లేదు లేదు తెలంగాణే ... హే ఏదో ఒకటహా.....హైదరాబాద్ నుండి"
"హైదరాబాదా... నేను అక్కడినుండే" అని  వాడి ఆమ్లెట్ మొహంపై నవ్వుని ఉల్లిపాయళ్ళ జల్లుతూ షేక్ హ్యాండ్ కోసం చెయ్యి చాచాడు. 
పోనిలే, చూడానికి వెదవలా ఉన్నా మన ఊరి వేదవే, మన వాడే అన్నమాట... అనుకోని ... ప్రాంతీయతత్త్వాన్ని అడ్డం పెట్టుకొని వాడితో చెయ్యి కలిపాను. ఈ లోకంలో పైగా ఇలాంటి వెదవలందరితో కలిసి బ్రతకాలంటే ప్రతి వాడికి ఇలా ఏదో ఒక పిచ్చి ఉండాలి - కులం పిచ్చో, మతం పిచ్చో, ప్రాంతం పిచ్చో, సినిమా పిచ్చో - లేకుంటే మనకు పిచ్చెక్కిపోదూ!

ప్రక్కన వీడి లాగే టీంలో కొత్తగా జాయిన్ అయిన జనత అందరు కలిసి గట్టిగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారో స్పష్టంగా వినిపించట్లేదు కాని ఈ పదాలు మాత్రం అక్కడక్కడ దొర్లుతున్నాయి

"స్టాన్ఫోర్డ్, యు సి బెర్క్లీ, పి ఎచ్ డి, రీసెర్చ్, స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్, గూగుల్, ఫేస్ బుక్,
హడూప్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, బిలియన్ డాలర్, యూరోప్, ఆస్ట్రేలియా, గ్రీన్ కార్డు, ఎచ్ 1 బి........ "

అందులో నుండి ఒకడు అశాంత్ గాడిని గుర్తుపట్టి మా వైపు పరిగెత్తుకుని వచ్చాడు. ఆ వెదవ, ఈ వెదవ ఒకే కాలేజీ, క్లాసు మేట్స్. కాకపోతే వాడు టాపరు, ఈ అశాంత్ గాడు లొఫరు, అంతే తేడా. లోఫర్ అనే అర్థం తెలియని వాళ్ళు గూగుల్ లో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడి చేసాను. ఇక్కడ దానర్థం సోమరి అని, పెద్దగా బుర్ర వాడని వెదవ అని, దాని వళ్ళ పండుకి కాయకి కూడ తేడా తెలియని అమాయకుడని.  అశాంత్ నాకు వాడి ఫ్రెండ్ని పరిచేయం చేసి మళ్లీ వస్తానని అక్కడినుండి వెళ్ళిపోయాడు. నేను అశాంత్ ఫ్రెండ్ కాంటీన్ వైపు నడుస్తూ ఉండగా కుతూహలంతో తనని అడిగాను -

"ఏం బాస్, ఎం మాట్లాడుకుంటున్నారు అందరూ?"
"ఏముంది బాస్, యుఎస్ కి ఎలా వెళ్ళాలని అందరు డిస్కస్ చేస్తున్నారు"
"జాయిన్ అయ్యి రెండు రోజులు కూడా కాలేదు, అప్పుడే యుఎస్ కి వెళ్ళాలని డిసైడ్ అయ్యారా?"
"యుఎస్ కి వెళ్ళాలని ఎప్పుడో డిసైడ్ అయ్యాము, కాని ఈ జాబులో జాయిన్ అయింది మాత్రం నిన్నే. నువ్వే చెప్పు బాస్, ఇన్ని రోజులు ఎవడైనా రాత్రనక పగలనక నానా కష్టాలు పడింది దేనికి? - ఓ చిన్న విల్లా, అందులో ఐశ్వర్య లాంటి పిల్ల - వీటి కోసమే కదా! ఈ బెంగుళూరులో ఇలాగే నేను ఇంకో వెయ్యి సంవత్సరాలు పని చేసినా భవంతి కాదు కదా కనీసం బాత్రూం కూడా కట్టించలేను. అందుకే యుఎస్ కి వెళ్ళి అక్కడ సంపాదించి ఇక్కడ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే, నాకు ఆనందం మన దేశానికి ఆదాయం రెండూ వస్తాయి. అయినా ఈ రోజుల్లో మనిషన్నాకా దేనికో ఓ దానికి అటాచ్ అవ్వాలి బాస్, లేకుంటే జీవితమే డిటాచ్ అయిపోతుంది. లైఫ్ లో త్రిల్ ఉండలాంటి ఇలాంటి "విల్" ఎట్లీస్ట్ ఒకటైన ఉండాలి. నీకు ఇలాంటి ఆశయాలు ఏమి లేవా బాస్?"
"ఎందుకు లేదు. నాకు ఒక ఆశయం ఉంది".
"ఏంటది?"
"నీ లాంటి మామకి అల్లుడవ్వాలని"
అది విని తను బళ్ళుమని నవ్వి "గుడ్ వన్ బాస్. అల్ ది బెస్ట్" అన్నాడు.
కాంటీన్ వచేసింది. తనకు దాహం వేస్తుంది అన్నాడు.
"కోక్ తాగండి దాహాన్ని తీర్చండి. యుఎస్ కి వెళ్తే అక్కడ ఎలాగూ ఇదే తాగాలిగా" అన్నాను నవ్వుతు తనతో
"కోక్ హెల్త్ కు మంచిది కాదు బాస్. దాంట్లో ఆసిడ్స్, యాడెడ్ షుగర్స్, అది తాగడం కంటే ఒక పెగ్గు విస్కీ తాగడం మేలేమో".
"ఓహ్ హో, అలా అయితే నీళ్లు తాగు"
"అబ్బే, టేస్ట్ లెస్, నీళ్లెం తాగుతాం బాస్".
"మరి ఎం కావలి నీకు?"
"ఫ్రూట్ జ్యూస్"
ఫ్రూట్ జ్యూస్ కి కొంచెం టైం పడుతుంది అన్నాడు ఆ కౌంటర్ వాడు.
ఇంతలో తనకు మీటింగ్ ఉన్న విషయం గుర్తొచ్చి, అంత టైం లేదని, దాహం తీరకుండానే అక్కడినుండు వెళ్లి పోయాడు వాళ్ళ ఫ్రెండ్.

అలా ఓ రెండు నెలలు గడిచాయి, ఆశాంత్ నేను బాగానే క్లోజ్ అయ్యాము. వాడి తిక్క పనులు, తింగరి వేషాలు నాకు అప్పుడప్పుడు కోపం తెప్పించిన వాడి అమాయకత్వం ఆ కోపాన్ని కూల్ చేసిది. ఇలా ఉండగా ఓ రోజు వాడు ఒక అమ్మాయని గాడంగా ప్రేమించాడని, ఆ అమ్మాయికి వాడి ప్రేమ విషయం మెసేజ్ రూపంలో ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడని నాతో చెప్పాడు.

"ఎవరురా ఆ అమ్మాయి?" అని అడిగాను.
"అదిగో ఆ అమ్మాయికే నేను మెసేజ్ పెట్టింది" అన్నాడు. 
"ఏది? ఆ డియోనా పక్కన కూర్చుందే, నల్ల డ్రెస్సు వేసుకుని పెదవులకు లిప్స్టిక్ రాసుకుంటుందే ఆ అమ్మాయికా?"
"కాదు.. "
"మరి, బ్లు టిషర్టు వేసుకొని స్నాప్ డీల్ లో హాట్ హాట్ డీల్స్ కోసం ఆవేశంగా వెతుకుతుందే ఆ పిల్లా?"
"ప్చ్ ... తనూ కాదు"
"హ్మ్మ్ ... మరి ఆ రెడ్ కలర్ స్కర్ట్ వేసుకొని, ఈ లోకాన్ని మరచి ఆ ఐఫోన్లో మునిగి మెస్సేజుల మీద మెస్సేజులు పంపుతుందే ఆ పాపా?" 
"కాదు కాదు ... నువ్వు ముందు  చూపించిన అమ్మాయికే"
"ఏంటి? నువ్వు కొంప తీసి డియోనకు కాని మెయిల్ పెట్టావా ఏంటి?"
కొంచెం గర్వంతో కూడిన సిగ్గుతో ...  తానే అని తలూపాడు. 
"వారిని దుంప తెగ, దానికి ఎందుకు పెట్టవురా మెసేజు. నీకు ఇంకా ఎవరు దొరకలేదా?" అని గట్టిగ అరిచాను. 
"ఏ? తనకి నువ్వు కూడా మెసేజ్ పెట్టావా ఏంటి?" అన్నాడు అర్థం కాని ఆశ్చర్యంతో. 
"నీ బొందా.. ఆవిడ ఎవరనుకుంటున్నావు? అయిన నీకసలు బుర్రుందా? పెట్టే ముందు నన్ను అడగక్కర్లేదు?"
"ఏ .. మన టీంలో ఎవరు లవ్ లెటర్ రాసినా ముందు నిన్నడగాలనే రూల్ ఏమైనా పెట్టారా?" అని అమయకంగా అడిగాడు.  
"నీ మొహం .. నువ్వు పెట్టింది  అమ్మాయికి  కాదు, డియోన మోసెస్కి. తానే ఈ ఇండియా సెంటర్ మొత్తానికి  డైరెక్టర్. అయినా ... నువ్వేం మనిషివిరా... నీకు అమ్మాయికి ... అమమ్మకు కూడా తేడా తెలియలేదా. తన యేజ్ ఏంటి నీ యేజ్ ఏంటి. నీ కంటే కనీసం పది యేండ్ల అయిన పెద్దది. అసలు తనకు మెస్సేజు పంపాలనే ఆలోచన నీ మట్టి బుర్రకు ఎలా తట్టిందిరా" అన్నాను వాడిపై విరుచుకు పడుతూ. 
"ఏమో! దూరం నుండి ఒకటి రెండు సార్లు చూసాను. ఓ రోజు మార్నింగ్ ఎంట్రన్స్ గేటు దెగ్గర తనను క్లోజ్అప్ లో చూసినప్పుడే నా హార్ట్ ఫ్రేమ్ మొత్తం తన బ్యూటిఫుల్ ఫేస్ తో నిండి పోయింది. నా మనసు తానే నాకు సరైన జోడి అని చెప్పడంతో ఆవేశంలో టెంప్ట్ అయ్యి వెంటనే మెయిల్ చేశాను.  కాని ఇలా అవుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. అయినా సరే, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, ఈ విధి ఎన్ని పరీక్షలు పెట్టినా సరే, నిస్వార్థమైన నా ప్రేమే గెలుస్తుంది" అని దిగులు ఫేస్తో డియోనా వైపు చూస్తూ కుర్చీ మీద కూలపడిపోయాడు. 
"నువ్వు నీ తోక్కోలో మనసు... కొంచెం ఎర్రగా బుర్రగా ఉంటె చాలు .. డైరెక్టర్లకె లవ్ లెటర్స్ రాస్తార్రా? పైగా దానికి ప్రేమ దోమ అనే టైటిల్ తగిలించి ఎవడి ఇష్టం వచ్చిన సినిమా వాడు తీసి అందులో హీరోల్ల ఫీల్ అయిపోవడం... దాన్ని జనాల పై రుద్దడం. ఛా.. మీరు మారర్రా!"
"నీకేం తెలుసు ప్రేమ గురించి. నీ జీవితంలో ఎవరినైనా గాడంగా ప్రేమిస్తే నీకు తెలిసేది. అదొక అందమైన అనుభూతి, దాన్ని అందుకోవడం నీలాంటి అంధుల వల్ల అసాధ్యం. తల్లి గర్బంలో ప్రాణం పుడితే, మనిషి గుండెల్లో ప్రేమ పుడుతుంది. గాయ పడిన వాడికే నొప్పి తెలిసేది, ప్రేమించిన వాడికే దాని లోతు తెలిసేది. నీకు ఈ విషయం ఎప్పటికి తెలియదు."
అబ్బో, వీడు ప్రేమలో పూర్తిగా మునిగిపోయాడు. వీడిని ఈ సముద్రం లోనుండి బయటకి లాగటం చాలా కష్టం. కాని ఆరు నూరైనా...నూరు కోడి కూరైనా సరే .. నేను వీడిని ఈ పెను ప్రమాదం నుండి తప్పించాలి. ఈ ఉప్పెనని ఎలాగైనా ఆపాలి. అదే నా కర్తవ్యం, అదే నా ధర్మం, అదే నా బాధ్యత, అదే నా ..  (హేయ్ .. ఆపవోయ్ ... నువ్వు నీ ఓవర్ యాక్షన్.. కధ కంటిన్యూ చెయ్యి)
"చూడు తమ్ముడు, నీ ప్రేమ నిజమే కావొచ్చు, షాజహాన్ తర్వాత చరిత్రలో నీ పేరే ప్రేమ కి సినానింగా నిలవొచ్చు, కాని డియోనా  నీకంటే పది ఏండ్లు పెద్దది. ఎంత క్యాలికులేట్ చేసిన ఈ లెక్క తేలదు నాన్నా. నా మాట విని నువ్వు తనను మర్చిపో".
"ఎందుకు మర్చిపోవాలి? రాముడి కంటే సీత పెద్దది. కృష్ణుడి కంటే రాధ పెద్దది, టెండూల్కర్ కంటే అంజలి పెద్దది. వాళ్ళు ప్రేమించుకోలేదా? మేము అంతే!"
"ఒరేయ్, ఒరేయ్ ... ఒరేయ్. నా ఓపికకి పరీక్ష పెట్టకురా. రాముడు వేల యేండ్లు బ్రతికాడు, కృష్ణుడు వేల పెండ్లిలు చేసుకున్నాడు, ఇక టెండూల్కర్ వంద సెంచరీలు కొట్టాడు. నీ జీవితంలో వంద లైన్ల కోడ్ కూడా రాస్తావో లేదో నాకు డౌటే. ఎందుకురా యుగ పురుషులతోటి, భారత రత్నాలతోటి నీకు పోటి. మాములుగా  బ్రతకరా, మనుషలతో కలవరా, బాగు పడతావ్."
"నీకు నేనంత చెప్పినా అర్థం అవ్వదు. ప్రేమ గుడ్డిది. దానికి యేజ్ తో పని లేదు".
"ప్రేమ గుడ్డిదైతే  కావొచ్చు కాని డియోనా గుడ్డిది కాదు. తాను ఆ మెసేజ్ చుసిదంటే నీ ఉద్యోగం ఊడటం కాయం.
డైరెక్టర్ కి లవ్ లెటర్ రాసిన కారణంగా నీకు ఇక్కడే కాదు, ప్రపంచం లో ఎక్కడా ఉద్యోగం రాదు. ఓ రకంగా అది నీకే మంచిది, అప్పుడు నీ ఇష్టం, ఎలిజిబెత్ రాణినె ప్రేమిస్తావో, ప్రతిభా పటేల్ కె మెసేజ్ పెడతావో నీ ఛాయస్. నిన్ను అడిగేవాడు ఉండడు".
"తను ఆ మెసేజ్ చూస్తే నా ఉద్యోగం నిజంగానే ఊడుతుంది అంటావా? నాకు బయం వేస్తుంది. మరి ఇప్పుడు ఎలా. హా .. ఐడియా వచ్చింది ... తనకి "టు" అడ్రస్ తప్పని, అది ఆక్చువల్ గా నీకు పంపాల్సిన మెసేజ్ అని ఇంకో మెసేజ్ పెట్టనా? నువ్వు ఇదే ..".
"లాగి పెట్టి కొడితే లాహోర్ సెంట్రల్ జైలులో పడతావ్.  ఇలాంటి తింగరి పని చేసి నన్నూ దీంట్లో ఇరికిస్తే తోలు తీస్తా. నువ్వే తప్పైంది అని సారీ చెప్తూ మెసేజ్ పెట్టు, తను అర్థం చేసుకుంటుందిలే. వెళ్ళు .. ఆగు ..
చూడు .. ప్రేమ ఎంత త్వరగా పుడితే అంతే త్వరగా అది చస్త్హుంది. ఎప్పటికైనా గుర్తుంచుకో. ఇప్పుడు వెళ్ళు."
ఒక పది నిమిషాల్లో వాడు ఎగిరి గంతులేస్తూ మళ్లీ నా దెగ్గరికి వచ్చాడు. వాడి ఆనందం చూసి నాకు భయం స్టార్ట్ అయింది.
"అన్నా.. ప్రాబ్లెమ్ సాల్వ్ అయింది. డియోనా చూడకుండా నేను ఆ మెసేజ్ డిలీట్ చేసేసా. సింపుల్, ఇక ఏ మెసేజ్ పెట్టాల్సిన అవసరం లేదు."
"అంటే..నువ్వా మెసేజ్ ఇంకా పంపలేదా?"
"లేదు..పంపాను. కాని నా sentboxలో నుండి ఆ మెసేజ్ డిలీట్ చేశాను, అంతే సింపుల్."
"ఒరయ్ ఒట్టేసి నిజం చెప్పరా, నేను ఎవరికీ చెప్పను.  నువ్వు అసలు చదివింది IIT లోనా ITI లోనా!
నీ sentbox లో నుండి మెసేజ్ డిలీట్ చేస్తే తన అకౌంట్ లో నుండి డిలీట్ అవుతుంది అని ఎలా కనుకున్నావురా, కర్మ. పోస్ట్ చేసిన మెసేజ్ అంటే  ఇన్విజిలేటర్ కి ఇచ్చేసిన ఆన్సర్ షీట్ లాంటిది. తప్పులు చేసి ఉంటే తల బాడుకోవడమే కానీ దిద్దుకోడానికి స్కోప్ లేదు. వెళ్ళు, నీ బ్రెయిన్ ని స్ట్రెయిన్ చేయకుండా నేను చెప్పింది చెయ్యీ."
"హేహే... నువ్వు ఎప్పుడు నాదే తప్పంటావ్. ఆ ఫేస్ బుక్ వాడికి ఈ చిన్న ఆప్షన్ పెట్టాలన్న ఆలోచన కూడా రాలేదు. వాడు నాకంటే పెద్ద వెదవ, వాడిని ఏమి ఆనవు" అని బాద పడుతూ వెళ్లి పోయాడు.


