Sunday, March 2, 2014

మ'రణం'

"కృపయా ధ్యాన్ జిదియే..తోడి ధేర్  మే జానెవాలి  గాడి నెంబర్ ఏక్.  ఆట్.  చార్. శూన్య్.   బెంగళూరు విశాకపట్నం ప్రశాంతి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫాం నెంబర్ ధో పర్ ఖడే  హుయి హే
  ....... మె  ఐ ఎక్స్పెక్ట్  యువర్  attention  ప్లీజ్ ........."

పచ్చ రంగు పడింది. రైలు కదిలింది. ప్రస్థానం మొదలైంది. పట్టాల మీదుగా రైళ్ళు వస్తూ పోతూ ఉన్నాయి. జనాలు హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు. అప్పటి వరకు వినిపిస్తున్న వింత వింత శబ్దాలు కాస్త నెమ్మదిగా నిశబ్దంగ మారుతున్నాయి. అలలుగా నా ఆలోచనలు ... ఒక దాని వెంటూ ఒకటి గతాన్ని తవ్వుకుంటూ, జ్ఞ్యపకాల్ని వెతుకుంటూ, కాలాన్ని ఈదుకుంటూ  తీరాన్ని చేరుకుంటున్నాయి -

మనుసులో ఏదో అలజడి, 
ఏదో తెలియని అశాంతి, సమాధానం దొరకని సమస్య - ఓ ప్రశ్న! కాదు కాదు అన్ని ప్రశ్నలే. అసలు ఏది నిజం? దేన్ని నమ్మాలి?
విడిచిన స్థలమా! గడిచిన క్షణమా! 
అనుభవమా! ఆశయమా!
గమ్యమా! గమనమా!
సేవా! స్వార్థమా!
చీకటా! వెలుగా! 
నిజామా! భ్రాంతా!
ప్రేయసా! ప్రేమా! 
నేనా! తనా!

"ఏంటిరా?? అంత దీర్గంగా ఆలోచిస్తున్నావు? దేని గురించి?" అని తను చదువుతున్న పుస్తకాన్ని మూసేసి నా వైపు చూసి అడిగాడు. 

"అభి ... నీకెప్పుడూ అనిపించలేద ఈ జీవితం ఓ అంతు చిక్కని ప్రశ్నని 

నాకేమి  అర్థం కాకుండా ఉంది.....అంత తికమకగా ఉంది. 
అంతా తెలిసినట్టే ఉంటుంది ఒక నిమిషం. మరో నిమిషం అసలేమి అర్థం కాకుండా ఉంటుంది. 
దూరంగా వెలుతురుని చూపించి ఆశ పెట్టిస్తుంది. తీరా అక్కడికి వెళ్తే అది అబద్దం అని ఆట పట్టిస్తుంది. 
అందం, తెలివితో అందరిని ఊరిస్తుంది. కాని ఎవరికీ అందకుండా వాటిని పదిలంగా దాచేస్తుంది. 
అంతా నాదే, అందరూ నావాళ్ళే అని నమ్మమంటుంది. నమ్మే లోపే అవటి వాడిని చేసి, అనాదగా మార్చి ఎగతాళి చేస్తుంది.  
అభిమానం పెంచుకుంటే అది వ్యామోహం అవుతుంది. తెంచుకుంటే వైరాగ్యంగా మారుతుంది.
ముందుకి చూస్తే జీవితాన్ని ఎలా అయిన మలచుకోవొచ్చు అనే ధైర్యం. కాని వెనక్కి తిరిగి చూస్తే నేను కేవలం విధి ఆడించినట్టు ఆడే ఓ బొమ్మని అని తెలిసి భయం.
దేనికోసం ఈ ఆరాటం ఎవరికోసం ఈ పోరాటం.
బ్రతకడం కోసం భ్రమ పడాలో, భ్రమ పడడం కోసమే బ్రతకాలో తెలియట్లేదు.
జవాబు తెలియని ప్రశ్నగా మారింది నా జీవితం". 

"అసలు ఏ ఆధారం లేకుండా మనల్ని మనం మోసం చేసుకోకుండా బ్రతకడం సాధ్యమంటావా? ఈ రోజుల్లో కూడా అలా కుదురుతుందంటావా?"

"నీవు దేని కోసం మధన పడుతున్నవో నాకు తెలియదు. ఆ ప్రశ్న నీకు ఎదురైంది అంటే ఏదో సమస్యతో సతమతం అవుతున్నావని దాని అర్థం.  
కాని నూవన్న జీవితమే...ఒక్కోసారి బ్రతకాలి అనుకునే వాడిని చంపుతుంది. నా లాంటి చావలనుకునే వాడిని బ్రతికిస్తుంది, మళ్ళి ప్రశ్నగా మారుతుంది" అన్నాడు అభి. 

