Sunday, April 13, 2014

అశాంత్

"చలో మానస.. ఉంటాను .. బై... ఈ వీకెండ్ నువ్వు ఫ్రీనా....ఓ సారి కుదిరితే కలుద్దాం"
"హ్మ్మ్ ...వెరీ  సారీ ... నాకు ఈ వీకెండ్ అసలు టైం లేదు..రేపు మార్నింగ్ డాన్సు క్లాసు ఉంది. 
మధ్యానం ఫ్రెండ్స్ అందరితో మూవీకి వెళ్ళాలి, ఈవెనింగ్ ఆంటీ వాళ్ళింట్లో డిన్నర్ కి పేరెంట్స్ తో కలిసి అటెండ్ అవ్వాలి. సండే మా కజిన్  క్లోజ్ ఫ్రెండ్ మ్యారేజ్ కి హైదరాబాద్ వెళ్ళాలి. నువ్వు నీ ప్లాన్ ని చేంజ్ చేసుకోకు. తర్వాత కలుద్దాం, బై ది వే, నీ వీకెండ్ ప్లాన్ ఏంటి?"
" నాకు పెద్దగా ప్లాన్ ఏమి లేదు, ఖాలినే, అప్పట్టికి అప్పుడూ ఆ టైంకి ఏది తోచితే అది చే ... "
"అదేంటి, ఖాలిగా ఎలా ఉండగలరసలు? నాకైతే పిచ్చి ఎక్కుతుంది. అయినా ఏ  ప్లాన్ లేకుండా అలా ఉంటె లైఫ్ బోర్ కొట్టదూ?"
"ఇలా ఫ్రెండ్స్ అందరూ బిజీ అయిపోతే ఖాళి సమయంతో కాలక్షేపం కాకుండా ఎం చేయగలను చెప్పు"
"ఓవర్ చేయకు, మనం నెక్స్ట్ వీకెండ్ తప్పకుండ కలుద్దాం" అని తను ఫోన్ పెట్టేసింది. 

ప్లానా పాలకూర పప్పా...ఖాళిగా ఉండడం చేతకాకే ఈ డాన్సులు, డిన్నర్లు, ప్లానింగులు, కాకరకాయలు. దీని పిచ్చితనం కాకపోతే అన్నీ ప్లాన్ చేసుకుంటూ, Q కట్టి వెళ్ళడానికి ఈ బ్రతుకేమైన రజినీకాంత్ "రోబో" సినిమానా? అనుకుని ఆవేశాన్ని అణచుకొని ఆఫీసులో ఏమీ తోచక  ఏమి చేయాలో పాలుపోక చివరికి "అత్తారింటికి దారేది" సినిమాని ప్లే చేసి చూస్తున్నాను. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ ని చూసినప్పుడల్లా - పాపం తనకు ఏ అత్తారింటికీ దారి తెలియక లోక కళ్యాణం కోసం చివరికి తన కల్యాణాన్ని సహితం కాదు అనుకోని ఆవేశంగా రాజకీయం అనే సూర్య కాంతాన్ని కట్టుకోవడం - అనే చేదు నిజం గుర్తొచ్చి ఆ దుస్సాహాసాన్ని జీర్ణించుకోలేక సినిమాని చూడలేక ఇబ్బంది పడుతుండగా

"హే నిశాంత్, మీట్ మిస్టర్ అశాంత్, నిన్నే మన టీంలో కొత్తగా జాయిన్ అయ్యాడు"  అంటూ ఆ అశాంత్ గాడిని నాకు పరిచెయం చేసాడు మా మేనేజర్.  
"హలో .. దిస్ ఇస్ అశాంత్"
"హలో ... దిస్ ఇస్ నిశాంత్"
"ఐఐటి బెంగుళూరులో చదివాడు..ఇంతకు ముందు మిరకిల్లో, ఒజోమెన్లో  పని చేసాడు. చాలా టాలెంటెడ్ ఫెల్లో, జెమ్ అఫ్ ఎ మ్యాన్!!". 
అదేంటో! ఈ మేనేజర్ గాడికి నేను తప్పితే ఈ ప్రపంచంలో అందరూ ఇంటెలిజెంట్ గానే కనిపిస్తారు. వీడు వీడి ఆత్రం తగలెయ్యా అని నా మనసులో మా మేనేజర్ని తిట్టుకోని బయటకి నవ్వుతూ 
"అవునా!  గ్రేట్ " అన్నాను.
ఒక సారి  ఆ అశాంత్ గాడిని పై నుండి కింది వరకు పరీక్షగా చూసాను. వాడిని చూస్తుంటే ఉత్త పోరంబోకులా ఉన్నాడే కాని ఏ కోణానా  ప్రోగ్రామర్ లా కనిపించట్లేదు. అయినా వాడిని అని ఎం లాబం? ఐఐటి అంటే చాలు ...అంట్లుతోమే వాడిని కూడా ఆర్కిటెక్టు చేస్తారు ఈ తిక్క సన్నాసులు. 

