Thursday, April 19, 2012

పెళ్లి చూపు!

"ఒరేయ్ శాంతి, మన ప్రసాద్ అంకుల్ లేడూ, వాళ్ళ ఫ్రెండ్ కూతురికి పెళ్లి సంబంధం చూస్తున్నారంట . అమ్మాయి ప్రస్తుతం అమెరికాలో MS చదువుతుంది. ఇంకో రెండు నెలల్లో ఇండియా వస్తుందంట. వచ్చాక, వెంటనే పెళ్లి చేయాలి అని వారి ఆలోచన. ప్రసాదు నీ గురించి, ఇంకా మన ఫ్యామిలీ గురించి చెప్పి, మన సంబంధం కలుపుకుంటే బాగుంటుంది అని వాళ్ళతో అన్నాడట.

వాళ్ళు దానిని kind heart తో consider చేసి మొదలు నీ biodata, salary pay slips, gazitted ఆఫీసర్ తో attest చేయించిన మెడికల్ టెస్ట్ reports, LKG -PG మార్క్స్ షీట్లతో పాటు ఫోటోషాప్ లో ఎడిట్ చేయని లేటెస్ట్ గా తీయించిన high resolution ఫోటోలు నాలుగు - కుర్చీని ఒకటి, నిల్చొని ఒకటి, చేతులు కట్టుకొని ఒక్కటి, దండం పెడుతూ ఒకటి - వెంటనే mail చేయమన్నారు.

ఈ initial స్క్రీనింగ్ లో నువ్వు పాస్ అయితే, తరువాత అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, రెలటివ్సు వాళ్ళ"టుఫ్లీస్" ఒక మినీ బస్సు లో వారికి తీరిక ఉన్నప్పుడు మన ఇంటికి వస్తారు. మన ఇల్లు, మర్యాదలు, పద్దతులు పరీక్షించి పెట్టె పలహారం నచ్చితే మనం సెకండ్ రౌండ్ కూడా పాస్ అయినట్టే, ఇక ఫైనల్ గా అమ్మాయి ఇండియా వచ్చాక నువ్వు వెళ్లి 3 రౌండ్స్ అఫ్ ఇంటర్వ్యూ appear అయ్యి తనను attract చేస్తే నిన్ను వాళ్ళు OK చేస్తారట. అల్ ది బెస్ట్ రా !!! ...ఆ మరిచి పోయాను అమ్మాయి పేరు చింతకాయల అఖిల అంట" అని మా నాన్న ఫోన్ పెట్టేసాడు.

ఇది విన్న వెంటనే నాకు పట్టరానంత కోపం వచ్చింది. ఫ్రాంక్ గా మనలో మనం మాట్లాడుకోవాలి అంటే చాలా ధుఖం వచ్చింది. ఎందుకంటే నా బుద్ది తెలిసినప్పట్టి నుండి, క్లాసు టీచర్ నుండి కాలేజీ ప్రిన్సిపాల్ దాక ప్రతి వాళ్ళు బాగా చదివితే మంచి అందమైన పెళ్ళాం వస్తుందని, అంబానీ మామగా వస్తాడని నన్ను మోసం చేసి, రాత్రనక, పగలనక tuitionల మీద tuitionలు పెట్టేసి, స్కూల్ లో కాలేజీలో రోజంతా కట్టేసి, నా బాల్యాన్ని, యవ్వనాన్ని కొట్టేసి ....ఇప్పుడేమో మళ్లీ ఈ UPSC పరీక్షా ???

నా ఫ్రెండ్ నాతొ, "ఒరేయ్ అమ్మాయి పేరు ఏమ్మనావ్??? దొరికేసిందిరా .... ఫేస్ బుక్ లో తన ప్రొఫైల్!!సూపర్ ఫిగరు మామ్...అచ్చు ఇలియానాలా ఉంది."
అంతే, ఆవేశ ఆక్రోశాలతో విల విలలాడుతున్న నా మది లో ఒక్క క్షణం పెద్ద నిశబ్దం...అప్పటి వరకు వాడిన కొత్తిమీర కట్టలా ఉన్నా నా మొహం ఇది విన్న వెంటనే సిగ్గుతో ఎర్రని ఆపిల్ పండుల మారింది.
"ఒరేయ్ మామ, ఆ అమ్మాయి చూస్తే చాలా posh గా, అందంగా ఉంది, పైగా US లో చదువుతుంది. నేను ఇంతకి అమ్మాయికి నచ్చుతానంటావా???"
"ఛాన్సే లేదు రా, ఆ అమ్మాయేమో చూడానికి angel లా ఉంది. నువ్వేమో ఆ చింపిరి జుట్టు, గుండ్రటి పోట్టేసుకొని
కమెడియన్ కి కజిన్ లా ఉన్నావ్. ఆ తెగువ, వీరత్వం నీలో ఏ పట్టాన కనిపించడం లేదు. కష్టం రా!"
"ఒరేయ్ మామ, అలా అనకురా, ఎలానైన ఆ అమ్మాయికి నేను నచ్చాలంటే ఏం చేయాలో చెప్పరా?"
"దానికి ఒక మార్గం ఉంది, ఆడదానికి అణుకువ ఎంత ముఖ్యమో మొగాడికి గాంభీర్యం అంత అవసరం. ఆ గాంభీర్యం నీకు రావాలంటే నువ్వు వెళ్లి మన ఆర్నాల్డ్ GYM లో join అయ్యి muscles బిల్డ్ చెయ్యాలి.
సింపుల్ !!"
"జిమ్ కి వెళ్లి బాడీ బిల్డ్ చేస్తే అమ్మాయికి నేను నచ్చుతాన మామ??"
"ఖచ్చితంగా! నువ్వు ముందు కండలు పెంచు, ఆ తరువాత అఖిల ఏంది దాని అక్క హీన రబ్బాని కూడా నీ ముందు Q కట్టాల్సిందే".
"హీన రబ్బానియ? ఎవరురా తను? ఆమె కూడా పెళ్లి చూపులు చుస్తున్నారా? పనిలో పనిగా నా డాకుమెంట్స్, ఫొటోస్ తనకు కూడా మెయిల్ చేసాయన?"
"ఈ అతి ఆవేశమే నిన్ను ముంచేది. ప్రాస కోసం నేనేదో పేరు చెబితే, పిల్లల తల్లికి కూడా నువ్వు పెళ్లి ప్రపోజల్ పెడతానంటూన్నావ్. గుర్తుంచుకో, gym లో అయిన జీవితంలో అయిన ఎప్పుడూ నిదానమే ప్రధానం..."