"ఏంటి? నువ్వు చావలనుకున్నావా? అవునా? అంత కర్మ నీకేం పట్టింది? అసలు ఎప్పుడూ చెప్పలేదే" ఆశర్యంతో అడిగాను నేను. 


"కొన్ని విషయాలు అర్థం అవ్వాలంటే 
అనుభవం కావలి, సమయం రావాలి. సమస్య ఉన్నప్పుడే సమాధానం కోసం వెతుకుతాము. సమయం వచ్చినప్పుడే అనుభవం తనని తాను రుజువు చేసుకుంటుంది.
నీకు గుర్తుందో లేదో ... చిన్నప్పుడు
నీతో తప్ప మనవారి ఎవరితో అంత స్నేహంగా ఉండే వాడిని కాను.
మీతో ఆటలు అస్సలు ఆడే వాడిని కాను.  ఎందుకో తెలుసా?
నాకు అప్పుడు ఆస్తమా ఉండేది ...శ్వాస పరంగా తీవ్రమైన సమస్యతో బాధ పడేవాడిని
ఆడితే త్వరగా అలుపోచ్చేది...చల్ల గాలి కాస్త పీలిస్తే చాలు చచ్చేంత జ్వరం వచ్చేది
మీరందరూ ఆటపాటల నడుమ ప్రేమ అనురాగాలతో హాయిగా పెరిగితే 
నేను మాత్రం రోగాల చుట్టు నిరాశ నిస్పృహల మధ్య విరక్తితో నలిగాను
బాల్యం మీఅందరికి తియ్యని అనుభూతుల్ని పంచి పెడితే
నాకు మాత్రం చేదు జ్ఞ్యాపకాల్ని విడిచపెట్టింది. 
అప్పుడు నేనెప్పుడూ మౌనంగా ఉండే వాడిని, ఒంటరిగా తిరిగే వాడిని . 
అవునూ ...  ఒంటరి అంటే  గుర్తోచ్చింది  ... నువ్వెప్పుడైన ఒంటరిగా  ఉన్నావా?
అది ఎంత బయంకరంగా ఉంటుందో తెలుసా?
జీవతాన్ని ఎంత బారంగా మలుస్తుందో నీకు తెలుసా?
ఒంటరితనం అంటే ఏకాంతంగా అందరికి దూరంగా బ్రతకడం కాదు
చుట్టూ అయిన వాళ్ళు అందరూ ఉన్నా ఎందుకు బ్రతకాలో అర్థం కాకపోవడం
అబద్దాన్ని నమ్మలేక నిజాన్ని దిగమింగ లేక ఆశ నిరాశల మధ్య తన్నుకుచావడం 
నిజం ... రోగంతో ఉన్నవాడికి జీవితమే నరకం
నా బాధను పంచుకోలేక, నా వ్యధను తీర్చలేక 
ఏమి చేయాలనీ అసహనంతో కుమిలి పోయే మా అమ్మానాన్న
.  
నేను మీతో కలవట్లేదని  మీరంతా నన్నుఆటపట్టించే వాళ్ళు కదు
కాని నాకు మీ  మీద ఏనాడూ  కోపం రాలేదు. ఎందుకో తెలుసా?
నాకు నేనంటేనే కోపం. నా జబ్బంటేనే నాకు చిరాకు. నా బాదంటేనే నాకు ద్వేషం.
బ్రతుకు పై ఆశ ఉన్నవాడికే  ఆ భగవంతుడి ఆశీర్వాదం. 
చావు తో చెలిమి చేసే నా పై తనకెక్కడిది మమకారం. 
మీరందరూ అనుకునట్టే నేను పారిపోవాలి అనుకున్నాను. 
కాని అది ఊరి నుండి మాత్రమే కాదు నా బ్రతుకు నుండే పారిపోవాలి అనుకున్నాను. 
చచ్చిపోవాలని అని నిర్ణయించుకున్నాను. 
ఓ రాత్రి,  ఇదిగో  ఈలాంటి పట్టాల మీదే  పడి ప్రాణం విడవాలి అని పడుకున్నాను.
గట్టిగా కళ్ళుమూసుకొని, చావు కోసం పది నిమిషాల పాటు ఎదురు చూసాను.
ఊపిరి పోసుకోడానికే  కాదు, ప్రాణం తీసుకోడానికి కూడా బాధను బదలుగా చెల్లించాలి.
ఆ భయంతో నా వళ్ళంతా చల్ల బడిపోయింది. నరాలు  బిగుసుకుపోయాయి. క్షణాల్లో రక్తం పోటెత్తింది. నా గుండె చప్పుడు తప్ప నాకు ఇంకే చెప్పుడు వినిపించలేదు. అప్పుడు కనిపించింది నా చావు .... అది పట్టాలగుండగా పరిగెత్తుకొస్తుంది. ఆలోచన ఆగి పోయింది, ఉనికి కోల్పోయింది.
ఆ క్షణం ఓ యుగం. ఆ రాత్రి ఓ  నమ్మలేని నిజం.  ఆ భయం నన్ను ఇంకా వెంటాడే నా గతం.
రెండు క్షణాల తర్వాత కళ్ళు తెరిచాను. పట్టాల పక్కన్న పడి ఉన్నాను. భయంకరమైన శబ్దం చేస్తూ పట్టాల మీదుగా నా పక్కనుండి వెళ్ళిపోయింది చావు. 

