Saturday, March 9, 2013

నేను, ఒజోమెన్ , ఓ అమ్మాయి

"మా కంపెనీలో చేరినందుకు మీ అందరికి ధన్యవాదములు. ఈ రోజుతో మీ జీవితం ధన్యం  అయిపొయింది, ఎందరో మేధావులు సాధించాలి  అనుకున్నా వీలుకాని ఉద్యోగం మిమ్మల్ని వరించింది. మీరు మా కంపెనీలో పని చేసే వర్కర్లు ఎంత మాత్రమూ కాదు, మీరు  మా కంపెనీ లీడర్లు, దీని భవితను నిర్దేశించే మార్గ దర్శకులు. మీ అందరికి 'ఒజోమెన్' కంపెనీ తరపున సాదరంగా ఆహ్వానం తెలుపుతున్నాను. ఈ రోజు ఎవరింటికి వాళ్ళు వెళ్ళండి, అలాగే రేపటి నుండి ఎవరి ఆఫీసులకు వాళ్లు  వెళ్ళండి. లేవండి, లేచి బయలుదేరండి. బాబు నీ  పక్కనున్న ఆ బాబును (అంటే నన్ను) ఇంటికి వెళ్లి నిద్రపోమ్మను" ...అని నా పక్కనున్న వాడితో చెప్పింది న్యూ joineesకి  ఇండక్షన్ ఆర్గనైజ్ చేసిన HR.

వాడు నన్ను లేపి కాబ్ సర్వీస్ రిజిస్టర్ చేసుకోడానికి పట్టుకెళ్ళాడు. నాకు కాబ్ ఉదయం 7:00 కావాలని చెప్తే, అక్కడున్న ఆపరేటర్  అలాగే ఎంటర్ చేసాడు. ముందు పని చేసిన కంపెనీ లో ఏనాడూ కనీసం 11 గంటల లోపు కూడా ఆఫీస్ కి వెళ్ళిన పాపాన పోలేదు. మా మేనేజర్ నా కాలర్ నుండి స్లిప్పర్స్ వరకు అన్ని పట్టుకొని బెదిరించి బ్రతిమిలాడినా నేను ఆ పాపం చేయలేదు. కానీ ఎందుకో సందర్భం వస్తే చాలు నన్ను నేను మార్చు కోవాలని, మెరుగవ్వాలని, అయ్యి ఈ దేశాన్ని బాగుచేయాలని, దేశ ప్రగతికి పునాదినై అనాధలందరినీ ఆదుకోవాలనీ, ఏవేవో కలలు కంటాను!

మర్నాడు ఉదయం నేను గాఢ నిద్రలో ఉండగా నా సెల్ మోగింది. లిఫ్ట్ చేసి హలో అన్నాను .."సర్, ఒజోమెన్ కాబ్ డ్రైవర్ని కాల్ చేస్తున్నాను, కాబ్ రెడీ ..2 మినిట్స్ లో వచ్చేయండి సర్" అని వాడి సెల్ నీ, నా  నిద్రనీ కట్ చేసాడు.  అంతే, నా మధుర స్వప్నం నుండి ఒక్కసారి ఈ ముదురు ప్రపంచంలోనికి పడ్డాను, నిద్ర నుండి తెరుకుని గబా గబా బ్రష్ చేసి, స్నానం చేసినట్టు చేసి, హడావిడిగా చెప్పులు వేసుకొని బయటికి నడవడం మొదలు పెట్టాను. ఇదంతా గమనిస్తున్న నా రూమ్ మేట్ వాసు గుమ్మానికి అడ్డంగా నిల్చున్నాడు. నన్ను అలానే వెళ్ళవద్దు అని హెచ్చరించాడు. "ఎందుకు??.."  అని అసహనంగా అడిగాను. వాడు నా నిక్కరుని చూపించి నన్ను స్పృహ  లోనికి తెప్పించి  నా  చేత దానిపై ప్యాంటు వేయించి పంపించాడు.

"ఈ కాబ్ డ్రైవర్లు ఇంకా ముందే నిద్ర లేచి ఉంటారు కదా ! మరి వీళ్ళు  ప్యాంటు వేసుకోవడం ఎప్పుడూ మరిచిపోరా?" అని నాలో నేను ధర్మ సందేహం వెలిబుచ్చుతూ నిదానంగా మెట్లు  దిగేసి మా ఇంటి గేటు దాటుతూ ఉన్నానో  లేదో ... నన్ను చూసి అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు ఒక్కసారిగా కిందికి పరిగెత్తడం ప్రారంభించాడు. అప్పటివరకు చక్కగా ఆటలు  ఆడుకుంటున్న  పిల్లలందరూ ఏడుస్తూ వాళ్ళ ఇంటి వైపుకు పరిగెత్తసాగారు.  పారిపోవడం చేత కాని చెట్లన్నీ విరిగిపోదామా అన్నట్టుగా ఊగా సాగాయి. వీధిలో గట్టిగా  మొరుగుతున్న కుక్కలన్నీ  ఒక్క మాటున తోక ముడిచి భయంతో దగ్గరకు బిగుసుకు పోయాయి. మా కాలనీ వాళ్ళంతా బెంగుళూరులో సునామి వస్తుందేమో అన్న భయంతో  ఇంటి మేడలపై  ఎక్కి దేవుణ్ణి  ప్రార్థించడం ప్రారంభించారు. ఇంకోవైపు  ముదుసళ్ళు ఈరోజే ఈ నరకం నుండి తమకు విముక్తి అని ఆనందంగా నవ్వడం మొదలు పెట్టారు.  "ఆవును మరి!! ఈ లోకంలో ఎప్పుడూ ఊహించని హఠాత్ పరిణామం ఎదురైతే తట్టుకునే ధైర్యం ఎంత మందికి ఉంటుంది?" అని నాలో నేను నవ్వుకొని కాబ్ వైపు అడుగులు వేయడం ఆరంభించాను.