వాడు చెప్పేది పూర్తిగా వినకుండానే పరుగు పరుగునా జిమ్ కి వెళ్లి అక్కడున్న packages అన్నిట్లో కాస్ట్లీ అండ్ క్లిష్టమైన "six packs in two months" select చేసి డబ్బులు కట్టేసాను. మొదటి రోజు కనుక బాడీ అలవాటు పడడం కోసం అమ్మాయిలు, చిన్న పిల్లలు ఉపోయోగించే 3 kg dumbells రెండు నాకు ఇచ్చి ట్రైనేర్ ప్రాక్టిస్ చేయమన్నాడు. వాటితో ప్రాక్టిస్ చేస్తుండగా అక్కడ ఎన్నో యేండ్లగా కండలు పెంచి పోషిస్తున్న దుర్యోధన, దుష్యాసనలుతో కూడిన కౌరవుల బృందం అంతా నన్ను ఒక్క చంటి పిల్లాడిలా చులకనగా చూసే సరికి ద్రౌపతి కంటే దారుణమైన అవమానం గురై నట్టుగా నాకు అన్పించింది. తక్షణమే 3kg dumbells ని కింద పడేసి 10 kg dumbells తీసి కసరత్తు చేయడం ప్రారంభించా. మొదట్లో కొంచెం కష్టం అనిపించినా నా కసి వాటి తోనే continue చేయించింది. అలా biceps, triceps, shoulder exercise లు చేసిన వెంటనే ఒక్క రెండు వారాల్లో ఈ కౌరవుల అందర్నీఅరికాలితో తన్నే భీమిడుని అవుతానన్న కాన్ఫిడెన్సు నాకు వచ్చేసింది. చాలా రోజుల తర్వాత exercise చేయడం వాళ్ళ అప్పుడెప్పుడో బజ్జున్న నా నరాల్లోనికి రక్తం ఒక్కసారిగా ప్రవహించే సరికి నా muscles గట్టిపడ్డాయి. అంతే, పాతాళంలో ఉన్న నా ఆహం కాస్తా తలికి పాకింది!

వెంటనే స్పోర్ట్స్ అపరెల్ షాప్ కి వెళ్లి సిక్స్ పాక్స్ sport చేయడానికి Tshirt చూపించమన్నాను.
వాడు "ఎవరికీ సార్?" అని చాలా వినయంగా నన్నడిగాడు.
"ఎవరికంటావ్ ఏంటయ్యా?? నాకే, చూపించు" అన్నాను నేను.
"ఛీ! బాగోదు సర్. కప్పను మింగిన పాముల కనపడతారు. నేను చూపించను".
"చూడు బాబు, నేను జిం జాయిన్ అయ్యాను. మరి కొద్ది రోజుల్లో సిక్స్ పాక్స్ definite గా sport చేస్తా. నువ్వేం ఫీల్ అవ్వకు, చూపించు పర్లేదు".
"సార్, మొదట్లో అందరు అలానే అంటారు. కాని ...."
"హే!! ఏమనుకుంటున్నావ్ నా గురించి నువ్వు??? మాది క్షత్రీయుల వంశం తెలుసా??
మా తాతయ్య, చిన్న తాతయ్య ఆ రోజుల్లోనే eight packs sport చేసే వాళ్ళంటా".
"ఏమో సార్, నాకు మిమ్మల్ని చూస్తే ఎందుకో నమ్మకం కలగడం లేదు, నా వృత్తికి నేను ద్రోహం చేయలేను".
"సరే, నీకు నమ్మకం కలిగించే మందు నా దెగ్గర ఏమి లేదు. కానీ ముందు, ముందు నువ్వే పశ్యాతాపడతావ్. ఒక నెలలో తిరిగి వస్తా నీ thinking తప్పని prove చేస్తా...అంతవరకు Bye!".