"తనకు పాత కంపెనీలో క్రియేటివ్  వర్క్ దొరకట్లేదు అని, మన కంపెనీ లో ఏదైనా మంచి ప్రోడక్ట్ బిల్డ్ చేయాలని మన టీంలో జాయిన్ అయ్యాడు. నువ్వు తనని గైడ్ చెయ్యి. కావలసినవి ఏవైనా ఉంటె తనకి హెల్ప్ చెయ్యి" 
"ఓ .. ఈస్ ఇట్ ... థెన్ మన టీం బెస్ట్ ప్లేస్.. ఐ విల్  గైడ్ హిం"
"యాయా..గుడ్" అని ఆ సన్నాసిని నాకు అప్పచెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మా మేనేజర్ సన్నాసి. 

క్రియేటివ్ వర్కా తోట కూర కట్టా! అక్కడినుండి తరిమేస్తే ఇక్కడికి వచ్చివుంటాడు వెదవ. అయినా బిల్డ్ చేసే వాడెవడూ ఇలా గంటకో బిల్డింగు మారడు అనుకుంటూ మరొకసారి వాడిని కింది నుండి పై వరకు పరీక్షగా మళ్లి  చూసాను.  ఎంత కన్విన్సు అవ్వాలని ట్రై చేసిన నా మనసు వాడు వెదవే అన్ని ఫిక్స్ అయ్యి కూర్చుంది తప్పితే  అస్సలు కన్విన్సు అవ్వనంటుంది. ఎలా అని నేను ఆలోచిస్తుండగా -

"హ . నిశాంత్ మీదే స్టేట్? ఎక్కడునుండి?" అని అడిగాడు వాడు. 
"అంధ్ర ..ఆగాగు... తెలంగాణా, కాదు కాదు ఆంధ్రే, లేదు లేదు తెలంగాణే ... హే ఏదో ఒకటహా.....హైదరాబాద్ నుండి"
"హైదరాబాదా... నేను అక్కడినుండే" అని  వాడి ఆమ్లెట్ మొహంపై నవ్వుని ఉల్లిపాయళ్ళ జల్లుతూ షేక్ హ్యాండ్ కోసం చెయ్యి చాచాడు. 
పోనిలే, చూడానికి వెదవలా ఉన్నా మన ఊరి వేదవే, మన వాడే అన్నమాట... అనుకోని ... ప్రాంతీయతత్త్వాన్ని అడ్డం పెట్టుకొని వాడితో చెయ్యి కలిపాను. ఈ లోకంలో పైగా ఇలాంటి వెదవలందరితో కలిసి బ్రతకాలంటే ప్రతి వాడికి ఇలా ఏదో ఒక పిచ్చి ఉండాలి - కులం పిచ్చో, మతం పిచ్చో, ప్రాంతం పిచ్చో, సినిమా పిచ్చో - లేకుంటే మనకు పిచ్చెక్కిపోదూ!

ప్రక్కన వీడి లాగే టీంలో కొత్తగా జాయిన్ అయిన జనత అందరు కలిసి గట్టిగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారో స్పష్టంగా వినిపించట్లేదు కాని ఈ పదాలు మాత్రం అక్కడక్కడ దొర్లుతున్నాయి

"స్టాన్ఫోర్డ్, యు సి బెర్క్లీ, పి ఎచ్ డి, రీసెర్చ్, స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్, గూగుల్, ఫేస్ బుక్,
హడూప్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, బిలియన్ డాలర్, యూరోప్, ఆస్ట్రేలియా, గ్రీన్ కార్డు, ఎచ్ 1 బి........ "

అందులో నుండి ఒకడు అశాంత్ గాడిని గుర్తుపట్టి మా వైపు పరిగెత్తుకుని వచ్చాడు. ఆ వెదవ, ఈ వెదవ ఒకే కాలేజీ, క్లాసు మేట్స్. కాకపోతే వాడు టాపరు, ఈ అశాంత్ గాడు లొఫరు, అంతే తేడా. లోఫర్ అనే అర్థం తెలియని వాళ్ళు గూగుల్ లో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడి చేసాను. ఇక్కడ దానర్థం సోమరి అని, పెద్దగా బుర్ర వాడని వెదవ అని, దాని వళ్ళ పండుకి కాయకి కూడ తేడా తెలియని అమాయకుడని.  అశాంత్ నాకు వాడి ఫ్రెండ్ని పరిచేయం చేసి మళ్లీ వస్తానని అక్కడినుండి వెళ్ళిపోయాడు. నేను అశాంత్ ఫ్రెండ్ కాంటీన్ వైపు నడుస్తూ ఉండగా కుతూహలంతో తనని అడిగాను -