భగవంతుడా! ఈ అశాంత్ గాడిని దారిలో పెట్టడం కంటే ఆ తప్పిపోయిన మలేషియన్ MH370 విమానాన్ని వెతికి పట్టుకోవడం చాలా సులబం తండ్రి అని దండం పెట్టుకుని తిరిగి చూశాను - వాడు నవ్వుతూ వచ్చి మళ్లీ నా ఎదురుగా నిలబడ్డాడు.........



Sunday, March 2, 2014

మ'రణం'

"కృపయా ధ్యాన్ జిదియే..తోడి ధేర్  మే జానెవాలి  గాడి నెంబర్ ఏక్.  ఆట్.  చార్. శూన్య్.   బెంగళూరు విశాకపట్నం ప్రశాంతి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫాం నెంబర్ ధో పర్ ఖడే  హుయి హే
  ....... మె  ఐ ఎక్స్పెక్ట్  యువర్  attention  ప్లీజ్ ........."

పచ్చ రంగు పడింది. రైలు కదిలింది. ప్రస్థానం మొదలైంది. పట్టాల మీదుగా రైళ్ళు వస్తూ పోతూ ఉన్నాయి. జనాలు హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు. అప్పటి వరకు వినిపిస్తున్న వింత వింత శబ్దాలు కాస్త నెమ్మదిగా నిశబ్దంగ మారుతున్నాయి. అలలుగా నా ఆలోచనలు ... ఒక దాని వెంటూ ఒకటి గతాన్ని తవ్వుకుంటూ, జ్ఞ్యపకాల్ని వెతుకుంటూ, కాలాన్ని ఈదుకుంటూ  తీరాన్ని చేరుకుంటున్నాయి -

మనుసులో ఏదో అలజడి, 
ఏదో తెలియని అశాంతి, సమాధానం దొరకని సమస్య - ఓ ప్రశ్న! కాదు కాదు అన్ని ప్రశ్నలే. అసలు ఏది నిజం? దేన్ని నమ్మాలి?
విడిచిన స్థలమా! గడిచిన క్షణమా! 
అనుభవమా! ఆశయమా!
గమ్యమా! గమనమా!
సేవా! స్వార్థమా!
చీకటా! వెలుగా! 
నిజామా! భ్రాంతా!
ప్రేయసా! ప్రేమా! 
నేనా! తనా!

"ఏంటిరా?? అంత దీర్గంగా ఆలోచిస్తున్నావు? దేని గురించి?" అని తను చదువుతున్న పుస్తకాన్ని మూసేసి నా వైపు చూసి అడిగాడు. 

"అభి ... నీకెప్పుడూ అనిపించలేద ఈ జీవితం ఓ అంతు చిక్కని ప్రశ్నని 

నాకేమి  అర్థం కాకుండా ఉంది.....అంత తికమకగా ఉంది. 
అంతా తెలిసినట్టే ఉంటుంది ఒక నిమిషం. మరో నిమిషం అసలేమి అర్థం కాకుండా ఉంటుంది. 
దూరంగా వెలుతురుని చూపించి ఆశ పెట్టిస్తుంది. తీరా అక్కడికి వెళ్తే అది అబద్దం అని ఆట పట్టిస్తుంది. 
అందం, తెలివితో అందరిని ఊరిస్తుంది. కాని ఎవరికీ అందకుండా వాటిని పదిలంగా దాచేస్తుంది. 
అంతా నాదే, అందరూ నావాళ్ళే అని నమ్మమంటుంది. నమ్మే లోపే అవటి వాడిని చేసి, అనాదగా మార్చి ఎగతాళి చేస్తుంది.  
అభిమానం పెంచుకుంటే అది వ్యామోహం అవుతుంది. తెంచుకుంటే వైరాగ్యంగా మారుతుంది.
ముందుకి చూస్తే జీవితాన్ని ఎలా అయిన మలచుకోవొచ్చు అనే ధైర్యం. కాని వెనక్కి తిరిగి చూస్తే నేను కేవలం విధి ఆడించినట్టు ఆడే ఓ బొమ్మని అని తెలిసి భయం.
దేనికోసం ఈ ఆరాటం ఎవరికోసం ఈ పోరాటం.
బ్రతకడం కోసం భ్రమ పడాలో, భ్రమ పడడం కోసమే బ్రతకాలో తెలియట్లేదు.
జవాబు తెలియని ప్రశ్నగా మారింది నా జీవితం". 

"అసలు ఏ ఆధారం లేకుండా మనల్ని మనం మోసం చేసుకోకుండా బ్రతకడం సాధ్యమంటావా? ఈ రోజుల్లో కూడా అలా కుదురుతుందంటావా?"

"నీవు దేని కోసం మధన పడుతున్నవో నాకు తెలియదు. ఆ ప్రశ్న నీకు ఎదురైంది అంటే ఏదో సమస్యతో సతమతం అవుతున్నావని దాని అర్థం.  
కాని నూవన్న జీవితమే...ఒక్కోసారి బ్రతకాలి అనుకునే వాడిని చంపుతుంది. నా లాంటి చావలనుకునే వాడిని బ్రతికిస్తుంది, మళ్ళి ప్రశ్నగా మారుతుంది" అన్నాడు అభి. 

"ఏంటి? నువ్వు చావలనుకున్నావా? అవునా? అంత కర్మ నీకేం పట్టింది? అసలు ఎప్పుడూ చెప్పలేదే" ఆశర్యంతో అడిగాను నేను. 