" బాస్, నిన్న heavy weights లిఫ్ట్ చేశా, ఒక్క సారి నన్ను observe చూసి, ఏయే కండలు పెంచేయ్యాలో చెప్పండి, పెంచేస్తా" అన్నాను ట్రైనేర్ తో..
నన్ను పైన నుండి కింది వరకు జాలిగా ఓ చూపు చూసి "నువ్వు కండలు తర్వత పెంచొచ్చులే, ముందు ఆ కొవ్వును కరిగించు. వెళ్లి Treadmill మీద కాసేపు పరిగెత్తు. వెళ్ళు" అన్నాడు.
"ఆగాగు...నీకు కొత్త కాబట్టి, 7kmph set చేసుకొని, ఒక పది నిమిషాలు పరిగెత్తు, చాలు" అన్నాడు.

Treadmill మీద పరుగెత్తడం అన్న కాకరకాయ కూరన్నా నాకస్సులు ఇష్టం ఉండదు. కాని, తంతాడు అని, వాడి బాడీ చూసి బయం వేసి వెళ్లి పరుగెత్తడం స్టార్ట్ చేశాను.
ఇంతలో angelina jolie కంటే కత్తి లాంటి అమ్మాయి స్కర్ట్ వేసుకొని వచ్చి నా పక్కనున్న treadmill మీద పరుగెత్తడం ప్రారంబించింది.
అంతే!! నాకు ఎక్కడ లేని ఉత్సాహం, ఉషారు వచ్చేసింది. తనను ఎలానైన impress చేయాలనీ 7kmph ఉన్నా treadmillని 15kmph సెట్ చేసి తననే చూస్తూ ఉసాన్ బోల్ట్ కంటే వేగంగా పరుగేడుతున్నాను. అలా ఓ రెండు నిముషాలు గడిచింది అనుకుంట .......

"ambulence కొంచెం ముందుకు తీసుకోవయ్య"
"మెల్లగా, నెమ్మదిగా దించండి. అటు ఎటు కదులుతుంది, stretcherని గట్టిగ పట్టుకోండి"
"హేయ్, జరగండయ్య, పక్కకు జరగండి పేషెంట్ కి దారి ఇవ్వండి"
"ఏమైంది బాబు అబ్బాయికి ??"
"జిమ్ లో పరిగెత్తుతూ పడ్డాడు అంట. దెబ్బలు బాగానే తగిలినట్టు ఉన్నాయి".
"అలా కర్ర లాగ కదలకుండా ఉన్నడేమి. ఇదేం రోగం బాబు, పక్షవాతమా??"
"పక్షవాతం కాదు తాత, జిం పైత్యం ఇది. నీకు అర్థం కాదులే, పక్కకు తప్పుకో".
వాడు అడిగింది, వీడు చెప్పేది నాకు వినపిస్తూనే ఉంది. కాని నా బాడీ లోని ఏ పార్టు నాకు సహకరిచడం లేదు. అసలు బాడీ మొత్తం బిగుసుకు పోయింది, చెలనమే లేదు. అందుకు కాబోలు ఆ ముసలోడు పక్షవాతం అనుకుని వుంటాడు. ఇది ముందు రోజు నేను కసితో చేసిన కసరత్తుకు కానుక అని నాకు మాత్రం అర్థం అయ్యింది.

నన్ను హాస్పిటల్ లో అడ్మిట్ చేసి ఒక్క బెడ్ మీద పడుకోపెట్టారు. మా ఫ్రెండ్స్ కి ఈ విషయం తెలిసి అందరు ఒక గంటలో చేరుకున్నారు. జరిగింది తెలిసుకొని కదపుబ్బ నవుకొని, కాసేపు నాపై కామెంట్స్ చేసి, sattires వేసి అలసిపోయి coke తాగి angry birds ఆడుకుంటున్నారు. ఇంతలో పక్కనున్న నా ఫోన్ మోగింది, చూస్తే "Dad calling"....
దానిని చెవి దెగ్గర పెట్టె స్థితిలో కూడా నా చెయ్యి లేకపోవడం వల్లనా, నా ఫ్రెండ్ ఒక్కడు cellని చెవి దెగ్గర పెట్టాడు.

" అరై శాంతి, మొన్న నీకు చెప్పానే US సంబంధం. అది వాళ్ళు cancel చేసుకున్నారా! ఆ అమ్మాయికి US lo already boyfriend ఉన్నాడట. అతాడితోనే పెళ్లి settle అయిందట. అమ్మాయి ముందు ఇంట్లో చెప్పక పోవడం వల్లనా పేరెంట్స్ కి విషయం తెలియదట."

నాకు మాత్రం ఈసారి పట్టరాని కోపం కుప్పలు తెప్పులగా వచ్చింది. సెల్ వెంటనే కట్ చేసి, హైదరాబాద్ అర్జెంటుగా వెళ్లి "ప్రసాద్" అంకుల్ ని గట్టిగ తన్నాలి అనిపించింది.

"అది పోతే పోయిందిలే, ఇప్పుడే క్రిష్ణ బావ ఇంకో సంబంధం తెచ్చాడు. అమ్మాయి హైదరాబాద్ లోనే job చేస్తుంది. వాళ్ళ ఫాదర్ ప్రొఫెసర్. ఈ అమ్మాయి చూడడానికి బాగుందిరా, అఖిల కంటే కూడా చాలా అందంగా ఉంది, బాగా చదువుకుంది కూడాను. మిగితా విషయాలు నీకు తర్వాత చెప్తాలే. హెల్త్ కాపాడుకో ..ఉంటాను, Bye"......అని నాన్న ఫోన్ కట్ చేసాడు.