"ఏం బాస్, ఎం మాట్లాడుకుంటున్నారు అందరూ?"
"ఏముంది బాస్, యుఎస్ కి ఎలా వెళ్ళాలని అందరు డిస్కస్ చేస్తున్నారు"
"జాయిన్ అయ్యి రెండు రోజులు కూడా కాలేదు, అప్పుడే యుఎస్ కి వెళ్ళాలని డిసైడ్ అయ్యారా?"
"యుఎస్ కి వెళ్ళాలని ఎప్పుడో డిసైడ్ అయ్యాము, కాని ఈ జాబులో జాయిన్ అయింది మాత్రం నిన్నే. నువ్వే చెప్పు బాస్, ఇన్ని రోజులు ఎవడైనా రాత్రనక పగలనక నానా కష్టాలు పడింది దేనికి? - ఓ చిన్న విల్లా, అందులో ఐశ్వర్య లాంటి పిల్ల - వీటి కోసమే కదా! ఈ బెంగుళూరులో ఇలాగే నేను ఇంకో వెయ్యి సంవత్సరాలు పని చేసినా భవంతి కాదు కదా కనీసం బాత్రూం కూడా కట్టించలేను. అందుకే యుఎస్ కి వెళ్ళి అక్కడ సంపాదించి ఇక్కడ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే, నాకు ఆనందం మన దేశానికి ఆదాయం రెండూ వస్తాయి. అయినా ఈ రోజుల్లో మనిషన్నాకా దేనికో ఓ దానికి అటాచ్ అవ్వాలి బాస్, లేకుంటే జీవితమే డిటాచ్ అయిపోతుంది. లైఫ్ లో త్రిల్ ఉండలాంటి ఇలాంటి "విల్" ఎట్లీస్ట్ ఒకటైన ఉండాలి. నీకు ఇలాంటి ఆశయాలు ఏమి లేవా బాస్?"
"ఎందుకు లేదు. నాకు ఒక ఆశయం ఉంది".
"ఏంటది?"
"నీ లాంటి మామకి అల్లుడవ్వాలని"
అది విని తను బళ్ళుమని నవ్వి "గుడ్ వన్ బాస్. అల్ ది బెస్ట్" అన్నాడు.
కాంటీన్ వచేసింది. తనకు దాహం వేస్తుంది అన్నాడు.
"కోక్ తాగండి దాహాన్ని తీర్చండి. యుఎస్ కి వెళ్తే అక్కడ ఎలాగూ ఇదే తాగాలిగా" అన్నాను నవ్వుతు తనతో
"కోక్ హెల్త్ కు మంచిది కాదు బాస్. దాంట్లో ఆసిడ్స్, యాడెడ్ షుగర్స్, అది తాగడం కంటే ఒక పెగ్గు విస్కీ తాగడం మేలేమో".
"ఓహ్ హో, అలా అయితే నీళ్లు తాగు"
"అబ్బే, టేస్ట్ లెస్, నీళ్లెం తాగుతాం బాస్".
"మరి ఎం కావలి నీకు?"
"ఫ్రూట్ జ్యూస్"
ఫ్రూట్ జ్యూస్ కి కొంచెం టైం పడుతుంది అన్నాడు ఆ కౌంటర్ వాడు.
ఇంతలో తనకు మీటింగ్ ఉన్న విషయం గుర్తొచ్చి, అంత టైం లేదని, దాహం తీరకుండానే అక్కడినుండు వెళ్లి పోయాడు వాళ్ళ ఫ్రెండ్.

అలా ఓ రెండు నెలలు గడిచాయి, ఆశాంత్ నేను బాగానే క్లోజ్ అయ్యాము. వాడి తిక్క పనులు, తింగరి వేషాలు నాకు అప్పుడప్పుడు కోపం తెప్పించిన వాడి అమాయకత్వం ఆ కోపాన్ని కూల్ చేసిది. ఇలా ఉండగా ఓ రోజు వాడు ఒక అమ్మాయని గాడంగా ప్రేమించాడని, ఆ అమ్మాయికి వాడి ప్రేమ విషయం మెసేజ్ రూపంలో ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడని నాతో చెప్పాడు.