"కొన్ని విషయాలు అర్థం అవ్వాలంటే 
అనుభవం కావలి, సమయం రావాలి. సమస్య ఉన్నప్పుడే సమాధానం కోసం వెతుకుతాము. సమయం వచ్చినప్పుడే అనుభవం తనని తాను రుజువు చేసుకుంటుంది.
నీకు గుర్తుందో లేదో ... చిన్నప్పుడు
నీతో తప్ప మనవారి ఎవరితో అంత స్నేహంగా ఉండే వాడిని కాను.
మీతో ఆటలు అస్సలు ఆడే వాడిని కాను.  ఎందుకో తెలుసా?
నాకు అప్పుడు ఆస్తమా ఉండేది ...శ్వాస పరంగా తీవ్రమైన సమస్యతో బాధ పడేవాడిని
ఆడితే త్వరగా అలుపోచ్చేది...చల్ల గాలి కాస్త పీలిస్తే చాలు చచ్చేంత జ్వరం వచ్చేది
మీరందరూ ఆటపాటల నడుమ ప్రేమ అనురాగాలతో హాయిగా పెరిగితే 
నేను మాత్రం రోగాల చుట్టు నిరాశ నిస్పృహల మధ్య విరక్తితో నలిగాను
బాల్యం మీఅందరికి తియ్యని అనుభూతుల్ని పంచి పెడితే
నాకు మాత్రం చేదు జ్ఞ్యాపకాల్ని విడిచపెట్టింది. 
అప్పుడు నేనెప్పుడూ మౌనంగా ఉండే వాడిని, ఒంటరిగా తిరిగే వాడిని . 
అవునూ ...  ఒంటరి అంటే  గుర్తోచ్చింది  ... నువ్వెప్పుడైన ఒంటరిగా  ఉన్నావా?
అది ఎంత బయంకరంగా ఉంటుందో తెలుసా?
జీవతాన్ని ఎంత బారంగా మలుస్తుందో నీకు తెలుసా?
ఒంటరితనం అంటే ఏకాంతంగా అందరికి దూరంగా బ్రతకడం కాదు
చుట్టూ అయిన వాళ్ళు అందరూ ఉన్నా ఎందుకు బ్రతకాలో అర్థం కాకపోవడం
అబద్దాన్ని నమ్మలేక నిజాన్ని దిగమింగ లేక ఆశ నిరాశల మధ్య తన్నుకుచావడం 
నిజం ... రోగంతో ఉన్నవాడికి జీవితమే నరకం
నా బాధను పంచుకోలేక, నా వ్యధను తీర్చలేక 
ఏమి చేయాలనీ అసహనంతో కుమిలి పోయే మా అమ్మానాన్న
.  
నేను మీతో కలవట్లేదని  మీరంతా నన్నుఆటపట్టించే వాళ్ళు కదు
కాని నాకు మీ  మీద ఏనాడూ  కోపం రాలేదు. ఎందుకో తెలుసా?
నాకు నేనంటేనే కోపం. నా జబ్బంటేనే నాకు చిరాకు. నా బాదంటేనే నాకు ద్వేషం.
బ్రతుకు పై ఆశ ఉన్నవాడికే  ఆ భగవంతుడి ఆశీర్వాదం. 
చావు తో చెలిమి చేసే నా పై తనకెక్కడిది మమకారం. 
మీరందరూ అనుకునట్టే నేను పారిపోవాలి అనుకున్నాను. 
కాని అది ఊరి నుండి మాత్రమే కాదు నా బ్రతుకు నుండే పారిపోవాలి అనుకున్నాను. 
చచ్చిపోవాలని అని నిర్ణయించుకున్నాను. 
ఓ రాత్రి,  ఇదిగో  ఈలాంటి పట్టాల మీదే  పడి ప్రాణం విడవాలి అని పడుకున్నాను.
గట్టిగా కళ్ళుమూసుకొని, చావు కోసం పది నిమిషాల పాటు ఎదురు చూసాను.
ఊపిరి పోసుకోడానికే  కాదు, ప్రాణం తీసుకోడానికి కూడా బాధను బదలుగా చెల్లించాలి.
ఆ భయంతో నా వళ్ళంతా చల్ల బడిపోయింది. నరాలు  బిగుసుకుపోయాయి. క్షణాల్లో రక్తం పోటెత్తింది. నా గుండె చప్పుడు తప్ప నాకు ఇంకే చెప్పుడు వినిపించలేదు. అప్పుడు కనిపించింది నా చావు .... అది పట్టాలగుండగా పరిగెత్తుకొస్తుంది. ఆలోచన ఆగి పోయింది, ఉనికి కోల్పోయింది.
ఆ క్షణం ఓ యుగం. ఆ రాత్రి ఓ  నమ్మలేని నిజం.  ఆ భయం నన్ను ఇంకా వెంటాడే నా గతం.
రెండు క్షణాల తర్వాత కళ్ళు తెరిచాను. పట్టాల పక్కన్న పడి ఉన్నాను. భయంకరమైన శబ్దం చేస్తూ పట్టాల మీదుగా నా పక్కనుండి వెళ్ళిపోయింది చావు. 

అటుగా వెళ్తున్న ఓ ముక్కూ మొహం తెలియని వ్యక్తి నన్ను ప్రక్కకి లాగేసి రక్షించాడు.
నన్ను చావనివ్వనందుకు  కోపడాలో, బ్రతికిన్చినందుకు కృతజ్ఞతలు తెలపాలో తెలియాక తను వైపు మౌనంగా చూస్తూ ఉండి పోయాను. తను నన్నేమి తిట్టలేది, ఎందుకు ఆ పని చేసానని ఆరా తీయలేదు. అన్నీ తెలిసినవాడిలా, ఒక అన్నలా నా చెయ్యి పట్టుకొని వాళ్ళ ఇంటికి  తీసుకెళ్ళి జరిగిందంతా వాళ్ళ అమ్మతో చెప్పాడు. నా వ్యధను విని ఆ అమ్మ ఆవేదన పడింది, బాధతో కన్నీరు పెట్టుకుంది. అన్నం పెడుతూ తానన్న మాటలు  ఇంకా నాకు వినిపిస్తునే ఉన్నాయి  -

"చూడూ బాబు, ఓ కన్న తల్లిగా చెబుతున్న నీవు తీసుకెళ్ళేది నీ ప్రాణం మాత్రమే కాదు - ఓ తల్లి ఆశల్ని, ఓ తండ్రి కలల్ని, ఓ కుటుంబ గౌరవాన్ని, అన్నిటికీ మించి మనిషి తనపై తాను పెట్టుకున్న నమ్మకాన్ని. ఈ ఎనబై యేండ్ల వయసులో కూడా చావుతో నిత్యం పోట్లాడుతూ బ్రతకడానికి ఎందుకు మధన పడుతున్నానో తెలుసా? నా కొడుకు కోసమే! వాడిని అనాధగా వదిలి వెళ్ళడం మనసోప్పకే. బ్రతకడానికి తర్కము అవసరమే, కాదనను, కాని ఎల్లప్పుడూ తర్కముతో బ్రతకలేము. విధిని ఎదురీదాలంటే కొంత భ్రాంతిని పడవలా వాడక తప్పదు"

ఆ మాటలు విన్నాక ఆవిడ ఔదార్యం ముందు నా రోగం చిన్నదనిపించింది. మొట్టమొదటి సారిగా నాకు నా పైనే జాలి కలిగింది. అంతవరకు గూడు కట్టుకున్న నా బాధని, కోపాన్ని అది కన్నీరుతో కడిగింది. చీకట్లు అలుముకున్న నా మనసులో ఆ మాటలే వెలుతురుని నింపాయి. వారికది చిన్న సహాయమే అవ్వొచ్చు, వినడానికి  నీకు చిన్న కారణం అనిపించొచ్చు. నాకు మాత్రం నా బ్రతుకుని నాకు తిరిగిచ్చిన పెద్ద బహుమానం.

సత్యం ఎప్పుడు అద్బుతంగా ఉండ వలసిన అవసరం లేదు. అది సహజంగానే సాదారణంగా ఉంటుంది.
వెలుగెంత నిజమో చీకటి అంతే నిజం. వ్యామోహం ఎంత అవసరమో వైరాగ్యం అంతే అవసరం. బ్రతుకు ఎంత సహజమో, చావు అంతే సహజం. విధిని నేనెంతగా మలచాలి అనుకున్నానో అది నన్నంతగా మలచింది.

నిజమే! సృష్టిలో అన్నీ వైరుద్ద్యాలే. నిత్యం ఒక దానితో మరో దానికి యుద్దమే. 
కానీ, యుద్ధం మాత్రమే కలకాలం,  గెలుపు ఓటమి కేవలం తాత్కాలికం. 
నువ్వన్నట్టు జీవితం ఒక చిక్కుముడే. అంతు చిక్కని ప్రశ్నే. గమ్యమే లేని గమనము అయ్యి ఉండొచ్చు. 
కాని అదే దాని అందమేమో. అదే దాని సమాధానమేమో. 
కథ తెలిసిన పుస్తకాన్ని చదవాలని ఎవరు ఆశ పడతారు?
ఫలితం తెలిసిన ఆటని ఆడడానికి ఎవడు పూనుకుంటాడు?
ప్రాణి బ్రతకడానికి ఆకలే ఆధారం. సృష్టి నిలవడానికి ఈ ముడే మూలమేమో!"


Wednesday, July 24, 2013

రాజీనామా

"నీ పెర్ఫార్మన్స్ ఏమి బాగోలేదని టీం లీడ్ నుండి సీనియర్స్ వరకు అందరినుండి ఒకే ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఎంతో క్లిష్టమైన కోడ్ ని కూడా  అరగంటలో రాసే వారికి సహితం నీవు రాసే నాలుగైదు లైన్స్ కోడ్ అర్థం చేసుకోడానికి వారాలు పడుతుందట. నువ్వు ఫిక్స్ చేసిన issues కంటే అవ్వి క్రియేట్ చేసే బగ్స్ బోలెడు అని వారంతా గొడవ చేస్తున్నారు. నీవు రాసే తోక్కోలో ప్రోగ్రామ్స్ ని డీబగ్ చేయడం కోసం మొన్నే నలుగురు కత్తి లాంటి ప్రొగ్రమ్మెర్స్ ని  అర్జెంటుగా రెక్రుట్ చేసుకోవాల్సి వచ్చింది. ఏదో నువ్వు మన కంపెనీకి అసెట్ అయ్యి కూర్చుంటావు అనుకుంటే దాని అసెట్స్ అన్నిటిని అమ్మేల చేస్తున్నావు అని సీనియర్ మేనేజ్మెంట్ నుండి సీరియస్ వార్నింగ్ కూడా వచ్చింది.
ఇప్పుడు పరిస్థితులు చాల దూరం వరకు వెళ్ళాయి. నా చేతుల్లో కూడా ఏమి లేదు. నేను ఇది వరకే నీకు చాల సార్లు 1-1 (వన్ ఆన్ వన్) లో కూడా దీని గురుంచి హెచ్చరించాను. కాని నువ్వు ఏనాడూ దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. పెడచవిన పెట్టావు, ఇప్పుడు వాళ్ళు నీ ఉద్యోగానికే ఎసరు పెట్టారు. నీకు ఇంకో నెల టైం ఉంది, ఈ నెలలో నీవు తిమ్మిని బొమ్మి చేస్తావో బొమ్మిని బొబ్బట్టు చేస్తావో నాకు తెలియదు. ఏమి చేసైనా సరే వారందరూ నిన్ను శబ్బాష్ అనేలా చెయ్యాలి.  లేకుంటే మాత్రం నీ ఉద్యోగం ఉడడం కాయం" అని నాకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన మా మేనేజర్, నేలకేసి దీనంగా చూస్తున్న నా వైపు దిగులు, జాలితో పాటు ఒక చెంచ చిరాకు, పరాకు కలిపి మిక్సీలో వేసి మిక్స్ చేసినట్టుగా పెట్టాడు ఫేసు.

ఎప్పటి లాగే రొటీన్ కమర్షెల్ తెలుగు సినిమా లాగ ఉంటుందనుకున్న నా 1-1 కాస్త ఈసారి హాలీవుడ్ హారర్ సినిమాలా మారే సరికి తేరుకోడానికి కొంచెం సమయం పట్టింది. టేబుల్ మీదున్న బిశ్లేరి బాటిల్ మూత తీసి గడగడ మని అర నిమిషంలో ఒక లీటర్ నీళ్ళు తాగేసి జాలిగా చూస్తున్న మా మేనేజర్ ముందు ఖాళి బాటిల్  పెట్టబోతుండగా సరిగ్గా అదే సమయానికి "రింగ రింగా రింగ రింగా రింగ రింగా రే ... పాషు పాషు పరదేశి నేను ... ఫారెన్ నుండి వచ్చేసాను... హే రింగ రింగా రింగ రింగా రింగ రింగా రే" అని నా సెల్ మోగింది. జేబులో నుండి సెల్ తీసి హలో అన్నాను...
" అరై నేను రా కళ్యాణ్ ని, ఈ రోజే "మిర్చి" సినిమా రిలీజ్,  నువ్వు ఆఫీసు నుండి డైరెక్ట్ గా శ్రీనివాస్ థియేటర్కి వచ్చేయ్యి, తరువాత నైట్ వర్మ గాడి రూంలో పార్టీ, రేపు ఆ యెదవ బర్త్డే, మన వాళ్ళందరూ వస్తున్నారు"
"అరై ఈరోజు నాకు కుదరదురా ఆఫీసులో చాల పని ఉంది".
"ఏరా ఆ గుజరాతి పిల్లతో ఎక్కడికైనా వెళ్తున్నావా? నీకు అంత కంటే పెద్ద పని ఏమి ఉంటుందిరా "
"లేదురా.. నాకు సీరియస్ గానే వర్క్ ఉంది ఈరోజు, నీకు తర్వత చెప్తాలే ఫోన్ పెట్టాయి".
"అబ్బచా... జోకులు వేయకు, నీకు పని ఉందన్న మన్మోహన్ సింగకి టంగ్ ఉందన్న నేను అస్సలు నమ్మను ... కహానీలు కట్టేసి కరెక్ట్ టైంకి వచేసై"
నా వెదవ జీవితానికి ఈ పాడు రేపుట్షన్ ఒకటి అని మనసులో అనుకోని .. సర్లే వస్తాన్లె అన్నాను వాడితో.
"ఏమి పుచ్చుకుంటావు ఈరోజు నైట్ ..wine, whisky, vodka, beer ???"
మందు పేరు చెప్పగానే ముందు ఉన్నది మేనేజర్ అని కూడి మర్చిపోయాను ... "నాకు vat69 కానీ... Teachers అయిన పర్లేదు ... ఐస్ వాటర్ మస్ట్, అసలే ఈమద్య విస్కీ బాగా వేడి చేస్తుంది" అని నేను ఉత్సాహంగా అంటుండడం చూసి మా మేనేజర్ మొహంలో ఉన్న ఆ కాస్త జాలి, దయ, కరుణ  తొలగి కోపం, ద్వేషం, అసహనం ఆక్రమించాయి. ఎలాగైనా ఈ గండం నుండి ముందు గట్టేకలి అనుకోని, గొంతుని కొంచెం సవరించుకొని,
"ఆరిపోయిన కొవ్వొత్తిని వెలిగించడానికి ఒక్క అగ్గి పుల్ల చాలు, పారిపొయిన దొంగను పట్టుకోడానికి చిన్న వెలి ముద్ర చాలు! అలాగే, విరిగిపోయిన వీరి మనసుల్లో నాపై నమ్మకం కల్పించడానికి నాకి ఒక్క నెల చాలు ... చాలు ..... నేనేంటో ఈ ప్రపంచానికి తెలియ చేయడానికి నాకు లభించిన అవకాశంగ దీనిని భావించి, ఈ అవమానలనే నా విజయానికి సోపానాలుగా మలచుకోకపోతే నా పేరు ... వద్దులే....(గతంలో ఇలాంటి ఛాలెంజ్ లు బోలెడు చేసి బౌల్డ్ అవ్వడం గుర్తొచ్చి)... ఈ సారి నా కంపెనీ పేరు మార్చుకుంటాను, అంటే నెల తిరిగే లోపే ఈ కంపెనీ నుండి నా అంతట నేనే కచ్చితంగా తప్పుకుంటానని" మా మేనేజర్ కి మాట ఇచ్చి వచ్చేసాను.