నన్ను checkup చేసి తిరిగి వెళ్తున్న Doctor తో
"Doctor.. Doctor ..one minute"
"ఏంటి బాబు?"
"ఎన్ని రోజుల్లో discharge అవుతాను Doctor??"
"ఎందుకు బాబు?"
"ప్లీజ్ త్వరగా కోలుకునేలా చేయరు, నేను అర్జెంటుగా GYM కి వెళ్ళాలి...."
------

Sunday, January 22, 2012

సన్యాసి

అప్పటికి నా వయసు 7 ఏళ్ళే కాని మోయలేని భారం నాపై ఉంది. ఎందుకంటే ఆ రోజే నా రెండవ తరగతి ఫలితాలు విడుదల!!!!!

wow ... గెలిచాను, అనుకున్నది సాదించాను, మళ్లీ సెకండ్ క్లాసులో కూడా నేనే స్కూల్ ఫస్ట్. అవును క్లాసు ఫస్ట్ మాత్రమే కాదు స్కూల్ ఫస్ట్ కూడా, వినటానికి విడ్డూరంగా ఉన్నా అదే వచ్చింది నాకు!! .....మా అమ్మ నాన్న మొహంలో ఆనందం, నా బెస్ట్ ఫ్రెండ్ రాకేశ్ గాడి కళ్ళలో అసూయ ఇంకా నాకు బాగా గుర్తు.

కరతాళ ద్వనులు, అభినందనల మధ్య చీమిడి ముక్కును నా చొక్కాతో తుడుచుకుంటూ stage పైకి ఎక్కి ఈ విజయం నా ఒక్కడిదే కాదంటూ, నాకు ఆకలి వేసినప్పుడల్లా తినడానికి బలపాలు ఇచ్చినందుకు బన్నీకి, కోపం వచ్చినప్పుడల్లా కోరికించుకున్నందుకు బంటి గాడికి, మూడ్ వచినప్పుడల్లా గోలీలాట ఆడినందుకు మధు గడికి, బాధలో ఉన్నప్పుడల్లా నన్ను బేకరీకి తీసుకెల్లినందుకు మా బాబైకి, last but not least exam లో నాకు బాగా cooperate చేసి వాడు evaporate అయినందుకు రాకేశ్ గాడికి నా కృతజ్ఞతలు తెలిపి రుణం తీర్చుకుందాం అనుకునేసారికి నా ఆవేశానికి బ్రేకులు వేస్తూ నాకు Prize ఇచ్చి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్టేజి దిగమన్నారు. నేను century మిస్సై పెవిలియన్ వైపు నడుస్తున్న" ఆశిష్ నెహ్రా " లాగ స్టేజి దిగుతుండగా నన్ను చూపిస్తూ మా ప్రిన్సిపాల్ " అటు చూడండి, రాబోయే కాలం కాబోయే కలాంని చుడండి .... ఈనాటి ఈ చిరుతడే రేపటి మగధీరుడు" అని అందరిచేత చప్పట్లు కొట్టించాడు.
"వోరై కలాం అంటే ఎవరురా? మొన్న 10th క్లాసు లో అందరికంటే ఎక్కువ మార్కలు తెచుకున్నాడు చూడు అతనా?" అని అడిగాడు పక్కనే కూర్చున్న మధు గాడు..."కాదురా, విక్టరీ talkies ముందున్న పెద్ద bungalow లోనికి రోజు కార్లో వస్తాడు చూడు తను" అని నేను నమ్మింది చాలా నమ్మకంగా చెప్పేసరికి వాడు నమ్మేసాడు. అప్పటికింకా మా ఇద్దరికీ వాడు ఆ కార్ డ్రైవర్ అని తెలియదు!!! ( "కాపీలు కొడితే మార్కులు వస్తాయి కాని జ్ఞ్యానం ఎందుకు వస్తుంది??" వెనకనుండి ఎవడో)
సుమారు రెండు సంవత్సరాల వరకు చుట్టూ ఉన్న నా స్నేహితుల సహకారం, ప్రోద్బలం వలన చదువులో నా అధిపత్యం అలాగే కొనసాగింది. అందరికంటే పైన ఉండాలంటే మనం ఎదగాలి లేదా మన తోటి వారిని కిందికి తొక్కాలి. రెండోది నాకు venilla తో పెట్టిన విద్య. అలా కొద్ది కాలం లోనే నేను ranker గా పేరు తెచ్చుకొని class leader గా ఎదిగాను. ఇక అక్కడినుండి నేను వెనిక్కి తిరిగిచుడాల్సిన అవసరం రాలేదు. నేను ఆడిందే ఆట పాడిందే పాట.
ఇలా నడుస్తున్న నా జీవన గమనం లోనికి మా చిన్న తాతయ్య ఒకరోజు ఎంటర్ అయ్యాడు. ఆ రోజుల్లో తను పెద్ద పెద్ద చదువులు చదివి కాలేజీ లో ప్రిన్సిపాల్ గా పని చేస్తుండే వాడు. తను రాగానే asusual గా మా అమ్మ నా ప్రతిభ పాటవాల గురించి ఖచేరి చేస్తుండంగా సీన్ లోనికి నేను ఎంటర్ అయ్యాను. నన్ను చూసి "పెద్దయ్యాక నువ్వేం అవుదాం అనుకుంటున్నవురా" అని అడిగాడు తాతయ్య. నేను వెంటనే "collector" అవుదాం అనుకుంటున్నా అని తడుముకోకుండా చెప్పేసరికి తను శభాష్!! అని నా భుజాన్ని తట్టి వీడిని చూస్తుంటే తప్పకుండా వీడు కలెక్టర్ అవుతాడు అని మా అమ్మతో అనేసాడు. అనడమే ఆలస్యం మా అమ్మ మొహం 1000 watts బుల్బులు ఒకేసారి 1000 వెలిగించినంత ప్రకాశవంతగా మెరువ సాగింది. నన్ను దెగ్గరకి తీసుకొని నా నొసటి మీద ముద్దు పెట్టింది. ఇక అంతే, ఆ రోజు నుండి నా జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది. అమ్మ కళ్ళలో ఆనందాన్ని శాశ్వతం చేయాలనీ, నేను ఖచ్చితంగా కలెక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. అవును, చెప్పులు కుట్టేవాడికి baata షోరూం పెట్టాలని, కిరాణా కొట్టు వాడికి commerical కాంప్లెక్స్ కట్టాలనే ఆశయం ఎంత సహజమో , నా లాంటి మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన మిడిల్ క్లాసు topperకి ఎప్పుడో ఒకప్పుడు కలెక్టర్ అవ్వాలనే ఆశ కలగడం అంతే సహజం.
కలెక్టర్ అవ్వాలంటే General knowledge బాగా రావాలి, అందుకని రోజు పేపర్ చదవడం ప్రారంభించాను. కాని పాడు పేపర్లలలో సినిమా కథలు, పిట్ట కథలు తప్ప వేరే articles నన్ను attract చేయలేక పోయాయి. దానితో పేపర్ చదవడం బోర్ కొట్టేసి టీవీ చూసి లోకాన్ని తెలుసు కోవాలి అనుకున్నాను. "TV పెట్టె వరకే మనకు అధికారం కలుదు కానీ దాన్ని కట్టే అధికారం మనకు లేదు" అనే జీవిత సత్యం నాకు ఇంకా తెలియదు!! ... కలెక్టర్ కలని కొంచం వాయిదా వేసి మోగ్లీ, జంగ్లీ లాంటి serials తో కాలక్షేపం చేయడం ప్రారంబించాను.