"ఎవరురా ఆ అమ్మాయి?" అని అడిగాను.
"అదిగో ఆ అమ్మాయికే నేను మెసేజ్ పెట్టింది" అన్నాడు. 
"ఏది? ఆ డియోనా పక్కన కూర్చుందే, నల్ల డ్రెస్సు వేసుకుని పెదవులకు లిప్స్టిక్ రాసుకుంటుందే ఆ అమ్మాయికా?"
"కాదు.. "
"మరి, బ్లు టిషర్టు వేసుకొని స్నాప్ డీల్ లో హాట్ హాట్ డీల్స్ కోసం ఆవేశంగా వెతుకుతుందే ఆ పిల్లా?"
"ప్చ్ ... తనూ కాదు"
"హ్మ్మ్ ... మరి ఆ రెడ్ కలర్ స్కర్ట్ వేసుకొని, ఈ లోకాన్ని మరచి ఆ ఐఫోన్లో మునిగి మెస్సేజుల మీద మెస్సేజులు పంపుతుందే ఆ పాపా?" 
"కాదు కాదు ... నువ్వు ముందు  చూపించిన అమ్మాయికే"
"ఏంటి? నువ్వు కొంప తీసి డియోనకు కాని మెయిల్ పెట్టావా ఏంటి?"
కొంచెం గర్వంతో కూడిన సిగ్గుతో ...  తానే అని తలూపాడు. 
"వారిని దుంప తెగ, దానికి ఎందుకు పెట్టవురా మెసేజు. నీకు ఇంకా ఎవరు దొరకలేదా?" అని గట్టిగ అరిచాను. 
"ఏ? తనకి నువ్వు కూడా మెసేజ్ పెట్టావా ఏంటి?" అన్నాడు అర్థం కాని ఆశ్చర్యంతో. 
"నీ బొందా.. ఆవిడ ఎవరనుకుంటున్నావు? అయిన నీకసలు బుర్రుందా? పెట్టే ముందు నన్ను అడగక్కర్లేదు?"
"ఏ .. మన టీంలో ఎవరు లవ్ లెటర్ రాసినా ముందు నిన్నడగాలనే రూల్ ఏమైనా పెట్టారా?" అని అమయకంగా అడిగాడు.  
"నీ మొహం .. నువ్వు పెట్టింది  అమ్మాయికి  కాదు, డియోన మోసెస్కి. తానే ఈ ఇండియా సెంటర్ మొత్తానికి  డైరెక్టర్. అయినా ... నువ్వేం మనిషివిరా... నీకు అమ్మాయికి ... అమమ్మకు కూడా తేడా తెలియలేదా. తన యేజ్ ఏంటి నీ యేజ్ ఏంటి. నీ కంటే కనీసం పది యేండ్ల అయిన పెద్దది. అసలు తనకు మెస్సేజు పంపాలనే ఆలోచన నీ మట్టి బుర్రకు ఎలా తట్టిందిరా" అన్నాను వాడిపై విరుచుకు పడుతూ. 
"ఏమో! దూరం నుండి ఒకటి రెండు సార్లు చూసాను. ఓ రోజు మార్నింగ్ ఎంట్రన్స్ గేటు దెగ్గర తనను క్లోజ్అప్ లో చూసినప్పుడే నా హార్ట్ ఫ్రేమ్ మొత్తం తన బ్యూటిఫుల్ ఫేస్ తో నిండి పోయింది. నా మనసు తానే నాకు సరైన జోడి అని చెప్పడంతో ఆవేశంలో టెంప్ట్ అయ్యి వెంటనే మెయిల్ చేశాను.  కాని ఇలా అవుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. అయినా సరే, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, ఈ విధి ఎన్ని పరీక్షలు పెట్టినా సరే, నిస్వార్థమైన నా ప్రేమే గెలుస్తుంది" అని దిగులు ఫేస్తో డియోనా వైపు చూస్తూ కుర్చీ మీద కూలపడిపోయాడు. 
"నువ్వు నీ తోక్కోలో మనసు... కొంచెం ఎర్రగా బుర్రగా ఉంటె చాలు .. డైరెక్టర్లకె లవ్ లెటర్స్ రాస్తార్రా? పైగా దానికి ప్రేమ దోమ అనే టైటిల్ తగిలించి ఎవడి ఇష్టం వచ్చిన సినిమా వాడు తీసి అందులో హీరోల్ల ఫీల్ అయిపోవడం... దాన్ని జనాల పై రుద్దడం. ఛా.. మీరు మారర్రా!"
"నీకేం తెలుసు ప్రేమ గురించి. నీ జీవితంలో ఎవరినైనా గాడంగా ప్రేమిస్తే నీకు తెలిసేది. అదొక అందమైన అనుభూతి, దాన్ని అందుకోవడం నీలాంటి అంధుల వల్ల అసాధ్యం. తల్లి గర్బంలో ప్రాణం పుడితే, మనిషి గుండెల్లో ప్రేమ పుడుతుంది. గాయ పడిన వాడికే నొప్పి తెలిసేది, ప్రేమించిన వాడికే దాని లోతు తెలిసేది. నీకు ఈ విషయం ఎప్పటికి తెలియదు."
అబ్బో, వీడు ప్రేమలో పూర్తిగా మునిగిపోయాడు. వీడిని ఈ సముద్రం లోనుండి బయటకి లాగటం చాలా కష్టం. కాని ఆరు నూరైనా...నూరు కోడి కూరైనా సరే .. నేను వీడిని ఈ పెను ప్రమాదం నుండి తప్పించాలి. ఈ ఉప్పెనని ఎలాగైనా ఆపాలి. అదే నా కర్తవ్యం, అదే నా ధర్మం, అదే నా బాధ్యత, అదే నా ..  (హేయ్ .. ఆపవోయ్ ... నువ్వు నీ ఓవర్ యాక్షన్.. కధ కంటిన్యూ చెయ్యి)