ఆవేశంలో మాటివ్వడం అంటే మందు కొట్టాక మజ్జిగ తాగడం లాంటిదే. కిక్కు ఉన్నంత సేపే కసి ఉంటుంది.  ఇది తెలిసేలోపే నెల గడిచింది .. నాకిచ్చిన గడువు ముగిసింది... మళ్లీ 1-1 స్కేడులైంది...మా మేనేజర్ ప్రసంగం మొదలైంది...
"చూడు MR. రెడ్డి, మన కంపెనీ లో పని చేయాలంటే చేసే పనిని ప్రేమించ గలగాలి, పని కోసం ఆహర్నిశలు శ్రమించాలి. ఒక్క సారి అలా cubicles వైపు చూడు, చేస్తున్న వృత్తినే మతంలా స్వీకరించి, పనినే దైవంగా బావించి,  జీవితంలో పైకి ఎదగాలనే వాళ్ళ ఆరాటం చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో.  నీలో ఆ కసి, తపన ఏ మాత్రం కనిపించట్లేదు. చేస్తున్న పని పట్ల శ్రద్ద లేదు, కెరీర్ లో ఎదగాలనే ఉత్సాహం లేదు. నెల గడువిస్తే, నీ టాలెంట్ ఏంటో నిరూపిస్తావ్ అనుకుంటే,  systems అన్నిటిని క్రాష్ చేసి కూర్చున్నావ్. ఇక్కడ చేసే పని పైన నీకు అస్సలు ఆసక్తి లేదు, నీ వల్ల అవ్వదు, ఈ కంపెనీ  నీకు సరైంది కాదు. 
నీకు నచ్చిన పని ఏంటో ఇక నీవే నిర్ణయించుకో, కాని ఒక్కటి మాత్రం గుర్తుంచుకో,  ఈ కార్పొరేట్ వ్యవస్థ పద్మ వ్యూహం లాంటిది, ఇక్కడ బ్రతకడం అంటే గెలవడమే. గెలపుపై ఆశ లేనివాడు ఆట అడడానికే అనర్హుడు. నీకు ఇంకో నెల టైం... " అని ఏదో చెప్పబోతున్న మా మేనేజర్ తో
"ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను" అని నేను ఆవేశంగా చెప్పేసరకి, చెప్తున్న విషయాన్నీ ప్రక్కన్న పెట్టేసి ఒక్క నిమిషం మౌనంగా  నా వైపు అదే పనిగా రెప్ప ఆర్పకుండా చూసాడు. ఇన్ని రోజులుగా తను నా పై చూపిన అభిమానానికి, ఉంచిన నమ్మకానికి థాంక్స్ చెప్పుదాం అనుకునే లోపే...
ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న శుభా వార్త నా నోటి వెంట వచ్చేసరికి పట్టలేని సంతోషం తన కళ్లలో నీరుగా మారి ముత్యాల్లా  ఒక్కొకటిగా రాలి పడుతున్నాయి. నేను వెళ్ళిపోతున్నా అన్న చిన్న మాట తనకు కలిగించిన ఆనందం చూసి నాకే ఆశ్చర్యం వేసింది. కళ్లు తుడుచుకుంటూ, వెంటనే వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఆ రోజు నుండి వారం రోజుల వరకు వాళ్ల ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటాలని, వాళ్ల వీధిలో వారందరికీ స్వీట్లు, బట్టలు, వీలైతే ఒక్కొక్కరికి తులం బంగారం కూడా పంచి పెట్టాలని చెప్పి, ఫోన్ పెట్టేసి, ఎగిరి గంతేసి బయటకి పరుగెత్తుకుంటూ వెళ్లి ప్రతి సంవత్సరం ఆ రోజు కంపెనీకి సెలెవు ప్రకటించాలని HR వాళ్లని డిమాండ్ చేయడం ప్రారంబించాడు.

ఇది జరిగిన నిమిషానికి, నేను మెల్లగా తన కేబిన్ నుండి ఒక్కో అడుగు వేస్తూ బయటకు వచ్చేసి, తన  ఆనందానికి ఆశ్చర్యపడాలో నాకు జరిగిన  అవమానానికి ఇబ్బంది పడాలో అర్థం కాక నా సీట్ లో స్లో గ సెటిల్ అయ్యను. నా టీంమేట్ సురేష్ కి సందేహం కలిగి నా డెస్క్ దెగ్గరికి వచ్చాడు.
"ఏమైంది? మన మేనేజర్ ఎందుకు అంత సంతోషంగా ఉన్నాడు? ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? లేకుంటే కొంప తీసి నువ్వే డెడ్ లైన్ లోపు ప్రాజెక్ట్ ఏదైనా సబ్మిట్ చేసావా?" అని నన్ను అడిగాడు. తడుముకోకుండా నేను రాజీనామా చేసానని, దానితో తన పిచ్చి పీక్స్ కి వెళ్ళింది అని చెప్పాను.
"ఏ? ఎందుకు రిసైన్ చేసావ్, నీకేమైనా మతి పోయిందా? ఇంత మంచి కంపెనీలో ఉద్యోగం రావటమే ఒక్క గొప్ప వరం. అలాంటిది ఉద్యోగం వదులుకొని ఏం సాధిద్దాం అని" ఆవేశంగా అడిగాడు.
"సాధించడం కోసం నేను రిసైన్ చేయలేదు, పోగొట్టుకోవడం ఇష్టం లేకే రాజీనామా చేశాను".
"ఏం కోల్పోయే వాడివి వోయ్. మహా అయితే ఇంత సమయం, కొంత సరదా.... అంతేగా"
"జీవితంలో రాజిపడాలె కాని జీవితాంతం రాజీపడడం నాకు ఇష్టం లేదు"
"కష్ట పడి పని చేయడం రాజీపడడం ఎలా అవుతుంది? అందరు ఇక్కడ ఎంత చక్కగా వర్క్ చేస్తున్నారో చూడు". 
"ఒక్కసారి, ఆ సిస్టంలో మునుగిపోయి ఈ ప్రపంచాన్ని మర్చిపోయి పని చేస్తున్న ఆశిష్ గాడి వైపు చూడు. సంవత్సరంలో ప్రమోషన్ కొట్టేసి US చేక్కేయాలని రెండు రోజుల నుండి పళ్ళు తోమకుండా, స్నానం కూడా చేయకుండా గొడ్డులా  ఎలా కష్ట పడుతున్నాడో చూడు. ఎనాడైన చిరు నవ్వుతో ఎవరినైనా పలకరించాడా? పని గురించి, ప్రమోషన్ గురించి తప్పితే పట్టు మని పది నిమిషాలైన మనతో ఎప్పుడైనా ఆత్మీయంగా మాట్లాడాడా, కబుర్లు చెప్పాడా, ఫ్రెండ్స్ తో ఏనాడైనా దమ్ము కొట్టాడా, పోనీ మందు కొట్టాడా.... ఏ అమ్మాయికైనా ముద్దు పెట్టాడా... ప్చ్ ఇది కొంచెం ఓవర్ అయింది అనుకో... వెదవ, కనీసం సైట్ అయిన కొట్టడా? ఒక ఆటా లేదు  పాటా లేదు.  ఛీ .. దీనమ్మ...యెదవ జీవితం. ఫీల్ అవ్వకు flow లో అక్కడక్కడ బూతులు దొర్లుతున్నాయి. నువ్వు లైట్ తీసుకో ".  నా వాయిస్ రైజ్ అయినప్పుడల్లా గొంతున గుటకేసి సురేష్ నేను చెప్పేది శ్రద్దగా వింటున్నాడు.
"ఇవ్వన్ని వదిలై, కనీసం చేస్తున్న పనినైనా వాడు ప్రేమిస్తున్నాడా అంటే  ...  అదీ లేదు !! ... ఎందుకంటే ప్రేమించే చోట స్వేచ్చ ఉంటుంది, స్వేఛ్చ వల్లే జ్ఞానము వికసిస్తుంది, అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది, అంతే కాని ఇలా పేచెక్ ల కోసం  ఆరాటాలు ప్రమోషన్ ల కోసం పోరాటాలు పని చేయడానికి ప్రేరేపణలు అవ్వవు. ఇష్టపడి చేసే పనిలో ఆనందనికే కాని అబద్రతాభావనికి ఆస్కారమే లేదు. ఆలోచించు! ... కష్ట పడి పని చేయడమే గొప్ప అయితే, గొడ్లు మన కంటే వంద రేట్లు ఎక్కువకగా కష్ట పడతాయి.  కాని ఏమి ప్రయోజనం? అవ్వి అలా గొడ్ల లాగానే మిగిలిపోతాయి, గొప్పవి ఎన్నటికి అవ్వవు. ప్రకృతి ఎప్పుడూ పనికంత ప్రాదాన్యత ఇవ్వలేదు. కేవెలం కొందరు స్వార్థపరులు, దొరలు, వారి స్వార్థ ప్రయోజనాల కోసం, పనిని దైవంగా చిత్రీకరించి, మనలాంటివాళ్ళ కష్టాన్ని కరెన్సీ నోట్లలా మలుచుకుంటున్నారు. ఇలా మనలాంటి బానిసలు ఉన్నంత కాలం అలాంటి బాస్ లు పుడుతూనే ఉంటారు".

"పని చేయడం ఇష్టం లేకో, చేతకాకో ఇవ్వన్ని చెప్తున్నావ్. నువ్వు ఎన్నైనా లాజిక్లు చెప్పు! కమిట్మెంట్, హార్డ్ వర్క్ కి మించిన సక్సెస్స్ ఫుల్ సూత్రం ఈ 21 శతాబ్దంలో యేది లేదు".
"నిజమే, కానీ కమిట్మెంట్ కూడా ఆయింట్మెంట్ లాంటిది. అనవసరంగా వాడితే అది అరగడమే తప్ప మనకు ఒరిగేది ఏం ఉండదు. తప్పనిసరి పరిస్థితుల్లో, అవసరమైన చోట పూస్తే అది పనిచేస్తుంది, మనకు మేలు చేస్తుంది" అని నేను చెప్పడం అవ్వక్కముందే  నా inbox లోనికి మెసేజ్ రావడం, అది చూసి నేను వెంటనే 

"హే వైట ఎ సెకండ్, నాకు ఇప్పుడే మెసేజ్  వచ్చింది, నాకు ఇంకో కంపెనీ లో ఆఫర్ వచ్చింది". 
"కంగ్రాట్స్ బాస్!! ఏం కంపెనీ అది ? ఆఫర్ ఎంత ఇస్తున్నారు?".
"శతకోటి కంపెన్నిల్లో  అది ఒక బోరింగ్ కంపెనీ. ఆఫర్ మాత్రం ఇంటరెస్టింగా ఇక్కడికంటే డబల్ ఇస్తున్నారు!"
"అవునా ?? గ్రేట్ !! అయినా ఇంత ఫిలాసఫీ మాట్లాడినోడివి ఇప్పుడు మాత్రం ఏం మొహం పెట్టుకొని జాయిన్ అవుతావులే" అని చిన్నగా నవ్వాడు. 
"చూడు అప్ప సిన్నప్ప, నువ్వు అలా ఫిక్స్ అయిపోమాకు! గీతలో కృష్ణుడు ఎం చెప్పాడో తెలుసా? కర్మయందే మనకు అధికారం కలదు కాని కర్మఫలమునందు కాదని".
"అంటే ??"
"నీకు అర్థం  అయ్యే బాషలో చెప్తా చూడు - లైన్ వేసిన పోరి పడలేదు అని రొజూ యేడుస్తూ కూర్చోం కదా. ఇంకో పోరికి బీట్ వేస్తాం. వర్కవుట్ అవుతుందో లేదో వేచి చూస్తాం. లైన్ వేయడం మాత్రమే మన కర్తవ్యం, పడడం పడకపోవడం, దాని అదృష్టం!" అని నేను అంటుండడం పూర్తయిందో లేదో ... "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే...తోటమాలి నీ తోడులేడులే.. వాలిపోయే పోద్దా నీకు వర్ణలేందుకే ........ " అని ఎవడో పాట ప్లే చేయడం ప్రారంభించాడు.
తెలిసి చేసాడో తెలియక చేసాడో తెలియకున్న situation కి apt గా ఉండడం వల్లనా నాకు వాడి టైమింగ్ పై డౌట్ వచ్చింది.
సురేష్ కి మాత్రం నవ్వొచింది.