వాల్మీకి రామాయణం, రామానంద్ సాగర్ మహా భారతం ఒక ఊపు ఉపెస్తున్న సమయంలో నేను వాటికీ ఆకర్షితుడిని అయ్యాను. అదే సమయంలో భక్త ప్రహలద, అది శంకరా చార్య మరియు షిరిడి సాయి బాబా మహత్యం సినిమాలు బ్యాక్ to బ్యాక్ చూడడం వల్లనో ఏమో వాటి ప్రభావం నాపై చాల పడింది. కరడు కట్ట్టిన నా రాతి గుండెల్లో కరుణను నింపాయి. నాలోని ఆధ్యాత్మిక భావాల అలలను కధం తట్టి నిద్దుర లేపాయి. నేను ఒక పెద్ద "సన్యాసి" కావాలని అప్పుడే fix అయ్యాను. సన్యాసి కావాలంటే ముందు ఈ ప్రపంచం వదిలి దూరంగా ఎటైనా పారిపోవాలి. కానీ అంత చిన్న వయసులో నాకు అది సాద్యం అయ్యే పనేనా అనే బయం కలిగింది. కానీ నా ధైర్యం ఎప్పుడూ బయం కంటే చాలా బలమైనది!!! వెళ్ళాలని నాతో కచ్చితంగా చెప్పింది. "కాని ఆగు... మరి అమ్మకి నువ్వు ఇచ్చిన మాట సంగతి ఏంటి?" అని అడిగింది నా అంతరాత్మ. జవాబు కోసం నాలో మదనం మొదలైంది. నా మనసు ఎక్కువ సేపు చిరాకుగా ఉండ లేదు అనుకుంట, 4వ తరగతి చదువుతూ, బటానీలు తింటూ బడికి ఎలా డుమ్మా కొట్టాల అని ఆలోచిస్తున్న మా అన్నయ వైపుకు నా దృష్టిని మళ్ళించింది. టక్కున ఆలోచన వచ్చింది, అన్నయను collector చేసి నేను సన్యాసి అయిపోవచ్చు కదా అని. కాని నేను collector నుండి తప్పుకోవాలంటే ముందు వాడు ఒప్పుకోవాలి. వాడిని ఒప్పించడం ఎలా???