"చూడు తమ్ముడు, నీ ప్రేమ నిజమే కావొచ్చు, షాజహాన్ తర్వాత చరిత్రలో నీ పేరే ప్రేమ కి సినానింగా నిలవొచ్చు, కాని డియోనా  నీకంటే పది ఏండ్లు పెద్దది. ఎంత క్యాలికులేట్ చేసిన ఈ లెక్క తేలదు నాన్నా. నా మాట విని నువ్వు తనను మర్చిపో".
"ఎందుకు మర్చిపోవాలి? రాముడి కంటే సీత పెద్దది. కృష్ణుడి కంటే రాధ పెద్దది, టెండూల్కర్ కంటే అంజలి పెద్దది. వాళ్ళు ప్రేమించుకోలేదా? మేము అంతే!"
"ఒరేయ్, ఒరేయ్ ... ఒరేయ్. నా ఓపికకి పరీక్ష పెట్టకురా. రాముడు వేల యేండ్లు బ్రతికాడు, కృష్ణుడు వేల పెండ్లిలు చేసుకున్నాడు, ఇక టెండూల్కర్ వంద సెంచరీలు కొట్టాడు. నీ జీవితంలో వంద లైన్ల కోడ్ కూడా రాస్తావో లేదో నాకు డౌటే. ఎందుకురా యుగ పురుషులతోటి, భారత రత్నాలతోటి నీకు పోటి. మాములుగా  బ్రతకరా, మనుషలతో కలవరా, బాగు పడతావ్."
"నీకు నేనంత చెప్పినా అర్థం అవ్వదు. ప్రేమ గుడ్డిది. దానికి యేజ్ తో పని లేదు".
"ప్రేమ గుడ్డిదైతే  కావొచ్చు కాని డియోనా గుడ్డిది కాదు. తాను ఆ మెసేజ్ చుసిదంటే నీ ఉద్యోగం ఊడటం కాయం.
డైరెక్టర్ కి లవ్ లెటర్ రాసిన కారణంగా నీకు ఇక్కడే కాదు, ప్రపంచం లో ఎక్కడా ఉద్యోగం రాదు. ఓ రకంగా అది నీకే మంచిది, అప్పుడు నీ ఇష్టం, ఎలిజిబెత్ రాణినె ప్రేమిస్తావో, ప్రతిభా పటేల్ కె మెసేజ్ పెడతావో నీ ఛాయస్. నిన్ను అడిగేవాడు ఉండడు".
"తను ఆ మెసేజ్ చూస్తే నా ఉద్యోగం నిజంగానే ఊడుతుంది అంటావా? నాకు బయం వేస్తుంది. మరి ఇప్పుడు ఎలా. హా .. ఐడియా వచ్చింది ... తనకి "టు" అడ్రస్ తప్పని, అది ఆక్చువల్ గా నీకు పంపాల్సిన మెసేజ్ అని ఇంకో మెసేజ్ పెట్టనా? నువ్వు ఇదే ..".
"లాగి పెట్టి కొడితే లాహోర్ సెంట్రల్ జైలులో పడతావ్.  ఇలాంటి తింగరి పని చేసి నన్నూ దీంట్లో ఇరికిస్తే తోలు తీస్తా. నువ్వే తప్పైంది అని సారీ చెప్తూ మెసేజ్ పెట్టు, తను అర్థం చేసుకుంటుందిలే. వెళ్ళు .. ఆగు ..
చూడు .. ప్రేమ ఎంత త్వరగా పుడితే అంతే త్వరగా అది చస్త్హుంది. ఎప్పటికైనా గుర్తుంచుకో. ఇప్పుడు వెళ్ళు."
ఒక పది నిమిషాల్లో వాడు ఎగిరి గంతులేస్తూ మళ్లీ నా దెగ్గరికి వచ్చాడు. వాడి ఆనందం చూసి నాకు భయం స్టార్ట్ అయింది.
"అన్నా.. ప్రాబ్లెమ్ సాల్వ్ అయింది. డియోనా చూడకుండా నేను ఆ మెసేజ్ డిలీట్ చేసేసా. సింపుల్, ఇక ఏ మెసేజ్ పెట్టాల్సిన అవసరం లేదు."
"అంటే..నువ్వా మెసేజ్ ఇంకా పంపలేదా?"
"లేదు..పంపాను. కాని నా sentboxలో నుండి ఆ మెసేజ్ డిలీట్ చేశాను, అంతే సింపుల్."
"ఒరయ్ ఒట్టేసి నిజం చెప్పరా, నేను ఎవరికీ చెప్పను.  నువ్వు అసలు చదివింది IIT లోనా ITI లోనా!
నీ sentbox లో నుండి మెసేజ్ డిలీట్ చేస్తే తన అకౌంట్ లో నుండి డిలీట్ అవుతుంది అని ఎలా కనుకున్నావురా, కర్మ. పోస్ట్ చేసిన మెసేజ్ అంటే  ఇన్విజిలేటర్ కి ఇచ్చేసిన ఆన్సర్ షీట్ లాంటిది. తప్పులు చేసి ఉంటే తల బాడుకోవడమే కానీ దిద్దుకోడానికి స్కోప్ లేదు. వెళ్ళు, నీ బ్రెయిన్ ని స్ట్రెయిన్ చేయకుండా నేను చెప్పింది చెయ్యీ."
"హేహే... నువ్వు ఎప్పుడు నాదే తప్పంటావ్. ఆ ఫేస్ బుక్ వాడికి ఈ చిన్న ఆప్షన్ పెట్టాలన్న ఆలోచన కూడా రాలేదు. వాడు నాకంటే పెద్ద వెదవ, వాడిని ఏమి ఆనవు" అని బాద పడుతూ వెళ్లి పోయాడు.