అటుగా వెళ్తున్న ఓ ముక్కూ మొహం తెలియని వ్యక్తి నన్ను ప్రక్కకి లాగేసి రక్షించాడు.
నన్ను చావనివ్వనందుకు  కోపడాలో, బ్రతికిన్చినందుకు కృతజ్ఞతలు తెలపాలో తెలియాక తను వైపు మౌనంగా చూస్తూ ఉండి పోయాను. తను నన్నేమి తిట్టలేది, ఎందుకు ఆ పని చేసానని ఆరా తీయలేదు. అన్నీ తెలిసినవాడిలా, ఒక అన్నలా నా చెయ్యి పట్టుకొని వాళ్ళ ఇంటికి  తీసుకెళ్ళి జరిగిందంతా వాళ్ళ అమ్మతో చెప్పాడు. నా వ్యధను విని ఆ అమ్మ ఆవేదన పడింది, బాధతో కన్నీరు పెట్టుకుంది. అన్నం పెడుతూ తానన్న మాటలు  ఇంకా నాకు వినిపిస్తునే ఉన్నాయి  -

"చూడూ బాబు, ఓ కన్న తల్లిగా చెబుతున్న నీవు తీసుకెళ్ళేది నీ ప్రాణం మాత్రమే కాదు - ఓ తల్లి ఆశల్ని, ఓ తండ్రి కలల్ని, ఓ కుటుంబ గౌరవాన్ని, అన్నిటికీ మించి మనిషి తనపై తాను పెట్టుకున్న నమ్మకాన్ని. ఈ ఎనబై యేండ్ల వయసులో కూడా చావుతో నిత్యం పోట్లాడుతూ బ్రతకడానికి ఎందుకు మధన పడుతున్నానో తెలుసా? నా కొడుకు కోసమే! వాడిని అనాధగా వదిలి వెళ్ళడం మనసోప్పకే. బ్రతకడానికి తర్కము అవసరమే, కాదనను, కాని ఎల్లప్పుడూ తర్కముతో బ్రతకలేము. విధిని ఎదురీదాలంటే కొంత భ్రాంతిని పడవలా వాడక తప్పదు"

ఆ మాటలు విన్నాక ఆవిడ ఔదార్యం ముందు నా రోగం చిన్నదనిపించింది. మొట్టమొదటి సారిగా నాకు నా పైనే జాలి కలిగింది. అంతవరకు గూడు కట్టుకున్న నా బాధని, కోపాన్ని అది కన్నీరుతో కడిగింది. చీకట్లు అలుముకున్న నా మనసులో ఆ మాటలే వెలుతురుని నింపాయి. వారికది చిన్న సహాయమే అవ్వొచ్చు, వినడానికి  నీకు చిన్న కారణం అనిపించొచ్చు. నాకు మాత్రం నా బ్రతుకుని నాకు తిరిగిచ్చిన పెద్ద బహుమానం.

సత్యం ఎప్పుడు అద్బుతంగా ఉండ వలసిన అవసరం లేదు. అది సహజంగానే సాదారణంగా ఉంటుంది.
వెలుగెంత నిజమో చీకటి అంతే నిజం. వ్యామోహం ఎంత అవసరమో వైరాగ్యం అంతే అవసరం. బ్రతుకు ఎంత సహజమో, చావు అంతే సహజం. విధిని నేనెంతగా మలచాలి అనుకున్నానో అది నన్నంతగా మలచింది.

నిజమే! సృష్టిలో అన్నీ వైరుద్ద్యాలే. నిత్యం ఒక దానితో మరో దానికి యుద్దమే. 
కానీ, యుద్ధం మాత్రమే కలకాలం,  గెలుపు ఓటమి కేవలం తాత్కాలికం. 
నువ్వన్నట్టు జీవితం ఒక చిక్కుముడే. అంతు చిక్కని ప్రశ్నే. గమ్యమే లేని గమనము అయ్యి ఉండొచ్చు. 
కాని అదే దాని అందమేమో. అదే దాని సమాధానమేమో. 
కథ తెలిసిన పుస్తకాన్ని చదవాలని ఎవరు ఆశ పడతారు?
ఫలితం తెలిసిన ఆటని ఆడడానికి ఎవడు పూనుకుంటాడు?
ప్రాణి బ్రతకడానికి ఆకలే ఆధారం. సృష్టి నిలవడానికి ఈ ముడే మూలమేమో!"