ఓ రోజు సాయంత్రం అయిదింటికి ఆసక్తిగా "పాడి పంట - పశువల పెంపకం" program చూస్తున్న వాడి దెగ్గరికి వెళ్లి ....
"అన్నయ, నేను సన్యాసి అవ్వాలనుకుంటున్నరా "...
"కోత్తగా అవ్వడమేంటిరా? అందరు నిన్ను అదే అంటుంటారు కదా" అన్నాడు అమాయకంగా ...
తెలిసి అన్నాడా తెలియక అన్నాడా అని నాకు తెలియక పోవడం వల్లనా నేను పేద్దగా పట్టించుకోక..వాడి జుట్టు పట్టుకోలేదు.
"ఆ సన్యాసి కాదు, తపస్సు చేసి నేను నిజంగానే పెద్ద సన్యాసిని అవుతా..కాని నాకు నీ help కావాలి. అమ్మకు నేను collector అవుతా అని మాటిచ్చాను, కాని ఈనా జన్మలో నేను అది నేర్వేర్చలేను. ఆ మాటను నువ్వు నిలబెట్టాలి, collector అవ్వాలి" అన్నాను.
"collector అవ్వాలి అంటే ఏం తినాలి తమ్ముడు?" అని కళ్ళు మిటికరిస్తూ అడిగాడు నన్ను.
(ఆ రోజుల్లో "boost is the secret of my energy" అనే ad వాళ్ళ కాబోలు ఆ అజ్ఞ్యానం)
"చదవాలి, తినడం కాదు చేయాల్సింది, Collector అయితే ఏదైనా ఆడొచ్చు, ఎవడినైన కొట్టొచ్చు...అడిగే వాడు ఉండడు".
వాడు చాలా sincere గా నేను చెప్పేది ఆలకించడం చూసి ...వాడిని ఎలా అయిన motivate చేయాలనీ చెప్పి.
"అసలు ఆఫీసుకి డుమ్మా కొట్టిన సెలవు పెట్టిన పట్టించుకోడానికి sirlu madamlu ఎవరు ఉండరంట. మనమే అందరికంటే పెద్దనంట." అని వాడితో నేను అన్నాను.
"నువ్వు చెప్పేది వింటుంటే నాకు collector అవ్వాలనే ఉంది తమ్ముడు. కాని నేను అవ్వలేను" అన్నాడు.
"ఏ ..ఏ ...ఏ ..ఎందుకని?" అని నిరాశతో నేను వాడిని గట్టిగ అడిగాను.
"ఏ అంటే ఎం చెప్పనురా?? నాకు నీలానే చిన్నప్పటి నుండి ఒక ఆశయం ఉంది. నేను బాగా చదివి పెద్దయాక veterinary doctor కావాలని కలలు కంటున్నా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంబలు, ఆవులు అంటే ఎంత ఇష్టమో నీకు తెలసు కదా. పిట్టలన్న, పావురాళ్ళు అన్న ఎంత ప్రాణమో నీకు తెలియదా!...మన వీది కుక్కలకు పెద్ద దిక్కు అయిన నన్ను veterinary doctor కాకుండా collector అవ్వమంటే ఎలా? వాటి..." అని వాడు అంటుండగానే టీవీలో
"ఈ వరం పాడి పంట ఇంతటితో సమాప్తం, తిరిగి వచ్చే వరం ఇదే సమయానికి మళ్లీ కలుద్దాం, సెలవు".
-------

తన పేరు స్వప్న

ప్రేమ అంటే ఏంటో తెలియకున్నా దాన్ని పొందాలని పరితపించే రోజులవ్వి. కానీ ప్రేమని పొందాలంటే ప్రేయసి కావాలి కదా, అందుకే తన కోసం ఘాడంగా అన్వేషిస్తున్న రోజుల్లో నాకు ఎదురైనా యదార్థ సంగటనే ఈ కథకి స్ఫూర్తి.

ఆ రోజు ఉదయానే 8:30 కి లేచి చక చక స్నానం, భోజనం 3 hours lo చేసేసి office కి వెళ్ళాను. ఎప్పటిలాగే త్వరత్వరగా ఈనాడు, సాక్షి, జ్యోతి పేపర్లు చదివేసి అలసిపోయాను అనిపించగానే colleagues తో కలిసి టీ కోసం cafeteria కి వెళ్ళాను. నా కళ్ళు ఎప్పుడూ కన్నెల అందాల్ని బంధించడానికి కదులుతూ ఉంటాయి కాని cafeteria లో మాత్రం అవ్వి పరుగులు పెడతాయి.....ఎందుకంటే అన్ని అందాల్ని అందుకోవద్దు మరీ?

తన పేరు స్వప్న, మా ఆఫీసు లోనే పని చేస్తుంది. టీ కోసం కాబోలు వచ్చి నా చూపులకి చిక్కింది. నేను చాలా మంది అమ్మాయలని చూసాను కానీ అంతటి తేజస్సు ఏనాడూ ఎవరి మొహంలోను చూడలేదు. నేను తన అందమైన కళ్ళని, అంతకంటే అందమైన తన పెదాలని, మల్లె పువ్వు లాంటి ఆ చిరునవ్వుని, చూపును చుట్టేసి మనసుని కట్టేసే తన నల్లని కురులను చూస్తూ ఉండిపోయాను. నాకు తెలివి వచ్చే లోపే తను అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక మాస్టరు చూసింది చాల్లే వెళ్దామా అనట్టు చూసారు మా colleagues. I know its "jealousy" అనుకున్నాను నేను !!!