Saturday, March 9, 2013

నేను, ఒజోమెన్ , ఓ అమ్మాయి

"మా కంపెనీలో చేరినందుకు మీ అందరికి ధన్యవాదములు. ఈ రోజుతో మీ జీవితం ధన్యం  అయిపొయింది, ఎందరో మేధావులు సాధించాలి  అనుకున్నా వీలుకాని ఉద్యోగం మిమ్మల్ని వరించింది. మీరు మా కంపెనీలో పని చేసే వర్కర్లు ఎంత మాత్రమూ కాదు, మీరు  మా కంపెనీ లీడర్లు, దీని భవితను నిర్దేశించే మార్గ దర్శకులు. మీ అందరికి 'ఒజోమెన్' కంపెనీ తరపున సాదరంగా ఆహ్వానం తెలుపుతున్నాను. ఈ రోజు ఎవరింటికి వాళ్ళు వెళ్ళండి, అలాగే రేపటి నుండి ఎవరి ఆఫీసులకు వాళ్లు  వెళ్ళండి. లేవండి, లేచి బయలుదేరండి. బాబు నీ  పక్కనున్న ఆ బాబును (అంటే నన్ను) ఇంటికి వెళ్లి నిద్రపోమ్మను" ...అని నా పక్కనున్న వాడితో చెప్పింది న్యూ joineesకి  ఇండక్షన్ ఆర్గనైజ్ చేసిన HR.

వాడు నన్ను లేపి కాబ్ సర్వీస్ రిజిస్టర్ చేసుకోడానికి పట్టుకెళ్ళాడు. నాకు కాబ్ ఉదయం 7:00 కావాలని చెప్తే, అక్కడున్న ఆపరేటర్  అలాగే ఎంటర్ చేసాడు. ముందు పని చేసిన కంపెనీ లో ఏనాడూ కనీసం 11 గంటల లోపు కూడా ఆఫీస్ కి వెళ్ళిన పాపాన పోలేదు. మా మేనేజర్ నా కాలర్ నుండి స్లిప్పర్స్ వరకు అన్ని పట్టుకొని బెదిరించి బ్రతిమిలాడినా నేను ఆ పాపం చేయలేదు. కానీ ఎందుకో సందర్భం వస్తే చాలు నన్ను నేను మార్చు కోవాలని, మెరుగవ్వాలని, అయ్యి ఈ దేశాన్ని బాగుచేయాలని, దేశ ప్రగతికి పునాదినై అనాధలందరినీ ఆదుకోవాలనీ, ఏవేవో కలలు కంటాను!

మర్నాడు ఉదయం నేను గాఢ నిద్రలో ఉండగా నా సెల్ మోగింది. లిఫ్ట్ చేసి హలో అన్నాను .."సర్, ఒజోమెన్ కాబ్ డ్రైవర్ని కాల్ చేస్తున్నాను, కాబ్ రెడీ ..2 మినిట్స్ లో వచ్చేయండి సర్" అని వాడి సెల్ నీ, నా  నిద్రనీ కట్ చేసాడు.  అంతే, నా మధుర స్వప్నం నుండి ఒక్కసారి ఈ ముదురు ప్రపంచంలోనికి పడ్డాను, నిద్ర నుండి తెరుకుని గబా గబా బ్రష్ చేసి, స్నానం చేసినట్టు చేసి, హడావిడిగా చెప్పులు వేసుకొని బయటికి నడవడం మొదలు పెట్టాను. ఇదంతా గమనిస్తున్న నా రూమ్ మేట్ వాసు గుమ్మానికి అడ్డంగా నిల్చున్నాడు. నన్ను అలానే వెళ్ళవద్దు అని హెచ్చరించాడు. "ఎందుకు??.."  అని అసహనంగా అడిగాను. వాడు నా నిక్కరుని చూపించి నన్ను స్పృహ  లోనికి తెప్పించి  నా  చేత దానిపై ప్యాంటు వేయించి పంపించాడు.

"ఈ కాబ్ డ్రైవర్లు ఇంకా ముందే నిద్ర లేచి ఉంటారు కదా ! మరి వీళ్ళు  ప్యాంటు వేసుకోవడం ఎప్పుడూ మరిచిపోరా?" అని నాలో నేను ధర్మ సందేహం వెలిబుచ్చుతూ నిదానంగా మెట్లు  దిగేసి మా ఇంటి గేటు దాటుతూ ఉన్నానో  లేదో ... నన్ను చూసి అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు ఒక్కసారిగా కిందికి పరిగెత్తడం ప్రారంభించాడు. అప్పటివరకు చక్కగా ఆటలు  ఆడుకుంటున్న  పిల్లలందరూ ఏడుస్తూ వాళ్ళ ఇంటి వైపుకు పరిగెత్తసాగారు.  పారిపోవడం చేత కాని చెట్లన్నీ విరిగిపోదామా అన్నట్టుగా ఊగా సాగాయి. వీధిలో గట్టిగా  మొరుగుతున్న కుక్కలన్నీ  ఒక్క మాటున తోక ముడిచి భయంతో దగ్గరకు బిగుసుకు పోయాయి. మా కాలనీ వాళ్ళంతా బెంగుళూరులో సునామి వస్తుందేమో అన్న భయంతో  ఇంటి మేడలపై  ఎక్కి దేవుణ్ణి  ప్రార్థించడం ప్రారంభించారు. ఇంకోవైపు  ముదుసళ్ళు ఈరోజే ఈ నరకం నుండి తమకు విముక్తి అని ఆనందంగా నవ్వడం మొదలు పెట్టారు.  "ఆవును మరి!! ఈ లోకంలో ఎప్పుడూ ఊహించని హఠాత్ పరిణామం ఎదురైతే తట్టుకునే ధైర్యం ఎంత మందికి ఉంటుంది?" అని నాలో నేను నవ్వుకొని కాబ్ వైపు అడుగులు వేయడం ఆరంభించాను.

నేను ఊహించనంత వింతగా ఏమి లేదు ఉదయం 7:00 గంటలకి !!!. మాములుగానే అనిపించింది నాకు. కొంచెం చీకటిగా  ఉంది కాకపోతే. అంతే పెద్ద తేడా ఏమి లేదు. ఎప్పుడో చిన్నప్పుడు దైవ దర్శనం కోసం తిరుపతికి వెళ్ళినప్పుడో, అప్పుడెప్పుడో  జబ్బు చేసి మా నానమ్మ చనిపోయినప్పుడో తప్ప ఉదయాన్నే లేచే అవసరం  నాకు పెద్దగా ఎప్పుడూ రాలేదు.
నేను రావడం చూసి, కాబ్ డోర్ తీస్తూ డ్రైవర్ వెటకారంగా "సర్! మీ వాచ్ ని మార్చేయండి సర్! అది 10 నిమిషాలని కూడా 2 నిమిషాలుగా చుపిస్తునట్టు ఉంది. ఇలా అయితే రోజూ కష్టం" అని నాతో వాడి  ఆక్రోశాన్ని చెప్పకనే చెప్పాడు. కాబ్ లో వాళ్ళంతా నాకు ఏదైనా ఇంకా  పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి అన్నట్టు వాడి వైపు చూడ సాగారు. నేను చిన్నగా ఒక నవ్వు వాళ్ళ మోహన పడేసి కాబ్ ఎక్కేసి నిద్రలోకి జారుకున్నాను.

నేను లేచేసరికే కాబ్ కాస్తా పాకిస్తాన్ మీదుగా ఆఫ్గనిస్తాన్ వెళ్ళుతునట్టు నాకు అన్పించింది. వెంటనే ఏ ఆఫీస్ కి వెళ్తున్నావని అడిగాను ..ఒక్కడు wtc ని చాలా నింపాదిగా  నెమ్మదిగా  చెప్పాడు. నేను వెళ్ళాల్సింది safina  టవర్స్  అని కంగారుగా చెప్పెసరికే, నిద్రలో ఉన్నవాలంత ఒక్కసారిగా ప్రళయం వస్తే లేచినట్టుగా లేచి నా వైపు చిరాకుగా, కరుకగా, కరుస్తాం  అన్నట్టు చూసారు.  ముందు రోజు  నేను క్యాబ్ టైమింగ్ చెప్పి ఏ ఆఫీసో  చెప్పనందు వాళ్ళ ఆ ఆపరేటర్ వాడి స్వంత తెలివి తేటల్ని నా తెలివి తక్కువ తనాన్ని  బాగా వాడుకున్నాడు. నేను వాళ్ళకి సారీ చెపి ఆటో వేసుకొని ఆఫీస్ కి వెళ్లి అక్కడ నా  క్యాబ్ అడ్రెస్స్ మర్పించాను.  మరుసటి రోజు నేను అనుకున్న విధంగానే మా ఆఫీసు క్యాబ్  వచ్చింది.

అలా ఒక రెండు రోజులు క్యాబ్ రావడం నేను ఆఫీసు వెళ్ళడం సహజంగా జరిగి పోయింది.  పైగా ఈ ఆఫీసు క్యాబ్లు రోజు మారుతూ ఉంటాయి. ఈ రోజు వచ్చింది రేపు రాదు.  మూడో రోజు కూడా క్యాబ్ వచ్చింది, కాని ఈసారి దాని వెంట  ఒక అధ్బుతాన్ని వెంట తెచ్చింది. ఆ అద్బుతం పేరు "మానస". అందానికి బ్రాండ్ అంబాసడర్ లాగ ఉంది తను.
ముందు సీటు కాలిగా ఉందని చూసి వెనెక  సీట్లో తన పక్కన కూర్చున్నాను . "అద్బుతం జరిగే ముందు ఎవరూ గుర్తించరు, జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు" అని కిట్టి గాడు  దూకుడు సినిమా 100 రోజుల ఫంక్షన్ లో చెప్తే ఏమో అనుకున్నా, కాని ఇప్పుడు అది నిజం అనిపిస్తోంది. లేకపోతే ఎడారి లాంటి నా బ్రతుకులోనికి సోనాలి బింద్రే లాంటి ఈ  అమ్మాయి రావడం ఏంటి? రోజు తన పక్కన కూర్చొని ప్రయాణం చేయాల్సిన అవకాశం రావడం ఏంటి? ఏంటో ఈ ప్రపంచం, ఇదో పెద్ద మాయ. ఊహించనివి ఊపిరి పోసుకుంటాయి, ఊహకు అందేవి చటుకున్న మాయం అవుతాయి!!

తన పక్కన కూర్చొని బ్యాగ్ సద్దుకుంటున్న నా వైపు చూసి ఒక చిన్న చిరునవ్వును పలకరింపుగా విసిరింది. అమెరికా వెళ్ళాలంటే వీసా ఎంత కీలకమో, అమ్మాయితో మాటలు కలపాలంటే ఈ నవ్వు అంతే అవసరం. అందుకే, వెంటనే తన పేరు అడిగి, ఎక్కడి నుండి వస్తుంది అని ఆరా తీస్తూ, తన నుండి వెలువడే సువాసనను ఆస్వాదిస్తూ, ఉవెత్తున్న ఎగిసి పడుతున్న ఉద్వేగాలని అణిచి వేస్తూ, తన వైపు చూస్తూ తను చెప్పేది వింటునట్టుగా నటిస్తున్నాను.  అయినా అసలు నేను  ఎందుకు నటించాలి? తన నవ్వు చాలా బాగుందనీ, తను చాల అందంగా ఉందనీ, తనను పదే పదే అల చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది అని చెప్తే తప్పేంటి? అసలు సౌందర్యానికి ముగ్ధులు కానిది ఎవరు ఈ లోకంలో? నాలో కల్గిన భావలికి, ఆనందానికి  తన సౌందర్యం ఆధారం కదా? మరి అలంటి ఆధారాన్ని ఆరాదించక అణచి వేసి అవమానించడం ఎంత వరకు సబబు?  అందుకే నిస్వార్థమైన నా మనుసులోని భావాలని  నిజయతిగా మాటల రూపంలో  తనకు చెప్పాను.  "థాంక్స్" అని నవ్వుతు చెప్పింది. సిగ్గుతో తన మొహం కాస్త ఎర్రగా మారింది.  మా ఇద్దరి మధ్యలో నల్లని పరదలా ఉన్న తన కురులని తల పైకి అనుకోని నా వైపు అమాయకంగా చూసి నా పేరేంటి అని అడిగింది.