భగవంతుడా! ఈ అశాంత్ గాడిని దారిలో పెట్టడం కంటే ఆ తప్పిపోయిన మలేషియన్ MH370 విమానాన్ని వెతికి పట్టుకోవడం చాలా సులబం తండ్రి అని దండం పెట్టుకుని తిరిగి చూశాను - వాడు నవ్వుతూ వచ్చి మళ్లీ నా ఎదురుగా నిలబడ్డాడు.........



Sunday, March 2, 2014

మ'రణం'

"కృపయా ధ్యాన్ జిదియే..తోడి ధేర్  మే జానెవాలి  గాడి నెంబర్ ఏక్.  ఆట్.  చార్. శూన్య్.   బెంగళూరు విశాకపట్నం ప్రశాంతి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫాం నెంబర్ ధో పర్ ఖడే  హుయి హే
  ....... మె  ఐ ఎక్స్పెక్ట్  యువర్  attention  ప్లీజ్ ........."

పచ్చ రంగు పడింది. రైలు కదిలింది. ప్రస్థానం మొదలైంది. పట్టాల మీదుగా రైళ్ళు వస్తూ పోతూ ఉన్నాయి. జనాలు హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు. అప్పటి వరకు వినిపిస్తున్న వింత వింత శబ్దాలు కాస్త నెమ్మదిగా నిశబ్దంగ మారుతున్నాయి. అలలుగా నా ఆలోచనలు ... ఒక దాని వెంటూ ఒకటి గతాన్ని తవ్వుకుంటూ, జ్ఞ్యపకాల్ని వెతుకుంటూ, కాలాన్ని ఈదుకుంటూ  తీరాన్ని చేరుకుంటున్నాయి -

మనుసులో ఏదో అలజడి, 
ఏదో తెలియని అశాంతి, సమాధానం దొరకని సమస్య - ఓ ప్రశ్న! కాదు కాదు అన్ని ప్రశ్నలే. అసలు ఏది నిజం? దేన్ని నమ్మాలి?
విడిచిన స్థలమా! గడిచిన క్షణమా! 
అనుభవమా! ఆశయమా!
గమ్యమా! గమనమా!
సేవా! స్వార్థమా!
చీకటా! వెలుగా! 
నిజామా! భ్రాంతా!
ప్రేయసా! ప్రేమా! 
నేనా! తనా!

"ఏంటిరా?? అంత దీర్గంగా ఆలోచిస్తున్నావు? దేని గురించి?" అని తను చదువుతున్న పుస్తకాన్ని మూసేసి నా వైపు చూసి అడిగాడు. 

"అభి ... నీకెప్పుడూ అనిపించలేద ఈ జీవితం ఓ అంతు చిక్కని ప్రశ్నని 

నాకేమి  అర్థం కాకుండా ఉంది.....అంత తికమకగా ఉంది. 
అంతా తెలిసినట్టే ఉంటుంది ఒక నిమిషం. మరో నిమిషం అసలేమి అర్థం కాకుండా ఉంటుంది. 
దూరంగా వెలుతురుని చూపించి ఆశ పెట్టిస్తుంది. తీరా అక్కడికి వెళ్తే అది అబద్దం అని ఆట పట్టిస్తుంది. 
అందం, తెలివితో అందరిని ఊరిస్తుంది. కాని ఎవరికీ అందకుండా వాటిని పదిలంగా దాచేస్తుంది. 
అంతా నాదే, అందరూ నావాళ్ళే అని నమ్మమంటుంది. నమ్మే లోపే అవటి వాడిని చేసి, అనాదగా మార్చి ఎగతాళి చేస్తుంది.  
అభిమానం పెంచుకుంటే అది వ్యామోహం అవుతుంది. తెంచుకుంటే వైరాగ్యంగా మారుతుంది.
ముందుకి చూస్తే జీవితాన్ని ఎలా అయిన మలచుకోవొచ్చు అనే ధైర్యం. కాని వెనక్కి తిరిగి చూస్తే నేను కేవలం విధి ఆడించినట్టు ఆడే ఓ బొమ్మని అని తెలిసి భయం.
దేనికోసం ఈ ఆరాటం ఎవరికోసం ఈ పోరాటం.
బ్రతకడం కోసం భ్రమ పడాలో, భ్రమ పడడం కోసమే బ్రతకాలో తెలియట్లేదు.
జవాబు తెలియని ప్రశ్నగా మారింది నా జీవితం". 

"అసలు ఏ ఆధారం లేకుండా మనల్ని మనం మోసం చేసుకోకుండా బ్రతకడం సాధ్యమంటావా? ఈ రోజుల్లో కూడా అలా కుదురుతుందంటావా?"