అల కొద్ది రోజుల్లో నా చూపులకి తన చూపులు బదలు పలకడం ప్రారంబించాయి. తన అందం కోసం నా కళ్ళు గాలిస్తే నా చూపుల కోసం తను ఎదురు చూసేది. ఈ చూపుల పరిచేయాన్ని మాటల పరిచేయంగా మలచాలని తీవ్రంగా ప్రయత్నించాను. అలంటి ప్రయత్నంలోని భాగంగానే ఒక్క బలీయమైన సమయంలో తనకి facebook లో రిక్వెస్ట్ పెట్టాను.
పెట్టేవరకు cool గానే ఉన్నాను పెట్టినతర్వతే నా temperature 104 డిగ్రీలకు చేరింది. కాని అంతలోనే ఉపశమనం, తను నా రిక్వెస్ట్ని అంతే వేగంగా accept చేసింది. ఇక నా ఆనందానికి హద్దులు లేవు, ఉత్సాహానికి కొలతలేవు.
అప్పుడే మొదలైంది మా ఇరువురి మధ్య చాటింగ్.......
నేను - హాయ్ స్వప్న, నా ఫ్రెండ్ రిక్వెస్ట్ accept చేసినందుకు థాంక్స్ ....
స్వప్న - హాయ్ !! మీది హైదరాబాదా?
నేను - అవును, కాని మీ native place హైదరాబాద్ కాదు అనుకుంట...
స్వప్న - ఏ, ఎందుకల అనుకుంటున్నావ్?
నేను - హైదరాబాద్ అమ్మాయిలు ఇంత అందంగా ఉండరు !!!
u look very cute...... (భయం ఎం అనుకుంటుందో అని)
స్వప్న - hahaha...thank you!!!...కాని మాది హైదరాబాదే
నేను - అవునా ?? (గర్వంతో కూడిన ఆనందం ఏం అనలేదని -
నిజం చెప్పాలంటే internet పుణ్యమా అని అప్పటికే తన ఊరు మాత్రమే కాదు తనకు ssc లో ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా నాకు తెలుసు .... కానీ ఎందుకో నాకు నిజం కంటే అబద్దమే తీయగా అనిపించింది ఆ క్షణం)
నువ్వు ఈరోజు వేసుకుంది చుడిదార్ కదా....నీకు చుడిదార్ చాల బాగుంటుంది..
(నా ఉద్దేశం jeans/Tshirts పెద్దగ suite అవ్వవు అని ..కానీ ఈ లోకంలో  లౌక్యం చాల ముఖ్యం.
అమ్మాయిల విషయం లో అయితే మరీను)
.....
స్వప్న -  పొగడ్తలు ఇక చాలు బాబు..అసలే ఈమధ్య లావు అవ్వుతుంటే !
నేను - ఏం చేస్తాం చెప్పు... ఫాన్స్ ఉంటె ఇలాంటి problems తప్పవు.. over చేస్తారు ..కానీ నువ్వే lite ga తీసుకోవాలి :)
స్వప్న - hahaha lol, u naughty :)
నేను - బుక్స్, నొవెల్స్ వంటివి చదువుతావ?
స్వప్న - oh yes, ఎందుకు చదవను ..నాకు fiction నొవెల్స్ అంటే చాల ఇష్టం ...shakesphere, agatha, sheldon నొవెల్స్ అంటే చాల ఇష్టం ..ఇంకా
నేను - (దూల కాకపోతే ఎగ్జామ్స్ అప్పుడు "all in one" కూడా సరిగ్గా చదివి ఏడ్చి ఉండను ...అలాంటిది బుక్స్ topics నాకు అవసరమా అనుకోని) ------ oh ok, its great !!! సినిమాలు చూస్తుంటావా?
స్వప్న - ఒకప్పుడు చుసేదానినే కాని ఇప్పుడు కుదరడం లేదు ..అసలు టైం ఉండట్లేదు ...
నేను - రెట్టించిన ఉత్సాహంతో ..... మనం ఈరోజు ఈవెనింగ్ కాఫీడేకి కలిసి వెళ్దామా ???
స్వప్న - నాకు వీలు కాదు ...!!
నేను - ఏ?? ... పోనిలే ఈరోజు కాకుంటే రేపు...రేపు ఈస్ బెటర్, ok na?
స్వప్న - hmm, వచ్చేధాన్నే కానీ నేను రేపు కూడా busy
నేను - ఎప్పుడూ busy అంటావ్ ఏంటి ??? అంత బిజీనా నువ్వు?
స్వప్న - haha... అవును 1 year old కూతురు ఉంటె నీకు తెలిసేది...

పిట్ట కథలు

April 24వ తేది, ఆదివారం ఉదయం 11 గంటలు, పని పాటా లేని నాకు ఏదైనా పనికొచ్చే పని చెయ్యాలి అనిపించి హెయిర్ కట్ చేయించుకోడానికి షాప్కి వెళ్ళాను. అక్కడున్న 'Q' కంటే వైకుంఠ ఏకాదశి రోజు తిరుపతిలో కట్టే 'Q' చాలా చిన్నది అనిపించింది. ఎలాగూ వచ్చాం కదా మంగలి వాడిని దర్శించుకొని వెళ్దాం అని లోన అడుగెట్ట . అక్కడ విసిరి ఉన్న రంగురంగుల పేపర్లను తీసి అందులో చిన్నచిన్న దుస్తులు ధరించిన హీరోయిన్ల బొమ్మలను ఆసక్తిగ చూస్తుండగా... ఆ ఆసక్తికి ఆటంకం కల్గిస్తూ ఇద్దరు తోటి వెదవలు గట్టిగా ఇలా మాట్లాడుకుంటున్నారు ...