నేను పేరు చెప్పి నాకు మొదటి రోజు జరిగిన అనుభవాన్ని తనకు చెప్పను. తను నవ్వుతుంది అనుకుంటే అర్థం కాని ప్రశ్నార్థక మొహం పెట్టింది.  ఇదేదో మరో ప్రళయానికి దారి తీసేలా ఉందని  నాకు సందేహం కలిగింది. అందుకే ఎందుకైనా మంచిదని ఇంతకి తన  ఆఫీసు బిల్డింగ్ పేరేంటి అని అడిగాను, తను "Indus valley" అని చెప్పింది. ఈ క్యాబ్  "ఒజోమెన్" కి  వెళ్ళడం లేదా అని అడిగాను. బదులగా తను ...  వాట్?? "ఒజోమెన్" ఏంటి అసలు, "Goldman Sachs"కి వెళుతుంది అని నా సందేహం కాస్త వాస్తవం చేసింది.

ఈ సారి నేను ఎక్కినా క్యాబ్ మొదటి రోజులా కనీసం మా కంపెనీది కూడా కాదు, వేరే కంపెనీది! నా తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక, తన కళ్లలోనికి చూడలేక డ్రైవర్ తో క్యాబ్ ఆపమని చెప్పి దిగేసి చక చకా మా ఇంటి వైపు నడవడం మొదలెట్టాను. ఇంతలో మా కింద పోర్షన్ లో మాతో పాటు అద్దెకు ఉంటున్న సారాంశ్ కాస్తా ఆయాసంగా ఎదురుగా  పరుగెత్తుతున్నాడు.

అవమాన భారంతో, ఆశలు కాస్త అడి ఆశలు అయ్యాయన్న బాధతో ఉన్న నాలో వాడి పరుగు ఎందుకో కుతుహలాన్ని నింపింది. పరుగిని ఆపి వాడి ఆయాసానికి అసలు కారణం ఏంటి అని అడిగాను. వాడు చాలా చికాకుగా "ఎవడో హంది (అంటే కనడంలో పంది ), నేను వెళ్ళాల్సిన క్యాబ్ ఎక్కేసాడట. క్యాబ్ డ్రైవర్ ఫోన్ చేసి లేట్ అవుతుంది అని త్వరగా రమ్మన్నాడు. అందుకే ఈ పరుగు" అని దిగులుగా నాతో చెప్పాడు. 

Thursday, April 19, 2012

పెళ్లి చూపు!

"ఒరేయ్ శాంతి, మన ప్రసాద్ అంకుల్ లేడూ, వాళ్ళ ఫ్రెండ్ కూతురికి పెళ్లి సంబంధం చూస్తున్నారంట . అమ్మాయి ప్రస్తుతం అమెరికాలో MS చదువుతుంది. ఇంకో రెండు నెలల్లో ఇండియా వస్తుందంట. వచ్చాక, వెంటనే పెళ్లి చేయాలి అని వారి ఆలోచన. ప్రసాదు నీ గురించి, ఇంకా మన ఫ్యామిలీ గురించి చెప్పి, మన సంబంధం కలుపుకుంటే బాగుంటుంది అని వాళ్ళతో అన్నాడట.

వాళ్ళు దానిని kind heart తో consider చేసి మొదలు నీ biodata, salary pay slips, gazitted ఆఫీసర్ తో attest చేయించిన మెడికల్ టెస్ట్ reports, LKG -PG మార్క్స్ షీట్లతో పాటు ఫోటోషాప్ లో ఎడిట్ చేయని లేటెస్ట్ గా తీయించిన high resolution ఫోటోలు నాలుగు - కుర్చీని ఒకటి, నిల్చొని ఒకటి, చేతులు కట్టుకొని ఒక్కటి, దండం పెడుతూ ఒకటి - వెంటనే mail చేయమన్నారు.

ఈ initial స్క్రీనింగ్ లో నువ్వు పాస్ అయితే, తరువాత అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, రెలటివ్సు వాళ్ళ"టుఫ్లీస్" ఒక మినీ బస్సు లో వారికి తీరిక ఉన్నప్పుడు మన ఇంటికి వస్తారు. మన ఇల్లు, మర్యాదలు, పద్దతులు పరీక్షించి పెట్టె పలహారం నచ్చితే మనం సెకండ్ రౌండ్ కూడా పాస్ అయినట్టే, ఇక ఫైనల్ గా అమ్మాయి ఇండియా వచ్చాక నువ్వు వెళ్లి 3 రౌండ్స్ అఫ్ ఇంటర్వ్యూ appear అయ్యి తనను attract చేస్తే నిన్ను వాళ్ళు OK చేస్తారట. అల్ ది బెస్ట్ రా !!! ...ఆ మరిచి పోయాను అమ్మాయి పేరు చింతకాయల అఖిల అంట" అని మా నాన్న ఫోన్ పెట్టేసాడు.

ఇది విన్న వెంటనే నాకు పట్టరానంత కోపం వచ్చింది. ఫ్రాంక్ గా మనలో మనం మాట్లాడుకోవాలి అంటే చాలా ధుఖం వచ్చింది. ఎందుకంటే నా బుద్ది తెలిసినప్పట్టి నుండి, క్లాసు టీచర్ నుండి కాలేజీ ప్రిన్సిపాల్ దాక ప్రతి వాళ్ళు బాగా చదివితే మంచి అందమైన పెళ్ళాం వస్తుందని, అంబానీ మామగా వస్తాడని నన్ను మోసం చేసి, రాత్రనక, పగలనక tuitionల మీద tuitionలు పెట్టేసి, స్కూల్ లో కాలేజీలో రోజంతా కట్టేసి, నా బాల్యాన్ని, యవ్వనాన్ని కొట్టేసి ....ఇప్పుడేమో మళ్లీ ఈ UPSC పరీక్షా ???

నా ఫ్రెండ్ నాతొ, "ఒరేయ్ అమ్మాయి పేరు ఏమ్మనావ్??? దొరికేసిందిరా .... ఫేస్ బుక్ లో తన ప్రొఫైల్!!సూపర్ ఫిగరు మామ్...అచ్చు ఇలియానాలా ఉంది."
అంతే, ఆవేశ ఆక్రోశాలతో విల విలలాడుతున్న నా మది లో ఒక్క క్షణం పెద్ద నిశబ్దం...అప్పటి వరకు వాడిన కొత్తిమీర కట్టలా ఉన్నా నా మొహం ఇది విన్న వెంటనే సిగ్గుతో ఎర్రని ఆపిల్ పండుల మారింది.
"ఒరేయ్ మామ, ఆ అమ్మాయి చూస్తే చాలా posh గా, అందంగా ఉంది, పైగా US లో చదువుతుంది. నేను ఇంతకి అమ్మాయికి నచ్చుతానంటావా???"
"ఛాన్సే లేదు రా, ఆ అమ్మాయేమో చూడానికి angel లా ఉంది. నువ్వేమో ఆ చింపిరి జుట్టు, గుండ్రటి పోట్టేసుకొని
కమెడియన్ కి కజిన్ లా ఉన్నావ్. ఆ తెగువ, వీరత్వం నీలో ఏ పట్టాన కనిపించడం లేదు. కష్టం రా!"
"ఒరేయ్ మామ, అలా అనకురా, ఎలానైన ఆ అమ్మాయికి నేను నచ్చాలంటే ఏం చేయాలో చెప్పరా?"
"దానికి ఒక మార్గం ఉంది, ఆడదానికి అణుకువ ఎంత ముఖ్యమో మొగాడికి గాంభీర్యం అంత అవసరం. ఆ గాంభీర్యం నీకు రావాలంటే నువ్వు వెళ్లి మన ఆర్నాల్డ్ GYM లో join అయ్యి muscles బిల్డ్ చెయ్యాలి.
సింపుల్ !!"
"జిమ్ కి వెళ్లి బాడీ బిల్డ్ చేస్తే అమ్మాయికి నేను నచ్చుతాన మామ??"
"ఖచ్చితంగా! నువ్వు ముందు కండలు పెంచు, ఆ తరువాత అఖిల ఏంది దాని అక్క హీన రబ్బాని కూడా నీ ముందు Q కట్టాల్సిందే".
"హీన రబ్బానియ? ఎవరురా తను? ఆమె కూడా పెళ్లి చూపులు చుస్తున్నారా? పనిలో పనిగా నా డాకుమెంట్స్, ఫొటోస్ తనకు కూడా మెయిల్ చేసాయన?"
"ఈ అతి ఆవేశమే నిన్ను ముంచేది. ప్రాస కోసం నేనేదో పేరు చెబితే, పిల్లల తల్లికి కూడా నువ్వు పెళ్లి ప్రపోజల్ పెడతానంటూన్నావ్. గుర్తుంచుకో, gym లో అయిన జీవితంలో అయిన ఎప్పుడూ నిదానమే ప్రధానం..."

వాడు చెప్పేది పూర్తిగా వినకుండానే పరుగు పరుగునా జిమ్ కి వెళ్లి అక్కడున్న packages అన్నిట్లో కాస్ట్లీ అండ్ క్లిష్టమైన "six packs in two months" select చేసి డబ్బులు కట్టేసాను. మొదటి రోజు కనుక బాడీ అలవాటు పడడం కోసం అమ్మాయిలు, చిన్న పిల్లలు ఉపోయోగించే 3 kg dumbells రెండు నాకు ఇచ్చి ట్రైనేర్ ప్రాక్టిస్ చేయమన్నాడు. వాటితో ప్రాక్టిస్ చేస్తుండగా అక్కడ ఎన్నో యేండ్లగా కండలు పెంచి పోషిస్తున్న దుర్యోధన, దుష్యాసనలుతో కూడిన కౌరవుల బృందం అంతా నన్ను ఒక్క చంటి పిల్లాడిలా చులకనగా చూసే సరికి ద్రౌపతి కంటే దారుణమైన అవమానం గురై నట్టుగా నాకు అన్పించింది. తక్షణమే 3kg dumbells ని కింద పడేసి 10 kg dumbells తీసి కసరత్తు చేయడం ప్రారంభించా. మొదట్లో కొంచెం కష్టం అనిపించినా నా కసి వాటి తోనే continue చేయించింది. అలా biceps, triceps, shoulder exercise లు చేసిన వెంటనే ఒక్క రెండు వారాల్లో ఈ కౌరవుల అందర్నీఅరికాలితో తన్నే భీమిడుని అవుతానన్న కాన్ఫిడెన్సు నాకు వచ్చేసింది. చాలా రోజుల తర్వాత exercise చేయడం వాళ్ళ అప్పుడెప్పుడో బజ్జున్న నా నరాల్లోనికి రక్తం ఒక్కసారిగా ప్రవహించే సరికి నా muscles గట్టిపడ్డాయి. అంతే, పాతాళంలో ఉన్న నా ఆహం కాస్తా తలికి పాకింది!

వెంటనే స్పోర్ట్స్ అపరెల్ షాప్ కి వెళ్లి సిక్స్ పాక్స్ sport చేయడానికి Tshirt చూపించమన్నాను.
వాడు "ఎవరికీ సార్?" అని చాలా వినయంగా నన్నడిగాడు.
"ఎవరికంటావ్ ఏంటయ్యా?? నాకే, చూపించు" అన్నాను నేను.
"ఛీ! బాగోదు సర్. కప్పను మింగిన పాముల కనపడతారు. నేను చూపించను".
"చూడు బాబు, నేను జిం జాయిన్ అయ్యాను. మరి కొద్ది రోజుల్లో సిక్స్ పాక్స్ definite గా sport చేస్తా. నువ్వేం ఫీల్ అవ్వకు, చూపించు పర్లేదు".
"సార్, మొదట్లో అందరు అలానే అంటారు. కాని ...."
"హే!! ఏమనుకుంటున్నావ్ నా గురించి నువ్వు??? మాది క్షత్రీయుల వంశం తెలుసా??
మా తాతయ్య, చిన్న తాతయ్య ఆ రోజుల్లోనే eight packs sport చేసే వాళ్ళంటా".
"ఏమో సార్, నాకు మిమ్మల్ని చూస్తే ఎందుకో నమ్మకం కలగడం లేదు, నా వృత్తికి నేను ద్రోహం చేయలేను".
"సరే, నీకు నమ్మకం కలిగించే మందు నా దెగ్గర ఏమి లేదు. కానీ ముందు, ముందు నువ్వే పశ్యాతాపడతావ్. ఒక నెలలో తిరిగి వస్తా నీ thinking తప్పని prove చేస్తా...అంతవరకు Bye!".