నేను ఊహించనంత వింతగా ఏమి లేదు ఉదయం 7:00 గంటలకి !!!. మాములుగానే అనిపించింది నాకు. కొంచెం చీకటిగా  ఉంది కాకపోతే. అంతే పెద్ద తేడా ఏమి లేదు. ఎప్పుడో చిన్నప్పుడు దైవ దర్శనం కోసం తిరుపతికి వెళ్ళినప్పుడో, అప్పుడెప్పుడో  జబ్బు చేసి మా నానమ్మ చనిపోయినప్పుడో తప్ప ఉదయాన్నే లేచే అవసరం  నాకు పెద్దగా ఎప్పుడూ రాలేదు.
నేను రావడం చూసి, కాబ్ డోర్ తీస్తూ డ్రైవర్ వెటకారంగా "సర్! మీ వాచ్ ని మార్చేయండి సర్! అది 10 నిమిషాలని కూడా 2 నిమిషాలుగా చుపిస్తునట్టు ఉంది. ఇలా అయితే రోజూ కష్టం" అని నాతో వాడి  ఆక్రోశాన్ని చెప్పకనే చెప్పాడు. కాబ్ లో వాళ్ళంతా నాకు ఏదైనా ఇంకా  పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి అన్నట్టు వాడి వైపు చూడ సాగారు. నేను చిన్నగా ఒక నవ్వు వాళ్ళ మోహన పడేసి కాబ్ ఎక్కేసి నిద్రలోకి జారుకున్నాను.

నేను లేచేసరికే కాబ్ కాస్తా పాకిస్తాన్ మీదుగా ఆఫ్గనిస్తాన్ వెళ్ళుతునట్టు నాకు అన్పించింది. వెంటనే ఏ ఆఫీస్ కి వెళ్తున్నావని అడిగాను ..ఒక్కడు wtc ని చాలా నింపాదిగా  నెమ్మదిగా  చెప్పాడు. నేను వెళ్ళాల్సింది safina  టవర్స్  అని కంగారుగా చెప్పెసరికే, నిద్రలో ఉన్నవాలంత ఒక్కసారిగా ప్రళయం వస్తే లేచినట్టుగా లేచి నా వైపు చిరాకుగా, కరుకగా, కరుస్తాం  అన్నట్టు చూసారు.  ముందు రోజు  నేను క్యాబ్ టైమింగ్ చెప్పి ఏ ఆఫీసో  చెప్పనందు వాళ్ళ ఆ ఆపరేటర్ వాడి స్వంత తెలివి తేటల్ని నా తెలివి తక్కువ తనాన్ని  బాగా వాడుకున్నాడు. నేను వాళ్ళకి సారీ చెపి ఆటో వేసుకొని ఆఫీస్ కి వెళ్లి అక్కడ నా  క్యాబ్ అడ్రెస్స్ మర్పించాను.  మరుసటి రోజు నేను అనుకున్న విధంగానే మా ఆఫీసు క్యాబ్  వచ్చింది.

అలా ఒక రెండు రోజులు క్యాబ్ రావడం నేను ఆఫీసు వెళ్ళడం సహజంగా జరిగి పోయింది.  పైగా ఈ ఆఫీసు క్యాబ్లు రోజు మారుతూ ఉంటాయి. ఈ రోజు వచ్చింది రేపు రాదు.  మూడో రోజు కూడా క్యాబ్ వచ్చింది, కాని ఈసారి దాని వెంట  ఒక అధ్బుతాన్ని వెంట తెచ్చింది. ఆ అద్బుతం పేరు "మానస". అందానికి బ్రాండ్ అంబాసడర్ లాగ ఉంది తను.
ముందు సీటు కాలిగా ఉందని చూసి వెనెక  సీట్లో తన పక్కన కూర్చున్నాను . "అద్బుతం జరిగే ముందు ఎవరూ గుర్తించరు, జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు" అని కిట్టి గాడు  దూకుడు సినిమా 100 రోజుల ఫంక్షన్ లో చెప్తే ఏమో అనుకున్నా, కాని ఇప్పుడు అది నిజం అనిపిస్తోంది. లేకపోతే ఎడారి లాంటి నా బ్రతుకులోనికి సోనాలి బింద్రే లాంటి ఈ  అమ్మాయి రావడం ఏంటి? రోజు తన పక్కన కూర్చొని ప్రయాణం చేయాల్సిన అవకాశం రావడం ఏంటి? ఏంటో ఈ ప్రపంచం, ఇదో పెద్ద మాయ. ఊహించనివి ఊపిరి పోసుకుంటాయి, ఊహకు అందేవి చటుకున్న మాయం అవుతాయి!!