A "అరై , సాయి బాబా దేవుడు చనిపోయాడు అంటరా!!!"
B "దేవుడా?? దేవుడైతే ఎందుకు చస్తాడు రా?"

A "ముయ్యి రా.... రాముడు, కృష్ణుడు చనిపొలేదా?? వాళ్ళు దేవుళ్ళు కాదా?"
B "ఏదో వాళ్ళ దినాలకు నిన్ను పిలిచినట్టు మాట్లాడుతున్నావ్ !!! .... నీకేం తెలుసు రా వాళ్ళు ఎప్పుడు పుట్టారో, ఎక్కడ చచ్చారో ??....అది ఉట్టి నమ్మకం, ఇది పచ్చి నిజం రా!! "

A "నీ మొహం రా, నీకు పొగరు, అందుకే ఎవరిని నమ్మవు..లేకుంటే గొప్ప గొప్ప వాళ్ళంతా.. ప్రధానితో సహా.. ఊరికే తన కాళ్ళు మొక్కి ప్రార్థిస్తార?"
B "40 వేళ్ళ కోట్ల ఆస్తి ఉంటె నాయకులు కాళ్ళు మొక్కడం ఏం కర్మ కంఠం కూడా కోసుకుంటారు. ఇక మిగిలిన వాళ్ళు వాళ్ళ గొప్పల గోపురాలు ఎక్కడ కూలిపోతాయో అనే బయంలో ఇలాంటి కాకమ్మ కథలు అన్ని నమ్ముతారు"

A "ఛీ, నువ్వు చస్తే మారవురా"
B "నీలాంటి వాళ్ళు చచ్చే వరకు ఇలాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారురా"

అలా వారిద్దరి మాటలు కాస్త తూటాలై ఒకరిని ఒకరు తిట్టుకోవడం మొదలెట్టారు. అది అంత interesting గా లేదని పక్కనే ఎవడో tv పెడితే దాని మీద concentrate చేశా, దాంట్లో "సూర్యుడే సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలె నిలిచిపోయేనా" అనే సాంగ్ సత్య సాయికి dedicate చేస్తూ వేస్తున్నారు. "మంది ఎక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు" ఒకే సాంగ్ ని అర dozen మందికి dedicate చేసి వాళ్ళ పరువు తీస్తున్నారు అనిపించింది నాకు.
ఆ పాట వింటూ టీవీ చూస్తూ మెల్లిగా దాంట్లో లీనమైపోయి ఉండగా సుమారు రెండు యుగాల, కాదు కాదు కల్పాల తర్వాత, సీటు ఖాలీ అవ్వగానే బార్బరుడు "ఇక వచ్చి గొరిగించుకో" అన్నట్టుగా నా వైపు ఒక చూపు చూసాడు. అంతే, నేను 3G ad లో "zoozoo" లాగ పరుగెత్తుకెళ్ళి వాడి ముందున్న కుర్చీలో కూర్చున్న. వాడు నాతో సార్ జుట్టు ఎలా కత్తిరించమంటారు medium ha short ha అని అడిగాడు. నేను రెండు కాదు మొదలు straight చెయ్యి అన్నాను - చిన్నప్పటినుండి నా జీవిత ఆశయం ఒక్కటే, నాది curly హెయిర్ దానిని straight చేయించాలని - అది విని వాడు మొహం అదేదో అందరు అంటునట్టుగా పెట్టి వెంటనే "Sir, పత్తి పొలంలో పత్తే పండుతుంది కాని pineapple పండుతుందా?? అలాగే మీ హెయిర్ కూడా చచ్చిన straight కాదు ...విత్తనాల దగ్గట్టుగా....." అని ఏదో class చెప్పడం ప్రారంబించాడు. నేను వెంటనే "ఇక ఆపు నీ పాడి పంట program, నీ ఇష్టం వచ్చినట్టు గొరుగు" అని గంభీరంగా వాడిపై అరిచి దుఖాన్ని గొంతులోనే దిగమింగి, దిగులుగా మనుసులో మారుతున్న ప్రపంచంలో మనుషులకు వెటకారంపై ఉన్న మమకారం గురించి ఆలోచించసాగాను. ఇంతలో వాడు నాకేదో ఉపకారం చేసే వాడిలా "అయిన ఎవరైనా ఆశయం అంటే ఏ అక్బరో, ఔరంగజేబో లేకుంటే 2G రాజానో అవ్వాలని కోరుకుంటారు కాని మీదేంటి సార్ తొక్కలో ఆశయం" అని అన్నాడు. ఇన్ని అవమానాలు పడి, పైగా నాకెదురుగా అన్ని కత్తులు ఉండి కూడా వాడిని పొడవకుండా ఉన్నానంటే దానికి కారణం నా తలా, పీక వాడికి తాకట్టు పెట్టినందుకే. లేకుంటే సత్య సాయి బాబాది, వాడిది వర్ధంతి ఒకే రోజు ఉండేది.