"నీవు దేని కోసం మధన పడుతున్నవో నాకు తెలియదు. ఆ ప్రశ్న నీకు ఎదురైంది అంటే ఏదో సమస్యతో సతమతం అవుతున్నావని దాని అర్థం.  
కాని నూవన్న జీవితమే...ఒక్కోసారి బ్రతకాలి అనుకునే వాడిని చంపుతుంది. నా లాంటి చావలనుకునే వాడిని బ్రతికిస్తుంది, మళ్ళి ప్రశ్నగా మారుతుంది" అన్నాడు అభి. 

"ఏంటి? నువ్వు చావలనుకున్నావా? అవునా? అంత కర్మ నీకేం పట్టింది? అసలు ఎప్పుడూ చెప్పలేదే" ఆశర్యంతో అడిగాను నేను. 


"కొన్ని విషయాలు అర్థం అవ్వాలంటే 
అనుభవం కావలి, సమయం రావాలి. సమస్య ఉన్నప్పుడే సమాధానం కోసం వెతుకుతాము. సమయం వచ్చినప్పుడే అనుభవం తనని తాను రుజువు చేసుకుంటుంది.
నీకు గుర్తుందో లేదో ... చిన్నప్పుడు
నీతో తప్ప మనవారి ఎవరితో అంత స్నేహంగా ఉండే వాడిని కాను.
మీతో ఆటలు అస్సలు ఆడే వాడిని కాను.  ఎందుకో తెలుసా?
నాకు అప్పుడు ఆస్తమా ఉండేది ...శ్వాస పరంగా తీవ్రమైన సమస్యతో బాధ పడేవాడిని
ఆడితే త్వరగా అలుపోచ్చేది...చల్ల గాలి కాస్త పీలిస్తే చాలు చచ్చేంత జ్వరం వచ్చేది
మీరందరూ ఆటపాటల నడుమ ప్రేమ అనురాగాలతో హాయిగా పెరిగితే 
నేను మాత్రం రోగాల చుట్టు నిరాశ నిస్పృహల మధ్య విరక్తితో నలిగాను
బాల్యం మీఅందరికి తియ్యని అనుభూతుల్ని పంచి పెడితే
నాకు మాత్రం చేదు జ్ఞ్యాపకాల్ని విడిచపెట్టింది. 
అప్పుడు నేనెప్పుడూ మౌనంగా ఉండే వాడిని, ఒంటరిగా తిరిగే వాడిని . 
అవునూ ...  ఒంటరి అంటే  గుర్తోచ్చింది  ... నువ్వెప్పుడైన ఒంటరిగా  ఉన్నావా?
అది ఎంత బయంకరంగా ఉంటుందో తెలుసా?
జీవతాన్ని ఎంత బారంగా మలుస్తుందో నీకు తెలుసా?
ఒంటరితనం అంటే ఏకాంతంగా అందరికి దూరంగా బ్రతకడం కాదు
చుట్టూ అయిన వాళ్ళు అందరూ ఉన్నా ఎందుకు బ్రతకాలో అర్థం కాకపోవడం
అబద్దాన్ని నమ్మలేక నిజాన్ని దిగమింగ లేక ఆశ నిరాశల మధ్య తన్నుకుచావడం 
నిజం ... రోగంతో ఉన్నవాడికి జీవితమే నరకం
నా బాధను పంచుకోలేక, నా వ్యధను తీర్చలేక 
ఏమి చేయాలనీ అసహనంతో కుమిలి పోయే మా అమ్మానాన్న
.  
నేను మీతో కలవట్లేదని  మీరంతా నన్నుఆటపట్టించే వాళ్ళు కదు
కాని నాకు మీ  మీద ఏనాడూ  కోపం రాలేదు. ఎందుకో తెలుసా?
నాకు నేనంటేనే కోపం. నా జబ్బంటేనే నాకు చిరాకు. నా బాదంటేనే నాకు ద్వేషం.
బ్రతుకు పై ఆశ ఉన్నవాడికే  ఆ భగవంతుడి ఆశీర్వాదం. 
చావు తో చెలిమి చేసే నా పై తనకెక్కడిది మమకారం. 
మీరందరూ అనుకునట్టే నేను పారిపోవాలి అనుకున్నాను. 
కాని అది ఊరి నుండి మాత్రమే కాదు నా బ్రతుకు నుండే పారిపోవాలి అనుకున్నాను. 
చచ్చిపోవాలని అని నిర్ణయించుకున్నాను. 
ఓ రాత్రి,  ఇదిగో  ఈలాంటి పట్టాల మీదే  పడి ప్రాణం విడవాలి అని పడుకున్నాను.
గట్టిగా కళ్ళుమూసుకొని, చావు కోసం పది నిమిషాల పాటు ఎదురు చూసాను.
ఊపిరి పోసుకోడానికే  కాదు, ప్రాణం తీసుకోడానికి కూడా బాధను బదలుగా చెల్లించాలి.
ఆ భయంతో నా వళ్ళంతా చల్ల బడిపోయింది. నరాలు  బిగుసుకుపోయాయి. క్షణాల్లో రక్తం పోటెత్తింది. నా గుండె చప్పుడు తప్ప నాకు ఇంకే చెప్పుడు వినిపించలేదు. అప్పుడు కనిపించింది నా చావు .... అది పట్టాలగుండగా పరిగెత్తుకొస్తుంది. ఆలోచన ఆగి పోయింది, ఉనికి కోల్పోయింది.
ఆ క్షణం ఓ యుగం. ఆ రాత్రి ఓ  నమ్మలేని నిజం.  ఆ భయం నన్ను ఇంకా వెంటాడే నా గతం.
రెండు క్షణాల తర్వాత కళ్ళు తెరిచాను. పట్టాల పక్కన్న పడి ఉన్నాను. భయంకరమైన శబ్దం చేస్తూ పట్టాల మీదుగా నా పక్కనుండి వెళ్ళిపోయింది చావు. 