తన పక్కన కూర్చొని బ్యాగ్ సద్దుకుంటున్న నా వైపు చూసి ఒక చిన్న చిరునవ్వును పలకరింపుగా విసిరింది. అమెరికా వెళ్ళాలంటే వీసా ఎంత కీలకమో, అమ్మాయితో మాటలు కలపాలంటే ఈ నవ్వు అంతే అవసరం. అందుకే, వెంటనే తన పేరు అడిగి, ఎక్కడి నుండి వస్తుంది అని ఆరా తీస్తూ, తన నుండి వెలువడే సువాసనను ఆస్వాదిస్తూ, ఉవెత్తున్న ఎగిసి పడుతున్న ఉద్వేగాలని అణిచి వేస్తూ, తన వైపు చూస్తూ తను చెప్పేది వింటునట్టుగా నటిస్తున్నాను.  అయినా అసలు నేను  ఎందుకు నటించాలి? తన నవ్వు చాలా బాగుందనీ, తను చాల అందంగా ఉందనీ, తనను పదే పదే అల చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది అని చెప్తే తప్పేంటి? అసలు సౌందర్యానికి ముగ్ధులు కానిది ఎవరు ఈ లోకంలో? నాలో కల్గిన భావలికి, ఆనందానికి  తన సౌందర్యం ఆధారం కదా? మరి అలంటి ఆధారాన్ని ఆరాదించక అణచి వేసి అవమానించడం ఎంత వరకు సబబు?  అందుకే నిస్వార్థమైన నా మనుసులోని భావాలని  నిజయతిగా మాటల రూపంలో  తనకు చెప్పాను.  "థాంక్స్" అని నవ్వుతు చెప్పింది. సిగ్గుతో తన మొహం కాస్త ఎర్రగా మారింది.  మా ఇద్దరి మధ్యలో నల్లని పరదలా ఉన్న తన కురులని తల పైకి అనుకోని నా వైపు అమాయకంగా చూసి నా పేరేంటి అని అడిగింది.

నేను పేరు చెప్పి నాకు మొదటి రోజు జరిగిన అనుభవాన్ని తనకు చెప్పను. తను నవ్వుతుంది అనుకుంటే అర్థం కాని ప్రశ్నార్థక మొహం పెట్టింది.  ఇదేదో మరో ప్రళయానికి దారి తీసేలా ఉందని  నాకు సందేహం కలిగింది. అందుకే ఎందుకైనా మంచిదని ఇంతకి తన  ఆఫీసు బిల్డింగ్ పేరేంటి అని అడిగాను, తను "Indus valley" అని చెప్పింది. ఈ క్యాబ్  "ఒజోమెన్" కి  వెళ్ళడం లేదా అని అడిగాను. బదులగా తను ...  వాట్?? "ఒజోమెన్" ఏంటి అసలు, "Goldman Sachs"కి వెళుతుంది అని నా సందేహం కాస్త వాస్తవం చేసింది.

ఈ సారి నేను ఎక్కినా క్యాబ్ మొదటి రోజులా కనీసం మా కంపెనీది కూడా కాదు, వేరే కంపెనీది! నా తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక, తన కళ్లలోనికి చూడలేక డ్రైవర్ తో క్యాబ్ ఆపమని చెప్పి దిగేసి చక చకా మా ఇంటి వైపు నడవడం మొదలెట్టాను. ఇంతలో మా కింద పోర్షన్ లో మాతో పాటు అద్దెకు ఉంటున్న సారాంశ్ కాస్తా ఆయాసంగా ఎదురుగా  పరుగెత్తుతున్నాడు.

అవమాన భారంతో, ఆశలు కాస్త అడి ఆశలు అయ్యాయన్న బాధతో ఉన్న నాలో వాడి పరుగు ఎందుకో కుతుహలాన్ని నింపింది. పరుగిని ఆపి వాడి ఆయాసానికి అసలు కారణం ఏంటి అని అడిగాను. వాడు చాలా చికాకుగా "ఎవడో హంది (అంటే కనడంలో పంది ), నేను వెళ్ళాల్సిన క్యాబ్ ఎక్కేసాడట. క్యాబ్ డ్రైవర్ ఫోన్ చేసి లేట్ అవుతుంది అని త్వరగా రమ్మన్నాడు. అందుకే ఈ పరుగు" అని దిగులుగా నాతో చెప్పాడు. 

No comments:

Post a Comment