" బాస్, నిన్న heavy weights లిఫ్ట్ చేశా, ఒక్క సారి నన్ను observe చూసి, ఏయే కండలు పెంచేయ్యాలో చెప్పండి, పెంచేస్తా" అన్నాను ట్రైనేర్ తో..
నన్ను పైన నుండి కింది వరకు జాలిగా ఓ చూపు చూసి "నువ్వు కండలు తర్వత పెంచొచ్చులే, ముందు ఆ కొవ్వును కరిగించు. వెళ్లి Treadmill మీద కాసేపు పరిగెత్తు. వెళ్ళు" అన్నాడు.
"ఆగాగు...నీకు కొత్త కాబట్టి, 7kmph set చేసుకొని, ఒక పది నిమిషాలు పరిగెత్తు, చాలు" అన్నాడు.

Treadmill మీద పరుగెత్తడం అన్న కాకరకాయ కూరన్నా నాకస్సులు ఇష్టం ఉండదు. కాని, తంతాడు అని, వాడి బాడీ చూసి బయం వేసి వెళ్లి పరుగెత్తడం స్టార్ట్ చేశాను.
ఇంతలో angelina jolie కంటే కత్తి లాంటి అమ్మాయి స్కర్ట్ వేసుకొని వచ్చి నా పక్కనున్న treadmill మీద పరుగెత్తడం ప్రారంబించింది.
అంతే!! నాకు ఎక్కడ లేని ఉత్సాహం, ఉషారు వచ్చేసింది. తనను ఎలానైన impress చేయాలనీ 7kmph ఉన్నా treadmillని 15kmph సెట్ చేసి తననే చూస్తూ ఉసాన్ బోల్ట్ కంటే వేగంగా పరుగేడుతున్నాను. అలా ఓ రెండు నిముషాలు గడిచింది అనుకుంట .......

"ambulence కొంచెం ముందుకు తీసుకోవయ్య"
"మెల్లగా, నెమ్మదిగా దించండి. అటు ఎటు కదులుతుంది, stretcherని గట్టిగ పట్టుకోండి"
"హేయ్, జరగండయ్య, పక్కకు జరగండి పేషెంట్ కి దారి ఇవ్వండి"
"ఏమైంది బాబు అబ్బాయికి ??"
"జిమ్ లో పరిగెత్తుతూ పడ్డాడు అంట. దెబ్బలు బాగానే తగిలినట్టు ఉన్నాయి".
"అలా కర్ర లాగ కదలకుండా ఉన్నడేమి. ఇదేం రోగం బాబు, పక్షవాతమా??"
"పక్షవాతం కాదు తాత, జిం పైత్యం ఇది. నీకు అర్థం కాదులే, పక్కకు తప్పుకో".
వాడు అడిగింది, వీడు చెప్పేది నాకు వినపిస్తూనే ఉంది. కాని నా బాడీ లోని ఏ పార్టు నాకు సహకరిచడం లేదు. అసలు బాడీ మొత్తం బిగుసుకు పోయింది, చెలనమే లేదు. అందుకు కాబోలు ఆ ముసలోడు పక్షవాతం అనుకుని వుంటాడు. ఇది ముందు రోజు నేను కసితో చేసిన కసరత్తుకు కానుక అని నాకు మాత్రం అర్థం అయ్యింది.

నన్ను హాస్పిటల్ లో అడ్మిట్ చేసి ఒక్క బెడ్ మీద పడుకోపెట్టారు. మా ఫ్రెండ్స్ కి ఈ విషయం తెలిసి అందరు ఒక గంటలో చేరుకున్నారు. జరిగింది తెలిసుకొని కదపుబ్బ నవుకొని, కాసేపు నాపై కామెంట్స్ చేసి, sattires వేసి అలసిపోయి coke తాగి angry birds ఆడుకుంటున్నారు. ఇంతలో పక్కనున్న నా ఫోన్ మోగింది, చూస్తే "Dad calling"....
దానిని చెవి దెగ్గర పెట్టె స్థితిలో కూడా నా చెయ్యి లేకపోవడం వల్లనా, నా ఫ్రెండ్ ఒక్కడు cellని చెవి దెగ్గర పెట్టాడు.

" అరై శాంతి, మొన్న నీకు చెప్పానే US సంబంధం. అది వాళ్ళు cancel చేసుకున్నారా! ఆ అమ్మాయికి US lo already boyfriend ఉన్నాడట. అతాడితోనే పెళ్లి settle అయిందట. అమ్మాయి ముందు ఇంట్లో చెప్పక పోవడం వల్లనా పేరెంట్స్ కి విషయం తెలియదట."

నాకు మాత్రం ఈసారి పట్టరాని కోపం కుప్పలు తెప్పులగా వచ్చింది. సెల్ వెంటనే కట్ చేసి, హైదరాబాద్ అర్జెంటుగా వెళ్లి "ప్రసాద్" అంకుల్ ని గట్టిగ తన్నాలి అనిపించింది.

"అది పోతే పోయిందిలే, ఇప్పుడే క్రిష్ణ బావ ఇంకో సంబంధం తెచ్చాడు. అమ్మాయి హైదరాబాద్ లోనే job చేస్తుంది. వాళ్ళ ఫాదర్ ప్రొఫెసర్. ఈ అమ్మాయి చూడడానికి బాగుందిరా, అఖిల కంటే కూడా చాలా అందంగా ఉంది, బాగా చదువుకుంది కూడాను. మిగితా విషయాలు నీకు తర్వాత చెప్తాలే. హెల్త్ కాపాడుకో ..ఉంటాను, Bye"......అని నాన్న ఫోన్ కట్ చేసాడు.

నన్ను checkup చేసి తిరిగి వెళ్తున్న Doctor తో
"Doctor.. Doctor ..one minute"
"ఏంటి బాబు?"
"ఎన్ని రోజుల్లో discharge అవుతాను Doctor??"
"ఎందుకు బాబు?"
"ప్లీజ్ త్వరగా కోలుకునేలా చేయరు, నేను అర్జెంటుగా GYM కి వెళ్ళాలి...."
------

Sunday, January 22, 2012

సన్యాసి

అప్పటికి నా వయసు 7 ఏళ్ళే కాని మోయలేని భారం నాపై ఉంది. ఎందుకంటే ఆ రోజే నా రెండవ తరగతి ఫలితాలు విడుదల!!!!!

wow ... గెలిచాను, అనుకున్నది సాదించాను, మళ్లీ సెకండ్ క్లాసులో కూడా నేనే స్కూల్ ఫస్ట్. అవును క్లాసు ఫస్ట్ మాత్రమే కాదు స్కూల్ ఫస్ట్ కూడా, వినటానికి విడ్డూరంగా ఉన్నా అదే వచ్చింది నాకు!! .....మా అమ్మ నాన్న మొహంలో ఆనందం, నా బెస్ట్ ఫ్రెండ్ రాకేశ్ గాడి కళ్ళలో అసూయ ఇంకా నాకు బాగా గుర్తు.

కరతాళ ద్వనులు, అభినందనల మధ్య చీమిడి ముక్కును నా చొక్కాతో తుడుచుకుంటూ stage పైకి ఎక్కి ఈ విజయం నా ఒక్కడిదే కాదంటూ, నాకు ఆకలి వేసినప్పుడల్లా తినడానికి బలపాలు ఇచ్చినందుకు బన్నీకి, కోపం వచ్చినప్పుడల్లా కోరికించుకున్నందుకు బంటి గాడికి, మూడ్ వచినప్పుడల్లా గోలీలాట ఆడినందుకు మధు గడికి, బాధలో ఉన్నప్పుడల్లా నన్ను బేకరీకి తీసుకెల్లినందుకు మా బాబైకి, last but not least exam లో నాకు బాగా cooperate చేసి వాడు evaporate అయినందుకు రాకేశ్ గాడికి నా కృతజ్ఞతలు తెలిపి రుణం తీర్చుకుందాం అనుకునేసారికి నా ఆవేశానికి బ్రేకులు వేస్తూ నాకు Prize ఇచ్చి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్టేజి దిగమన్నారు. నేను century మిస్సై పెవిలియన్ వైపు నడుస్తున్న" ఆశిష్ నెహ్రా " లాగ స్టేజి దిగుతుండగా నన్ను చూపిస్తూ మా ప్రిన్సిపాల్ " అటు చూడండి, రాబోయే కాలం కాబోయే కలాంని చుడండి .... ఈనాటి ఈ చిరుతడే రేపటి మగధీరుడు" అని అందరిచేత చప్పట్లు కొట్టించాడు.
"వోరై కలాం అంటే ఎవరురా? మొన్న 10th క్లాసు లో అందరికంటే ఎక్కువ మార్కలు తెచుకున్నాడు చూడు అతనా?" అని అడిగాడు పక్కనే కూర్చున్న మధు గాడు..."కాదురా, విక్టరీ talkies ముందున్న పెద్ద bungalow లోనికి రోజు కార్లో వస్తాడు చూడు తను" అని నేను నమ్మింది చాలా నమ్మకంగా చెప్పేసరికి వాడు నమ్మేసాడు. అప్పటికింకా మా ఇద్దరికీ వాడు ఆ కార్ డ్రైవర్ అని తెలియదు!!! ( "కాపీలు కొడితే మార్కులు వస్తాయి కాని జ్ఞ్యానం ఎందుకు వస్తుంది??" వెనకనుండి ఎవడో)
సుమారు రెండు సంవత్సరాల వరకు చుట్టూ ఉన్న నా స్నేహితుల సహకారం, ప్రోద్బలం వలన చదువులో నా అధిపత్యం అలాగే కొనసాగింది. అందరికంటే పైన ఉండాలంటే మనం ఎదగాలి లేదా మన తోటి వారిని కిందికి తొక్కాలి. రెండోది నాకు venilla తో పెట్టిన విద్య. అలా కొద్ది కాలం లోనే నేను ranker గా పేరు తెచ్చుకొని class leader గా ఎదిగాను. ఇక అక్కడినుండి నేను వెనిక్కి తిరిగిచుడాల్సిన అవసరం రాలేదు. నేను ఆడిందే ఆట పాడిందే పాట.
ఇలా నడుస్తున్న నా జీవన గమనం లోనికి మా చిన్న తాతయ్య ఒకరోజు ఎంటర్ అయ్యాడు. ఆ రోజుల్లో తను పెద్ద పెద్ద చదువులు చదివి కాలేజీ లో ప్రిన్సిపాల్ గా పని చేస్తుండే వాడు. తను రాగానే asusual గా మా అమ్మ నా ప్రతిభ పాటవాల గురించి ఖచేరి చేస్తుండంగా సీన్ లోనికి నేను ఎంటర్ అయ్యాను. నన్ను చూసి "పెద్దయ్యాక నువ్వేం అవుదాం అనుకుంటున్నవురా" అని అడిగాడు తాతయ్య. నేను వెంటనే "collector" అవుదాం అనుకుంటున్నా అని తడుముకోకుండా చెప్పేసరికి తను శభాష్!! అని నా భుజాన్ని తట్టి వీడిని చూస్తుంటే తప్పకుండా వీడు కలెక్టర్ అవుతాడు అని మా అమ్మతో అనేసాడు. అనడమే ఆలస్యం మా అమ్మ మొహం 1000 watts బుల్బులు ఒకేసారి 1000 వెలిగించినంత ప్రకాశవంతగా మెరువ సాగింది. నన్ను దెగ్గరకి తీసుకొని నా నొసటి మీద ముద్దు పెట్టింది. ఇక అంతే, ఆ రోజు నుండి నా జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది. అమ్మ కళ్ళలో ఆనందాన్ని శాశ్వతం చేయాలనీ, నేను ఖచ్చితంగా కలెక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. అవును, చెప్పులు కుట్టేవాడికి baata షోరూం పెట్టాలని, కిరాణా కొట్టు వాడికి commerical కాంప్లెక్స్ కట్టాలనే ఆశయం ఎంత సహజమో , నా లాంటి మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన మిడిల్ క్లాసు topperకి ఎప్పుడో ఒకప్పుడు కలెక్టర్ అవ్వాలనే ఆశ కలగడం అంతే సహజం.
కలెక్టర్ అవ్వాలంటే General knowledge బాగా రావాలి, అందుకని రోజు పేపర్ చదవడం ప్రారంభించాను. కాని పాడు పేపర్లలలో సినిమా కథలు, పిట్ట కథలు తప్ప వేరే articles నన్ను attract చేయలేక పోయాయి. దానితో పేపర్ చదవడం బోర్ కొట్టేసి టీవీ చూసి లోకాన్ని తెలుసు కోవాలి అనుకున్నాను. "TV పెట్టె వరకే మనకు అధికారం కలుదు కానీ దాన్ని కట్టే అధికారం మనకు లేదు" అనే జీవిత సత్యం నాకు ఇంకా తెలియదు!! ... కలెక్టర్ కలని కొంచం వాయిదా వేసి మోగ్లీ, జంగ్లీ లాంటి serials తో కాలక్షేపం చేయడం ప్రారంబించాను.