అటుగా వెళ్తున్న ఓ ముక్కూ మొహం తెలియని వ్యక్తి నన్ను ప్రక్కకి లాగేసి రక్షించాడు.
నన్ను చావనివ్వనందుకు  కోపడాలో, బ్రతికిన్చినందుకు కృతజ్ఞతలు తెలపాలో తెలియాక తను వైపు మౌనంగా చూస్తూ ఉండి పోయాను. తను నన్నేమి తిట్టలేది, ఎందుకు ఆ పని చేసానని ఆరా తీయలేదు. అన్నీ తెలిసినవాడిలా, ఒక అన్నలా నా చెయ్యి పట్టుకొని వాళ్ళ ఇంటికి  తీసుకెళ్ళి జరిగిందంతా వాళ్ళ అమ్మతో చెప్పాడు. నా వ్యధను విని ఆ అమ్మ ఆవేదన పడింది, బాధతో కన్నీరు పెట్టుకుంది. అన్నం పెడుతూ తానన్న మాటలు  ఇంకా నాకు వినిపిస్తునే ఉన్నాయి  -

"చూడూ బాబు, ఓ కన్న తల్లిగా చెబుతున్న నీవు తీసుకెళ్ళేది నీ ప్రాణం మాత్రమే కాదు - ఓ తల్లి ఆశల్ని, ఓ తండ్రి కలల్ని, ఓ కుటుంబ గౌరవాన్ని, అన్నిటికీ మించి మనిషి తనపై తాను పెట్టుకున్న నమ్మకాన్ని. ఈ ఎనబై యేండ్ల వయసులో కూడా చావుతో నిత్యం పోట్లాడుతూ బ్రతకడానికి ఎందుకు మధన పడుతున్నానో తెలుసా? నా కొడుకు కోసమే! వాడిని అనాధగా వదిలి వెళ్ళడం మనసోప్పకే. బ్రతకడానికి తర్కము అవసరమే, కాదనను, కాని ఎల్లప్పుడూ తర్కముతో బ్రతకలేము. విధిని ఎదురీదాలంటే కొంత భ్రాంతిని పడవలా వాడక తప్పదు"

ఆ మాటలు విన్నాక ఆవిడ ఔదార్యం ముందు నా రోగం చిన్నదనిపించింది. మొట్టమొదటి సారిగా నాకు నా పైనే జాలి కలిగింది. అంతవరకు గూడు కట్టుకున్న నా బాధని, కోపాన్ని అది కన్నీరుతో కడిగింది. చీకట్లు అలుముకున్న నా మనసులో ఆ మాటలే వెలుతురుని నింపాయి. వారికది చిన్న సహాయమే అవ్వొచ్చు, వినడానికి  నీకు చిన్న కారణం అనిపించొచ్చు. నాకు మాత్రం నా బ్రతుకుని నాకు తిరిగిచ్చిన పెద్ద బహుమానం.

సత్యం ఎప్పుడు అద్బుతంగా ఉండ వలసిన అవసరం లేదు. అది సహజంగానే సాదారణంగా ఉంటుంది.
వెలుగెంత నిజమో చీకటి అంతే నిజం. వ్యామోహం ఎంత అవసరమో వైరాగ్యం అంతే అవసరం. బ్రతుకు ఎంత సహజమో, చావు అంతే సహజం. విధిని నేనెంతగా మలచాలి అనుకున్నానో అది నన్నంతగా మలచింది.

నిజమే! సృష్టిలో అన్నీ వైరుద్ద్యాలే. నిత్యం ఒక దానితో మరో దానికి యుద్దమే. 
కానీ, యుద్ధం మాత్రమే కలకాలం,  గెలుపు ఓటమి కేవలం తాత్కాలికం. 
నువ్వన్నట్టు జీవితం ఒక చిక్కుముడే. అంతు చిక్కని ప్రశ్నే. గమ్యమే లేని గమనము అయ్యి ఉండొచ్చు. 
కాని అదే దాని అందమేమో. అదే దాని సమాధానమేమో. 
కథ తెలిసిన పుస్తకాన్ని చదవాలని ఎవరు ఆశ పడతారు?
ఫలితం తెలిసిన ఆటని ఆడడానికి ఎవడు పూనుకుంటాడు?
ప్రాణి బ్రతకడానికి ఆకలే ఆధారం. సృష్టి నిలవడానికి ఈ ముడే మూలమేమో!"