వాల్మీకి రామాయణం, రామానంద్ సాగర్ మహా భారతం ఒక ఊపు ఉపెస్తున్న సమయంలో నేను వాటికీ ఆకర్షితుడిని అయ్యాను. అదే సమయంలో భక్త ప్రహలద, అది శంకరా చార్య మరియు షిరిడి సాయి బాబా మహత్యం సినిమాలు బ్యాక్ to బ్యాక్ చూడడం వల్లనో ఏమో వాటి ప్రభావం నాపై చాల పడింది. కరడు కట్ట్టిన నా రాతి గుండెల్లో కరుణను నింపాయి. నాలోని ఆధ్యాత్మిక భావాల అలలను కధం తట్టి నిద్దుర లేపాయి. నేను ఒక పెద్ద "సన్యాసి" కావాలని అప్పుడే fix అయ్యాను. సన్యాసి కావాలంటే ముందు ఈ ప్రపంచం వదిలి దూరంగా ఎటైనా పారిపోవాలి. కానీ అంత చిన్న వయసులో నాకు అది సాద్యం అయ్యే పనేనా అనే బయం కలిగింది. కానీ నా ధైర్యం ఎప్పుడూ బయం కంటే చాలా బలమైనది!!! వెళ్ళాలని నాతో కచ్చితంగా చెప్పింది. "కాని ఆగు... మరి అమ్మకి నువ్వు ఇచ్చిన మాట సంగతి ఏంటి?" అని అడిగింది నా అంతరాత్మ. జవాబు కోసం నాలో మదనం మొదలైంది. నా మనసు ఎక్కువ సేపు చిరాకుగా ఉండ లేదు అనుకుంట, 4వ తరగతి చదువుతూ, బటానీలు తింటూ బడికి ఎలా డుమ్మా కొట్టాల అని ఆలోచిస్తున్న మా అన్నయ వైపుకు నా దృష్టిని మళ్ళించింది. టక్కున ఆలోచన వచ్చింది, అన్నయను collector చేసి నేను సన్యాసి అయిపోవచ్చు కదా అని. కాని నేను collector నుండి తప్పుకోవాలంటే ముందు వాడు ఒప్పుకోవాలి. వాడిని ఒప్పించడం ఎలా???

ఓ రోజు సాయంత్రం అయిదింటికి ఆసక్తిగా "పాడి పంట - పశువల పెంపకం" program చూస్తున్న వాడి దెగ్గరికి వెళ్లి ....
"అన్నయ, నేను సన్యాసి అవ్వాలనుకుంటున్నరా "...
"కోత్తగా అవ్వడమేంటిరా? అందరు నిన్ను అదే అంటుంటారు కదా" అన్నాడు అమాయకంగా ...
తెలిసి అన్నాడా తెలియక అన్నాడా అని నాకు తెలియక పోవడం వల్లనా నేను పేద్దగా పట్టించుకోక..వాడి జుట్టు పట్టుకోలేదు.
"ఆ సన్యాసి కాదు, తపస్సు చేసి నేను నిజంగానే పెద్ద సన్యాసిని అవుతా..కాని నాకు నీ help కావాలి. అమ్మకు నేను collector అవుతా అని మాటిచ్చాను, కాని ఈనా జన్మలో నేను అది నేర్వేర్చలేను. ఆ మాటను నువ్వు నిలబెట్టాలి, collector అవ్వాలి" అన్నాను.
"collector అవ్వాలి అంటే ఏం తినాలి తమ్ముడు?" అని కళ్ళు మిటికరిస్తూ అడిగాడు నన్ను.
(ఆ రోజుల్లో "boost is the secret of my energy" అనే ad వాళ్ళ కాబోలు ఆ అజ్ఞ్యానం)
"చదవాలి, తినడం కాదు చేయాల్సింది, Collector అయితే ఏదైనా ఆడొచ్చు, ఎవడినైన కొట్టొచ్చు...అడిగే వాడు ఉండడు".
వాడు చాలా sincere గా నేను చెప్పేది ఆలకించడం చూసి ...వాడిని ఎలా అయిన motivate చేయాలనీ చెప్పి.
"అసలు ఆఫీసుకి డుమ్మా కొట్టిన సెలవు పెట్టిన పట్టించుకోడానికి sirlu madamlu ఎవరు ఉండరంట. మనమే అందరికంటే పెద్దనంట." అని వాడితో నేను అన్నాను.
"నువ్వు చెప్పేది వింటుంటే నాకు collector అవ్వాలనే ఉంది తమ్ముడు. కాని నేను అవ్వలేను" అన్నాడు.
"ఏ ..ఏ ...ఏ ..ఎందుకని?" అని నిరాశతో నేను వాడిని గట్టిగ అడిగాను.
"ఏ అంటే ఎం చెప్పనురా?? నాకు నీలానే చిన్నప్పటి నుండి ఒక ఆశయం ఉంది. నేను బాగా చదివి పెద్దయాక veterinary doctor కావాలని కలలు కంటున్నా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంబలు, ఆవులు అంటే ఎంత ఇష్టమో నీకు తెలసు కదా. పిట్టలన్న, పావురాళ్ళు అన్న ఎంత ప్రాణమో నీకు తెలియదా!...మన వీది కుక్కలకు పెద్ద దిక్కు అయిన నన్ను veterinary doctor కాకుండా collector అవ్వమంటే ఎలా? వాటి..." అని వాడు అంటుండగానే టీవీలో
"ఈ వరం పాడి పంట ఇంతటితో సమాప్తం, తిరిగి వచ్చే వరం ఇదే సమయానికి మళ్లీ కలుద్దాం, సెలవు".
-------

తన పేరు స్వప్న

ప్రేమ అంటే ఏంటో తెలియకున్నా దాన్ని పొందాలని పరితపించే రోజులవ్వి. కానీ ప్రేమని పొందాలంటే ప్రేయసి కావాలి కదా, అందుకే తన కోసం ఘాడంగా అన్వేషిస్తున్న రోజుల్లో నాకు ఎదురైనా యదార్థ సంగటనే ఈ కథకి స్ఫూర్తి.

ఆ రోజు ఉదయానే 8:30 కి లేచి చక చక స్నానం, భోజనం 3 hours lo చేసేసి office కి వెళ్ళాను. ఎప్పటిలాగే త్వరత్వరగా ఈనాడు, సాక్షి, జ్యోతి పేపర్లు చదివేసి అలసిపోయాను అనిపించగానే colleagues తో కలిసి టీ కోసం cafeteria కి వెళ్ళాను. నా కళ్ళు ఎప్పుడూ కన్నెల అందాల్ని బంధించడానికి కదులుతూ ఉంటాయి కాని cafeteria లో మాత్రం అవ్వి పరుగులు పెడతాయి.....ఎందుకంటే అన్ని అందాల్ని అందుకోవద్దు మరీ?

తన పేరు స్వప్న, మా ఆఫీసు లోనే పని చేస్తుంది. టీ కోసం కాబోలు వచ్చి నా చూపులకి చిక్కింది. నేను చాలా మంది అమ్మాయలని చూసాను కానీ అంతటి తేజస్సు ఏనాడూ ఎవరి మొహంలోను చూడలేదు. నేను తన అందమైన కళ్ళని, అంతకంటే అందమైన తన పెదాలని, మల్లె పువ్వు లాంటి ఆ చిరునవ్వుని, చూపును చుట్టేసి మనసుని కట్టేసే తన నల్లని కురులను చూస్తూ ఉండిపోయాను. నాకు తెలివి వచ్చే లోపే తను అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక మాస్టరు చూసింది చాల్లే వెళ్దామా అనట్టు చూసారు మా colleagues. I know its "jealousy" అనుకున్నాను నేను !!!

అల కొద్ది రోజుల్లో నా చూపులకి తన చూపులు బదలు పలకడం ప్రారంబించాయి. తన అందం కోసం నా కళ్ళు గాలిస్తే నా చూపుల కోసం తను ఎదురు చూసేది. ఈ చూపుల పరిచేయాన్ని మాటల పరిచేయంగా మలచాలని తీవ్రంగా ప్రయత్నించాను. అలంటి ప్రయత్నంలోని భాగంగానే ఒక్క బలీయమైన సమయంలో తనకి facebook లో రిక్వెస్ట్ పెట్టాను.
పెట్టేవరకు cool గానే ఉన్నాను పెట్టినతర్వతే నా temperature 104 డిగ్రీలకు చేరింది. కాని అంతలోనే ఉపశమనం, తను నా రిక్వెస్ట్ని అంతే వేగంగా accept చేసింది. ఇక నా ఆనందానికి హద్దులు లేవు, ఉత్సాహానికి కొలతలేవు.
అప్పుడే మొదలైంది మా ఇరువురి మధ్య చాటింగ్.......
నేను - హాయ్ స్వప్న, నా ఫ్రెండ్ రిక్వెస్ట్ accept చేసినందుకు థాంక్స్ ....
స్వప్న - హాయ్ !! మీది హైదరాబాదా?
నేను - అవును, కాని మీ native place హైదరాబాద్ కాదు అనుకుంట...
స్వప్న - ఏ, ఎందుకల అనుకుంటున్నావ్?
నేను - హైదరాబాద్ అమ్మాయిలు ఇంత అందంగా ఉండరు !!!
u look very cute...... (భయం ఎం అనుకుంటుందో అని)
స్వప్న - hahaha...thank you!!!...కాని మాది హైదరాబాదే
నేను - అవునా ?? (గర్వంతో కూడిన ఆనందం ఏం అనలేదని -
నిజం చెప్పాలంటే internet పుణ్యమా అని అప్పటికే తన ఊరు మాత్రమే కాదు తనకు ssc లో ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా నాకు తెలుసు .... కానీ ఎందుకో నాకు నిజం కంటే అబద్దమే తీయగా అనిపించింది ఆ క్షణం)
నువ్వు ఈరోజు వేసుకుంది చుడిదార్ కదా....నీకు చుడిదార్ చాల బాగుంటుంది..
(నా ఉద్దేశం jeans/Tshirts పెద్దగ suite అవ్వవు అని ..కానీ ఈ లోకంలో  లౌక్యం చాల ముఖ్యం.
అమ్మాయిల విషయం లో అయితే మరీను)
.....
స్వప్న -  పొగడ్తలు ఇక చాలు బాబు..అసలే ఈమధ్య లావు అవ్వుతుంటే !
నేను - ఏం చేస్తాం చెప్పు... ఫాన్స్ ఉంటె ఇలాంటి problems తప్పవు.. over చేస్తారు ..కానీ నువ్వే lite ga తీసుకోవాలి :)
స్వప్న - hahaha lol, u naughty :)
నేను - బుక్స్, నొవెల్స్ వంటివి చదువుతావ?
స్వప్న - oh yes, ఎందుకు చదవను ..నాకు fiction నొవెల్స్ అంటే చాల ఇష్టం ...shakesphere, agatha, sheldon నొవెల్స్ అంటే చాల ఇష్టం ..ఇంకా
నేను - (దూల కాకపోతే ఎగ్జామ్స్ అప్పుడు "all in one" కూడా సరిగ్గా చదివి ఏడ్చి ఉండను ...అలాంటిది బుక్స్ topics నాకు అవసరమా అనుకోని) ------ oh ok, its great !!! సినిమాలు చూస్తుంటావా?
స్వప్న - ఒకప్పుడు చుసేదానినే కాని ఇప్పుడు కుదరడం లేదు ..అసలు టైం ఉండట్లేదు ...
నేను - రెట్టించిన ఉత్సాహంతో ..... మనం ఈరోజు ఈవెనింగ్ కాఫీడేకి కలిసి వెళ్దామా ???
స్వప్న - నాకు వీలు కాదు ...!!
నేను - ఏ?? ... పోనిలే ఈరోజు కాకుంటే రేపు...రేపు ఈస్ బెటర్, ok na?
స్వప్న - hmm, వచ్చేధాన్నే కానీ నేను రేపు కూడా busy
నేను - ఎప్పుడూ busy అంటావ్ ఏంటి ??? అంత బిజీనా నువ్వు?
స్వప్న - haha... అవును 1 year old కూతురు ఉంటె నీకు తెలిసేది...